Magha Puranam Telugu: మాఘ పురాణం 22వ అధ్యాయం - ఏకాదశి వ్రతం ఆచరించిన సత్వజిత్తు- శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Friday, February 21, 2025

demo-image

Magha Puranam Telugu: మాఘ పురాణం 22వ అధ్యాయం - ఏకాదశి వ్రతం ఆచరించిన సత్వజిత్తు- శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం

Responsive Ads Here

 
lord%20vishnu%20(1)

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! నారదునితో శ్రీహరి కుంటివారుగా మారిన ఇంద్రాది దేవతల శాపానికి ఉపశమనం చెప్పగా నారదుడు భూలోకాని వెళ్లి ఆ విషయాన్ని సత్వజిత్తుకు వివరిస్తాడు.

ఏకాదశి వ్రతం ఆచరించిన సత్వజిత్తు

సత్వజిత్తు దేవేంద్రాది దేవతల శాపానికి ఉపశమనం కోసం ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుని పత్రపుష్పఫలాలతో, గంధం చందనం, ధూప దీప నైవేద్యాలతో భక్తిశ్రద్ధలతో పూజిస్తాడు. విష్ణువు సన్నిధిలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రంతా జాగారం చేసాడు.

శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం

సత్వజిత్తు ఏకాదశి వ్రతానికి సంతోషించిన శ్రీహరి లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనంపై ఆ తెల్లవారుజామున సత్వజిత్తుకు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. తన ఇంట్లో ప్రత్యక్షమైన ఆ శ్రీహరిని చూసి సత్వజిత్తు సంభ్రమాశ్చర్యాలతో శ్రీహరిని అనేక విధాలుగా స్తుతిస్తాడు.

సత్వజిత్తునికి వరం

శ్రీహరి సత్వజిత్తుని వరం కోరుకోమంటాడు. శ్రేష్టమైన బుద్ధి కల ఆ సత్వజిత్తు శ్రీహరితో "నారాయణా! ఇంద్రాది దేవతలకు ఆకాశంలో సంచరించే శక్తిని తిరిగి ప్రసాదించుము. వారికి అమృతాన్ని ప్రసాదించి మనశ్శాంతిని కలిగించుము. అలాగే నాకు నా భార్యకు నీ సన్నిధానమున ఉండేట్లు వరం ప్రసాదించుము" అని కోరుకుంటాడు.

ప్రసన్నుడైన శ్రీహరి

సత్వజిత్తు త్యాగబుద్ధితో కోరిన వరాలను విని పరమ ప్రసన్నుడైన ఆ శ్రీహరి "ఓ భక్తశేఖరా! ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నీవు చేసిన ఏకాదశి వ్రతం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈనాటి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాకు పియ్రమైనది అవుతుంది. దానినే శయనేకాదశి అని ప్రజలు జరుపుకుంటారు.

సత్వజిత్తుకు తరుణోపాయం చెప్పిన శ్రీహరి

శ్రీహరి సత్వజిత్తుతో "ఓ భక్తశ్రేష్టా! నీవు ఈ పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి సమర్పించు. అలాగే తులసి వృక్షాన్ని నాకు సమర్పించు. ఇందువలన నీకు మేలు కలుగును" అని చెప్పగా వెంటనే సత్వజిత్తు పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రునికి ఇచ్చివేస్తాడు. తులసి వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తాడు. ఇంద్రాది దేవతలకు శ్రీహరి అమృతాన్ని అందిస్తాడు. వారందరు కోల్పోయిన తమ శక్తులను తిరిగి పొంది ఆ శ్రీహరికి నమస్కరిస్తారు.

ఏకాదశి వ్రతమహాత్యాన్ని వివరించిన శ్రీహరి

ఇంద్రాది దేవతలు వినుచుండగా ఆ శ్రీహరి చిరునవ్వుతో సత్వజిత్తుతో ఇలా అంటాడు. "వ్రతములలోకెల్లా అత్యుత్తమమైనది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం మానవుల పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎవరు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నన్ను పూజించి, నా నామ స్మరణ చేస్తూ జాగారం చేస్తారో వారికి నా అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు శ్రేష్టమైనవి. ముఖ్యంగా ఆషాడ, కార్తీక, మార్గశిర, మాఘ మాసంలో వచ్చే ఏకాదశులు మరింత శ్రేష్టమైనవి. కులమత భేదం లేకుండా, స్త్రీపురుషులు, సాధు సన్యాసులు, మునీశ్వరులు, యోగులు అందరూ ఆచరించదగినది ఏకాదశి వ్రతం. జీవితంలో ఒక్కసారైనా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయి." అని ఏకాదశి వ్రతమహాత్యాన్ని శ్రీహరి వివరించాడు. ఇక్కడవరకు జహ్ను మహర్షితో ఈ కథను చెప్పి గృత్స్నమదమహర్షి ఇరవై రెండో అధ్యాయాన్ని ముగించాడు. 

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ద్వావింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages