మంగళగిరిలో ఫాల్గుణ మాసంలో శుద్ధ షష్టి నాడు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు.11 రోజులపాటు ఎంతో వైభవంగా కొనసాగుతాయి. ఈ ఉత్సవాలలో చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి, శ్రీదేవి, భూదేవులకు కళ్యాణం కడు రమణీయంగా జరుగుతుంది.
మరునాడు. అంటే పౌర్ణమిరోజు జరిగే రథోత్సవంలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు.కనీసం ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు.
శ్రీనరసింహుడు భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించినమూర్తి. వేడుకున్న వెంటనే ఆపదలలో ఉన్న భక్తులను, కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన వెలసిన పవిత్ర నారసింహ క్షేత్రమే మంగళగిరి. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలి గోపురం. మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి.
కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం.
హిరణ్యకశిపుని వధానంతరం శ్రీనరసింహస్వామి చాలా భయంకరరూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ ఉన్నారు.దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితంకనబడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం
సమర్పించింది. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఈయనకు భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.
పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి. మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవడం విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం ఉంది. సర్వ మంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతం మంగళగిరి అయింది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవి. కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీవ్ర ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ దీపం పెడతామని మొక్కుకొని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. స్వామి అమ్మవార్ల కల్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తజనానికి ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల దర్శనం మహా పుణ్యఫలమని భక్తులు విశ్వసిస్తారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 05 నుండి జరుగుతాయి
మార్చి 06 - ధ్వజారోహణం
మార్చి 07 - హనుమంత వాహనం (రాత్రి 7 )
మార్చి 08 - రాజాధిరాజా వాహనం
మార్చి 09 - యాలి వాహనం
మార్చి 10 - చిన్న శేష వాహనం , సింహ వాహనం
మార్చి 11 - హంస వాహనం(ఉదయం), గజ వాహనం(రాత్రి)
మార్చి 12 - కల్పవృక్ష వాహనం (ఉదయం), పొన్న వాహనం (రాత్రి)
మార్చి 13 - అశ్వ వాహనం, స్వామివారి కళ్యాణం (అర్ధరాత్రి 12 )
మార్చి 14 - గరుడ వాహనం (తెల్లవారుజామున ), రథోత్సవం (మధ్యాహ్నం 3 కి)
మార్చి 15 - వసంతోత్సవం
మార్చి 16 - పుష్పయాగం
No comments:
Post a Comment