అమ్మవారి శక్తిరూపాల్లో వారాహి దేవి ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా పూజిస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది.
ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో ఉన్న శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మణి..ఇలా వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించింది. రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది వారాహి.
- దేవీ మాహాత్మ్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతడి సేనను సంహరిస్తుంది.
- వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి ఉద్భవించింది.
- మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును.
- మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడు సృష్టించిన శక్తిగా చెబుతారు.
- లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్ర నామంలో కూడా ఉంటుంది.
- వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, అపార జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ చెబుతారు.
- వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో వారాహిని పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో ఉంటూ మణిపూర, స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
వారణాసికి గ్రామ దేవత వారాహి
వారాహి వారణాసికి గ్రామదేవత. కాశీలో ఉన్న వారాహి ఆలయానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లే వీలుండదు. భూ గర్భ గృహంలో ఉండే ఈ ఆలయం నిత్యం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామ దేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట. ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి.. ఒక రంధ్రంలోనుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం..మరో రంధ్రం నుంచి అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. దుష్ట శక్తులను అణిచేసే వారాహి అమ్మవారి ఆలయం వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపు ఉంటుంది .
No comments:
Post a Comment