సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు.
కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.
ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలనుచాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.
దక్షిణాయన పుణ్యకాలం చేయవలసినవి పనులు ఏమిటి?
ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం , విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.
No comments:
Post a Comment