శ్రీమహావిష్ణువు లోకకల్యాణానికై శ్రీవైకుంఠాన్ని వదలి కోనేటిరాయస్వామిగా భువిపై వెలసిన మహిమాన్విత దివ్యక్షేత్రం కీలపట్ల, చిత్తూరుజిల్లాలోని పలమనేరు సమీపంలో గంగవరం మండలంలో ఉంది.
చోళ రాజులకాలంలో యుద్దసిపాయిల ముఖ్యమైన పటాలం' అటవీ ప్రాంతమైన కోటిపల్లి సమీపాన ఉండేదట. చిన్నదండు (పటాళం) ఉండే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని 'కీళ్పటాలం' అని పిలిచే వారు. జనవాడుకలో కీళ్పటాలం, కీళ్పట్టు, కీళ్పట్టణం-కీల పట్లగా స్థిరపడింది.
కీలపట్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బ్రహ్మమానస పుత్రుడు భృగుమహర్షి ప్రతిష్టించినాడని ప్రతీతి.
జనమేజయమహారాజుకాలంలో ఈ గుడి నిర్మించబడిందని, పల్లవరాజులు, చోళరాజులు ఈ గుడిని పునర్నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తుంది.
లక్ష్మీదేవి తన నివాసస్థానమైన వక్షఃస్థలంపై భృగుమహర్షి తన్నినందున వైకుంఠవాసునిపై ప్రణయ కలహాన్ని పూని భూలోకానికి వెళ్లింది. విష్ణువు లక్ష్మీదేవిని అన్వే షిస్తూ వైకుంఠాన్ని వదలి శ్రీవేంకటాచలానికి వేంచేశాడు. పరతత్త్వమైన శ్రియఃపతి ఆకాశరాజుకుమార్తె పద్మావతిని వివాహ మాడాడు. భక్తసంరక్షణకై లక్ష్మీపద్మావతులతో కలియుగంలో పలుచోట్ల దుష్టశిక్షణ, శిష్టరక్షణకై అర్చావతారంగా వేంకటేశ్వరనామంతో వెలసినాడని పురాణగాథ.
ఓసారి కీలపట్ల ఆలయంలోని అర్చకులు, భక్తులు దుండగులబారినుండి సంరక్షించుకోవడానికి శ్రీవేంకటేశ్వరస్వామి అమ్మవార్ల విగ్రహాల్ని జాగ్రత్తగా పెకళించి, పట్టువస్రాల్లో చుట్టి గుడికి ఈశాన్యంగా ఉండే శ్రీవారి కోనేటిలో కనిపించకుండా ముంచి దాచి పెట్టేశారు. పంచలోహవిగ్రహాలను, హుండీసొమ్ము ఆభరణాలను కూడా అలాగే దాచేశారు. ఆవిధంగా వందసంవత్సరాలకు పైగా వటపత్రశాయి ఆ కోనేటిలోనే దాగి ఉన్నాడు.
ఆ తరువాత పుంగనూరు జమిందారుకు స్వామి కలలో కనిపించి, తనను పునః ప్రతిష్టింప చేసుకొని, నిత్య ధూపదీపనైవేద్యాలతో అలరించేలా చేసుకున్నాడు. కోనేటిలో జలధియై వెలికితీసి ప్రతిష్ఠించిన స్వామివారిని అప్పటినుండి కోనేటిరాయడని కీర్తిస్తున్నారు.
శ్రీమహావిష్ణువు భూలోకానికి వేంచేసి మొదటగా అవతారమెత్తినపుడు తుంబురుతీర్థప్రాంతంలో తపోనిష్ఠలో ఉన్న భృగుమహర్షి కోరికమేరకు తిరుమలకు పశ్చిమాన శేషాచలం పర్వతపాద పవిత్రప్రాంతమున ఏడుయోజనాల దూరంలో ఉన్న కీలపట్లలో సాలగ్రామమై వెలిశారు. తిరిగి స్వామి తిరుమలకు వెళ్లి తాను కీలపట్లప్రాంతంలో స్వయంగా వెలసినట్లు భృగుమహర్షికి చెప్పారు. మహర్షి అందుకు రుజువులడిగారట. అందుకు స్వామివారు అడవులగుండా తాను ఏడడుగులు వేసిన పాదాలగుర్తులే రుజువులుగా చూపాడట. అవి నేటికీ అడవిదారిగుండా తిరుమలవరకు స్వామివారి పవిత్రపాదముద్రలున్న చిహ్నాలు బండలపై గమనించొచ్చు.మీరక్కడికి వెళ్లివచ్చేది మాకెలా తెలుస్తుందని మహర్షి అడగ్గా రాత్రిపూట తిరుమలనుండి కీలపట్లవరకు ఆకాశమార్గంలో ఏర్పడే వెన్నెల వెలుగుదారే మీకు సంకేత మని స్వామివారు చెప్పారట. ఆ తరువాత మహర్షి స్వయంగా ఇక్కడికొచ్చి స్వామివారిని ప్రతిష్ఠించాడు. తరువాత పరీక్షిత్తు వారసుడైన జనమేజయమహారాజు స్వామివారికి చిన్నపాటి ఆలయం కట్టించాడు.
విజయనగరరాజులకాలంలో కీలపట్ల ఆలయం విశేషప్రచారం పొందింది. తిరుపట్లగా చిన్న తిరుపతిగా వారు ప్రముఖస్థానం కల్పించారు.పశ్చిమప్రాంతాలనుండి తిరుమల వెళ్లేవారికి ముఖ్యమైన మహాప్రవేశంగా (గేట్ వే ఆఫ్ తిరుమల) వెలుగొందింది.
శ్రీ వేంకటేశ్వరస్వామి, అలమేలుమంగ ఆలయాలు ఒకే కట్టడంలో నిర్మించబడ్డాయి. స్వామివారి గర్భాలయం ఎత్తైన వృత్తాకారగోపురంతో విజయనగరవాస్తు శిల్పకళా శైలితో గోళాకార ఏకకలశంతో అందంగా పూరించారు. నలువైపులా గోపురంపై దిక్పాలకులు, గరుత్మంతప్రతిమలతో అలంకరించబడి ఉంది. గర్భాలయ పైకప్పు అష్టభుజి ఆకారంలో మలిచారు. ఈ అద్భుత వైకుంఠమందిరంలో స్వామివారు ఐశ్వర్యపీఠంపై కొలువై పూజలందుకుంటున్నాడు. స్వామివారి గర్భాలయానికి అంతరాళముంది. అంతరాళం నాలుగు చతురస్రాకారస్తంభాలపై ఉంది. 40అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుగల 16స్తంభాలపై నవరంగమండపం చక్కటి శిల్పాలు చెక్కబడి విజయనగర శిల్పకళారీతిలో తీర్చబడింది.
ఈ ప్రధానాలయాన్ని చేరడానికి మూడుద్వారాలు దాటి వెళ్లాలి. ఒకటి నాలుగ్గాళ్లమండపం రెండు గాలి గోపురం, మూడు మహాముఖమండపం. మహామండపం కూలిపోగా దానిని దశావతారమండపంగా రూపు రేఖలు మార్చారు. దీనికే అభినవరంగమండపమని కూడా పేరు. ఈ మండపంలో పశ్చిమద్వారంపై తలవాల్చినట్లున్న వినాయకుడు, ద్వారనిలువునకు వినాయక ప్రతిమలున్నాయి.
ప్రధానాలయానికి ఈశాన్యంలో స్వామివారి కోనేరు ఉంది. విజయనగరరాజులు తిరుమలస్వామికి చేయించినట్లే ఈ దేవునకు కూడా చందనపు కొయ్యతో చక్కటి అందమైన మూడంతస్తుల నగిషీతేరును చేయించారు. ఇతర ముఖ్యవాహనాలన్నీ కూడా చేయించారు. ఐదంతస్తుల పెద్దతేరు కూడా చేయించారు. ఈ తేరు లాగడానికి ఏనుగుల్ని ఉపయోగించేవారు.
ప్రతి సంవత్సరం వసంతరుతువులో చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమరోజుల్లో ఉత్సవమూర్తులకు వసంతోత్సవం జరుగు తుంది. ఇకపోతే తోమాలసేవ, శ్రవణానక్షత్రంలో స్వామి వారి జన్మదినవేడుకలు, చతుర్దశిరోజున శ్రీవారి కల్యా ణోత్సవం జరుగుతాయి. కీలపట్లలో కూడా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమీరోజున రథసప్తమీఉత్సవం జరుగుతుంది. ఆరోజున స్వామివారు సూర్యప్రభవాహనంపై ఊరేగుతారు.
ప్రతిసంవత్సరం వైశాఖమాసంలో శుద్ధ అష్టమి మొదలు బహుళతదియవరకు పదకొండురోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశిరోజున వైకుంఠఏకాదశి పర్వదినం కూడా జరుగుతుంది. తిరుమలలోలాగే శ్రీవారికి పార్వేటఉత్సవం జరుగుతుంది.
ఇకపోతే నిత్యమూ ఉదయం సుప్రభాతసేవ, అర్చన, నిత్యార్చన, నిత్యపూజ, నిత్యనైవేద్యము, శతనామా ర్చన, సహస్రనామార్చనలు జరుగుతాయి. తీర్ధప్రసాద వినియోగం ఉంటుంది.
సాయంకాలం సాధారణపూజ, అర్చన, ఏకాంత సేవ, తీర్మానాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. వైశాఖమాసంలో శుద్ధ అష్టమి మొదలు బహుళ విదియమాసంలో దీపారాధన, మూలస్తంభంపై ఆకాశదీపం (మేలుదీపం) ఎత్తుతారు.
Comments
Post a Comment