దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. శతాబ్దాలుగా జరుగుతున్న ఈ జాతరలో అమ్మవారి భక్తులు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ సమయానికి వెంకటగిరి వస్తారు. జాతరలో అన్ని మతాల వారు పాల్గొని మొక్కులు చెల్లిస్తారు.
జాతర వేడుక వెంకటగిరిలో ఎప్పుడు మొదలైందో కచ్చితంగా చెప్పలేకపోయినా 1714లో జాతర జరిగినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. 1913 నుంచి ఈ జాతర వైభవం ఏటేటా పెరుగుతూ వస్తోంది. 1919లో కలరా వ్యాధికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లడంతో అప్పటి వెంకటగిరి రాజా 29వ తరానికి చెందిన గోవింద కృష్ణ యాచేంద్ర శీతల యాగం జరిపించి ఆ ఏడాది గ్రామశక్తి జాతరను వేడుకగా నిర్వహించారని పెద్దలు చెబుతారు. అప్పటి నుంచి ఏటికేడు అమ్మవారి జాతరకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఆది నుంచి వెంకటగిరి రాజాల ఆధ్వర్యంలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర జరిగేది.
ఈ జాతరకు ఏటేటా భక్తులు లక్షలాదిగా పోటెత్తుతుండటంతో రెండు దశాబ్దాల కిత్రమే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని జాతర నిర్వహిస్తోంది. అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం నేటికీ జాతర చాటింపు జరిగేది రాజాల అనుమతి తీసుకున్న తర్వాతే జాతరకు మూడు వారాల ముందుగానే చాటింపు వేస్తారు. ఏటా వినాయక చవితి తర్వాత మొదటి బుధవారం అర్ధరాత్రి జాతర మూడో బుధ, గురువారాల్లో జరుగుతుందని చాటింపు వేస్తారు.
అప్పటి నుంచి అందరూ జాతర పనుల్లో నిమగ్నమవుతారు. జాతర పూర్తయ్యే వరకూ గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. గురువారం సాయంత్రం వరకు భక్తులు అమ్మవారి సేవలో తరిస్తారు. తల్లిని విరూపం చేసేందుకు తీసుకువెళ్లే సమయంలో లక్షలాది మంది రోడ్ల వెంబడి పడిగాపులు కాసి పోలేరమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
No comments:
Post a Comment