పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని యనమదుర్రులో పరమేశుడు యోగశివునిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయములో స్వామి శీర్షాసనములో (తలక్రిందకు కాళ్ళు పైకి ఉండేవిధంగా) కొలువుదీరి ఉండటం విశేషం.
శక్తీశ్వరస్వామి ఆలయాన్ని తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మించారు. చారిత్రకంగా ఇక్కడి ఆలయం 11వ శతాబ్దంలో నిర్మితమైంది.
పూర్వం ఈ ప్రాంతములో శంబరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రోజురోజుకూ అతని ఆగడాలు ఎక్కువ కావడముతో, యముడే ఆ రాక్షసుని సంహరించాలనుకున్నాడు. అతణ్ని చంపేందుకు తగిన శక్తిని ప్రసాదించమని శివుణ్ని ప్రార్ధించాడు, యముడు. ఆ సమయంలో శివుడు యోగభంగిమలో శీర్షాసనములో ఉండటంతో ఆ విధంగానే యమునికి దర్శనమిచ్చాడు. శివుడు శీర్షాసనములో ఉండటం వలన, అమ్మవారు తనశక్తిపరంగా యమునికి శక్తి ఆయుధాన్ని ఇచ్చింది. అమ్మవారి అనుగ్రహముతో శంబరాసురుణ్ని సంహరించాడు యముడు. తరువాత యముని కోరిక మేరకు పరమేశుడు యిక్కడ శీర్షాసన స్థితిలోనే కొలువుదీరాడు. స్వామిప్రక్కనే పార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు.
శివలింగతలంపై విలక్షణంగా శీర్షాసనంలో దర్శనమించ్చే శివుని రూపం ఆలయానికే విశిష్టతగా నిలుస్తోంది.శక్తీశ్వరాలయంలో ఒకే పీఠంపై శివుడు, పార్వతి, కుమారస్వామి కొలువై ఉండడం మరో ప్రత్యేకత. అమ్మవారు మాతృమూర్తిగా బాల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఒడిలో చేర్చుకుని లాలిస్తూన్నట్టు కొలువై ఉండడమూ విశేషాంశమే. ఇలా ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు దీర్ఘరోగాలు తొలగిపోతాయని ప్రసిద్ధి.
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పట్టణం నుండి 5 కి.మీ. దూరములో యనమదుర్రు ఆలయం ఉంది. భీమవరంలో వసతిసదుపాయాలను పొందవచ్చు
No comments:
Post a Comment