Kasapuram Anjaneya Temple: కసాపురం ఆంజనేయ స్వామి

 

ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ, రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకీ పెద్దది. 

ఈ క్షేత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది.ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయస్వామిగా కొలువుదీరాడు. నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువలన మనం కుడి కన్నును మాత్రం చూడగలం. 

విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తుశకం 1521లో శ్రీ వ్యాసరాయుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు. ప్రతి రోజూ తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి పై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరోచోటకి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారుచేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని చెబుతారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయుల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో కనిపిస్తాడు.

నీవు దక్షిణ దిశగా వెళ్లు… అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురుస్తుంది. అక్కడే నేను ఉంటాను. నాకు ఆలయాన్ని కట్టించు అని చెబుతాడు. ఆంజనేయస్వామి సూచన మేరకు మరుసటి రోజు ఉదయం వ్యాసరాయులు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేపచెట్టును చూస్తాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురుస్తుంది. ఆ చెట్టు కింద తవ్వగా అంజేయస్వామి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మిస్తాడు. 


ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్లి వస్తుంటాడని భక్తుల నమ్మకం. అంతే కాదు నేటికీ ఇక్కడ స్వామి వారి పాదుకలుగా చెప్పుకునే పాదరక్షలకు పూజలందుకోవడం చూడవచ్చు. ఈ పాదరక్షలు భుజంపై తాకిస్తే.. సకల దోషాలు తొలుగుతాయనిు భక్తుల నమ్మకం ఇలా ఎన్నో విశిష్టతలు, మహిమలు గల ఈ క్షేత్రంలో స్వామి వారు నిత్య పూజలందుకుంటారు. 

ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు. ఏటా, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇక్కడ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం అత్యంత విశిష్టత. 

భూత, ప్రేత, గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వద్దకు వస్తుంటారు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు.. స్వామి స్మరిస్తే.. అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఏటా రామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను ఘనంగా నిర్వహిస్తారు.

Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Shunya Masam: శూన్యమాసం అంటే ఏంటి

Lord Shiva Pradaskhina: శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి కొన్ని నియమాలు

Navagraha: నవగ్రహాలు - మానవ శరీరం

Pancha Kedar Temples: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Human Duties: మానవ ధర్మములు

Random posts