చిత్తూరుజిల్లా, వాల్మీకిపురం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని 'తరిగొండ' ప్రాంతంలో పూర్వం ఒక ఇల్లాలు పెరుగును చిలుకుతూ ఉన్న సమయంలో కుండలో సాలగ్రామ శిలారూపంలో శ్రీనృసింహస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల ఈ ప్రాంతానికి తరికుండ అనే పేరు ఏర్పడినట్లు స్థలపురాణం. తరికుండ ప్రజలవాడుకలో తరిగొండ అయింది.
స్థలపురాణం
పూర్వం ఈ ప్రాంతం అంతా అడవిగా ఉండేది. ఈ అడవిలో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకొని పశువులు పెంచుతూ పాలు, పెరుగు, మజ్జిగ వంటివి సమీప గ్రామాల ప్రజలకు సరఫరా చేస్తూ జీవనం సాగించే వారు. ఒక రోజు ఉదయాన్నే ఒక స్త్రీ రాత్రి తోడుపెట్టిన పాలు పెరుగు కాగా కవ్వంతో చిలకడం ప్రారంభించింది. కొంతసేపటికి కుండలో కవ్వానికి అడ్డంగా ఎదో ఒక శిల కనిపించింది. అంతకముందు రోజు రాత్రే 'రామనాయనిం గారు' అనే పాలేగారుకు స్వప్నంలో దర్శన మిచ్చి శ్రీనృసింహ స్వామి గ్రామంలో స్వయంభువుగా దర్శనమిస్తానని.. ఆలయం నిర్మించమని ఆదేశించాడు. మజ్జిగ కుండలో స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలారూపంలో కనిపించిన విషయాన్ని ఆ మహిళ గ్రామస్థులకు తెలపడంతో ఈ విషయం పాలెగారుకు తెలిసి ఆయన ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పూజలందుకున్న స్వామి
పరమభాగవతోత్తమురాలు భక్తకవయిత్రి వెంగమాంబ తన జన్మస్థలం కూడా ఈ గ్రామమే. ఈ తరిగొండ గ్రామంలోని నృసింహస్వామి ఆలయంలో వెంగమాంబ పూజలు చేయడంతో పాటు ఆలయంలోని ఆంజనేయ స్వామి వెనుకవైపున ఉన్న స్థలంలో కూర్చుని తపస్సు చేస్తూ ఉండేది. వెంగమాంబ పూజలను అందుకున్న దేవుడు శ్రీతరిగొండ లక్ష్మీనృసింహస్వామి. తర్వాత ఆమె తిరుమలకు చేరుకున్నారు.
ఆలయ విశేషాలు
తరిగొండ గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కనే ఆలయం తూర్పు అభిముఖంగా ఉంది. ఆలయ ప్రధాన ప్రవేశద్వారంపై మూడు అంతస్తుల గోపురం ఉంది. విశాలమైన ప్రాంగణంలో ప్రధాన ఆలయం, ఉపాలయాలు కనులవిందు చేస్తూ దర్శనం ఇస్తాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడమండపం, ధ్వజ స్తంభం, సత్యప్రమాణాల పీఠం ఉన్నాయి. సత్యప్రమాణాల పీఠం వద్ద ప్రమాణం చేసి ప్రజలు నిజమే చెబుతారని అబద్ధం చెప్పరని విశ్వాసం. అందువల్ల ఈ క్షేత్రాన్ని "సత్య ప్రమాణాల క్షేత్రం" అని పేర్కొంటారు.
ప్రధాన ఆలయం మహామండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి ఉంది, ముఖ మండపంలో ఉత్తరాభిముఖంగా ఉన్న గర్భాలయంలో శ్రీఆంజనేయస్వామి వారు కొలువు దీరి పూజలందుకుంటూ ఉన్నాడు. ఈ స్వామి వెనుకవైపే మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ ఆసీనురాలై తపస్సు చేసినట్లు చెప్పబడుతోంది. ప్రధాన గర్భాలయంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి చతుర్భు జాలతో ఆసీనమూర్తిగా కొలువుదీరి ఉన్నాడు. వామాంక మున లక్ష్మీదేవిని ఆసీనురాలిని చేసుకుని రెండుచేతులలో శంఖచక్రాలను మరోచేతిలో అభయముద్రను ధరించి ఇంకొక చేతితో వామంకమున గల లక్ష్మీదేవిని పట్టుకుని దివ్యమనోహరరూపంతో భక్తులపై కరుణాకటాక్షాలను ప్రస రింప చేస్తూ దర్శనం ఇస్తాడు. ఆలయప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎడమ వైపున ప్రత్యేక ఆలయంలో స్వామివారి దేవేరులు కొలువుదీరి ఉన్నారు. శ్రీ చెంచులక్ష్మి, శ్రీలక్ష్మిదేవి అమ్మవారలు ఒకే గర్భాలయంలో ఒకరి వెనుక ఒకరు కొలువుదీరి ఉండడం విశేషం. ఆలయ ప్రధాన గోపురం సమీపంలో ఆలయప్రాంగణంలో శ్రీతరిగొండ వెంగమాంబ విగ్రహమూర్తిగా కొలువుదీరి దర్శనం ఇస్తారు.
ఉత్సవాలు
తరిగొండ శ్రీలక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో శుక్లపక్షనవమి మొదలుకుని బహుళ పక్ష విదియ వరకు జరుగుతాయి. వివిధవాహనసేవలు, రథోత్సవం, కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నృసింహజయంతి, ధనుర్మాసాలతో పాటు వివిధ పండుగలసమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కోరికలు తీర్చే కొండంతదేవుడిగా, సంతానం ప్రసాదించే సంతానప్రదాయకుడుగా, వివాహం ఆలస్యమౌతున్న వారికి వివాహాలను కుదిర్చే దేవుడిగా పేరుపొంది ఆరాధనలు అందుకుంటూ ఉన్న తరిగొండ శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించి భక్తులు తరించవచ్చు.
No comments:
Post a Comment