గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో "ఓ జహ్ను మహర్షీ! వీరవ్రతుడు ఉపదేశించిన ప్రాయశ్చిత్త కర్మ వ్రతంతో పునీతుడైన విశ్రుంఖలుడు నైమిశారణ్యంలో వీరవ్రతుని చేరుకున్నాడు. ఆ వీరవ్రతుడు విశ్రుంఖలునికి ఎలాంటి బోధ చేశాడో వినుము" అంటూ 26వ అధ్యాయాన్ని మొదలు పెట్టాడు.
విశ్రుంఖలుడు పవిత్రుడైన వైనం
వీరవ్రతుడు విశ్రుంఖలునితో "విప్రుడా! ఇప్పుడు నీ సమస్తమైన పాపాలు నశించాయి. ప్రయాగ స్నానంతో పరమ పవిత్రుడవైన నీకు ఇప్పుడు నీ బ్రాహ్మణ తేజం తిరిగి వచ్చింది. ఇప్పుడు నీ చేత మరొక వ్రతాన్ని చేయిస్తాను. నీవు మూడు రోజులు నిరాహారంగా ఉండాలి. నేను నీకు సమంత్రక పూర్వకంగా దర్భలతో, పవిత్ర జలాలతో స్నానం చేయిస్తాను" దానితో నీవు పవిత్రుడవు కాగలవు అని చెప్పి వీరవ్రతుడు విశ్రుంఖలునికి సమంత్రక పూర్వకంగా దర్భలతో, పవిత్ర జలాలతో స్నానం చేయించాడు. మూడు దినాలు విశ్రుంఖలునిచే కఠిన ఉపవాసం చేయించాడు. దీనితో విశృంఖలని సమస్త పాతకాలు పోయి పవిత్రుడయ్యాడు.
విశ్రుంఖలునికి ధర్మోపదేశం చేసిన వీరవ్రతుడు
వీరవ్రతుడు బహు ప్రీతితో విశ్రుంఖలుని కౌగిలించుకొని అతనిచే భోజనము చేయించెను. తరువాత అతనికి సమస్త ధర్మాలను ఉపదేశించెను. "విశృంఖలా! ఇకనుంచి నీవు వేదమార్గమును అనుసరింపుము. సంధ్యావందనాది కర్మలను నిర్వహింపుము. వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరింపుము. ప్రతిరోజూ త్రికాల సంధ్యలలో శ్రీహరిని, శివుని పూజింపుము. ఇతరుల అపరాధములను మన్నింపుము. ఇతరుల అభివృద్ధి చూసి అసూయ చెందవద్దు. అతిథులను, అభ్యాగతులను ఆదరింపుము. మునులను యోగీశ్వర్లును సేవింపుము. ప్రతిరోజూ నీ గృహంలో శ్రీహరికి నివేదించిన అన్నాన్ని మాత్రమే భుజింపుము. పితృ తిథులయందు శ్రాద్ధ కర్మలు నిర్వహింపుము. నిత్యాగ్నిహోత్రులను గౌరవింపుము. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మాఘస్నాన వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజింపుము. మాఘ స్నానం వలన అశ్వమేధ యాగ ఫలం లభించును. తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టే శక్తి మాఘస్నానికి ఉంది. భక్తితో ప్రతి సంవత్సరం మాఘవ్రతం ఆచరిస్తే ఇహలోకంలో భోగాలు అనుభవించి అంత్యమున వైకుంఠాన్ని చేరుతావు" అని వీరవ్రతుడు విశ్రుంఖలునికి ధర్మోపదేశం చేసాడు.
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "జహ్నువూ! విన్నావుగా! ఈ విధముగా వీరవ్రతుడు చేసిన ధర్మోపదేశం విన్న విశ్రుంఖలుడు మిక్కిలి సంతోషించి వీరవ్రతునికి అనేక విధాలుగా నమస్కరించి కాశీ నగరానికి చేరుకున్నాడు. యోగ్యమైన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. సమస్త ధర్మములను అనుసరిస్తూ, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో ప్రయాగ తీర్థమందు స్నానం చేస్తూ పుత్రపౌత్ర యుతుడై అనేక భోగములను అనుభవించి మరణానంతరం శ్రీహరిని చేరి ముక్తిని పొందాడు. కాబట్టి ఎంతటి ఘోర పాతకములు చేసిన వారైనా ఈ ప్రాయశ్చిత్త కర్మ వ్రతాన్ని చేయడం వలన పునీతులు అవుతారు" అని చెబుతూ గృత్స్నమద మహర్షి 26వ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! షడ్వింశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment