కాశీ క్షేత్రంలో చూడదగిన ఆలయాలలో మయూఖాదిత్యుని ఆలయం కూడా ఒకటి. పవిత్ర గంగా నదీ తీరంలోని పంచగంగ రేవు సమీపంలో ఉంది ఈ ఆలయం.
ఇక్కడ సూర్య భగవానుడు మయూఖాదిత్యునిగా పూజలందుకుంటాడు.
పురాణాలు ప్రకారం పూర్వం సూర్యుడు గంగానది ఒడ్డున శివలింగాన్ని, మంగళ గౌరీ దేవిని ప్రతిష్ఠించి పూజించాడు. సూర్యుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు.
తాను ప్రతిష్టించిన శివుని మంగళ గౌరి దేవిని పూజిస్తూ సూర్యుడు కాశీలోని ఉండిపోయాడు. ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యుడు ఒకే చోట ఉండిపోతే లోకాలన్నీ చీకటిలో ఉండిపోకుండా సూర్యుని మయూఖాలు అంటే కిరణాలు మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయి. అందుచేతనే శివుడు సూర్యునికి 'మయూఖాదిత్యుడు' అనే వరాన్ని ప్రసాదించాడు.
కాశీలోని మయూఖాదిత్యుని దర్శించిన వారికి జీవితంలో దారిద్య్ర బాధలుండవని సాక్షాత్తూ ఆ పరమ శివుడే వారం ఇచ్చాడు. అందుకే కాశీకి వెళ్లిన వారు తప్పకుండా మయూఖాదిత్యుని దర్శించి పూజించాలి.
కాశీకి వెళ్లిన వారు విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి దర్శన అనంతరం సూర్య దేవాలయాలను దర్శించుకోవాలి. ముఖ్యంగా దారిద్య్ర బాధలను పోగొట్టే మయూఖాదిత్యుని ఆలయానికి సూర్యోదయం సమయంలో చేరుకోవాలి. ముందుగా గంగా స్నానం శాస్త్రోక్తంగా ఆచరించాలి. అనంతరం పంచగంగ రేవులో ఉన్న మయూఖాదిత్యుని ఆలయానికి చేరుకొని స్వామి దర్శనం చేసుకొని, 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఆలయంలో సద్బ్రాహ్మణులకు గోధుమలు దానం ఇవ్వాలి. గోధుమలతో తయారు చేసిన పదార్ధాలను గోమాతకు తినిపించాలి. మయూఖాదిత్యుని ఎదురుగా కూర్చొని 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. చివరగా జన్మాంతర పాపకర్మల కారణంగా అనుభవిస్తున్న దారిద్య్ర బాధలను పోగొట్టమని మయూఖాదిత్యుని మనసారా వేడుకోవాలి.
ఈ విధంగా శాస్త్రోక్తంగా మయూఖాదిత్యుని దర్శనం, పూజలు చేసిన వారికి ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల వరకు దారిద్య్ర బాధలుండవని శాస్త్ర వచనం. అలాగే సూర్యుడు ప్రతిష్టించిన శివుని మంగళగౌరీ దేవిని ఆరాధించినవారికి సకల శుభాలు కలుగుతాయి.
No comments:
Post a Comment