మాఘ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం
విప్రునికి శ్రీహరి సాక్షాత్కారం
విప్రుని తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై "ఓ విప్రోత్తమా! నీ తపస్సుకు కారణమేమిటి?" అని ప్రశ్నించగా ఆ విప్రుడు శ్రీహరికి నమస్కరించి ఈ విధంగా పలికెను "ఓ పురుషోత్తమా! నీ దయ వల్ల నాకు పుత్ర సంతానం కలిగింది. ఒకనాడు నారదుడు వచ్చి నా కుమారునికి పన్నెండేళ్లు మాత్రమే ఆయుర్దాయం కలదని చెప్పెను. నా పుత్రునికి దీర్ఘాయువు కోరి నేను ఈ తపస్సు చేస్తున్నాను" అని పలికాడు.
విప్ర దంపతుల గత జన్మ వృత్తాంతాన్ని వివరించిన శ్రీహరి
అంత ఆ శ్రీహరి ఆ విప్రునితో "నారదుడు చెప్పింది నిజమే! నీ కుమారునికి పన్నెండు సంవత్సరాలకు గండం ఉంది. ఇందుకు కారణం నీ భార్య చేసిన పాపం. అదేమిటో చెబుతాను వినుము. నీ భార్య పూర్వజన్మలో గొప్ప తపఃశాలి కుమార్తె. ఆ జన్మలో నీవు జ్ఞానశర్మ అనే బ్రాహ్మణుడవు. ఆమె నీ ఇల్లాలు. అయితే ఒకానొక మాఘమాసంలో నీవు నీ భార్యతో పరమ పవిత్రమైన మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండగా సూర్యోదయం వేళ నదీస్నానం చేయమని ఆమెకు చెప్పావు. నీ మాట మన్నించి ఆమె అలాగే చేసింది. కానీ మాఘ పౌర్ణిమ రోజు పాయసాన్నం దానం చేయమని చెప్పిన నీ మాటను ఆమె ధిక్కరించింది. మాఘవ్రతం ఆచరించిన పుణ్యం కారణంగా మీరు ఈ జన్మలో కూడా దంపతులుగా జన్మించారు. నీ భార్య పూర్వజన్మలో మాఘస్నానం చేసిన పుణ్యం కారణంగా పుత్రుడు జన్మించాడు కానీ పాయసాన్నం దానం చేయమన్న నీ ఆజ్ఞను ధిక్కరించిన పాపం కారణంగా ఈ జన్మలో మీ పుత్రుడు అల్పాయుష్కుడయ్యాడు.
గండం పోయే మార్గం చెప్పిన శ్రీహరి
విప్రునితో శ్రీహరి "ఓ విప్రోత్తమా! నీ కుమారుని మాఘమాసంలో సూర్యోదయ సమయంలో గంగానదిలో స్నానం చేయించు. దానితో అతని గండం తొలగి దీర్ఘాయుష్మంతుడవుతాడు. మాఘ స్నానం ఎలాంటి పాపాలనైనా, ఎలాంటి గండాలనైనా తొలగిస్తుంది. స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు మాఘ మాసంలో మాఘ స్నానం చేసి మాఘ వ్రతం చేసి శ్రీహరిని పూజిస్తే ఆరోగ్యం, సంపదలు, పుత్రపౌత్రులతో వంశాభివృద్ధి కలుగుతుంది. మాఘ స్నానంతో పాపులు పుణ్యాత్ములు అవుతారు, రోగులు ఆరోగ్యవంతులు అవుతారు, వృద్ధులు వైకుంఠప్రాప్తిని పొందుతారు, దరిద్రులు ధనవంతులు అవుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చి ముక్తిని ఇచ్చే సాధనం మాఘస్నానం. కావున ఆలస్యం చేయకుండా నీ పుత్రుని గంగానదిలో స్నానం చేయించు" అని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు.
విప్ర పుత్రునికి తొలగిన గండం
శ్రీహరి ఆదేశం మేరకు విప్రుడు తన కుమారుని మాఘ మాసంలో గంగానదిలో స్నానం చేయించి అతనిచేత మాఘ వ్రతాన్ని చేయించాడు. మాఘవ్రత మహత్యంతో ఆ బాలునికి మరణ భయం నశించింది. అతడు చిరంజీవి అయ్యాడు.
గృత్స్నమదమహర్షి జహ్నుమహర్షితో ఈ కథను చెప్పి "ఓ జహ్నువు! మాఘ స్నానంతో చిరంజీవి అయిన పుత్రునితో ఆ విప్ర దంపతులు చిరకాలం సుఖంగా జీవించారు. కొన్నిరోజులకు ఆ విప్రుడు యోగాభ్యాసం చేత శరీరాన్ని విడిచి విష్ణులోకాన్ని పొందాడు. అతని భార్య కూడా పతిని అనుసరించింది. చూసావుగా! మాఘ మాసం మాధవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. యజ్ఞాది కర్మలు చేసిన ఫలాన్ని ఇస్తుంది. సకల సంపదలను కలుగజేస్తుంది. మాఘ మాసంలో ఎవరైతే ఈ కథను వింటారో వారికి మాఘవ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది." అని చెబుతూ గృత్స్నమదమహర్షి పంతొమ్మిదో అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ఏకోనవింశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment