Aragonda Anjaneya Temple: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం - అర్ధగిరి

చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయమైన కాణిపాకానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది. 

ఈ ఆలయంలోని హనుమను పూజిస్తే అనేక రకాల అనారోగ్యాలు నశించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. 

త్రేతా యుగంలో రామ-రావణుల యుద్ధం సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుని శరాఘాతానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. ఆ సమయంలో శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సంజీవని మూలికలు తేవడానికి వాయువేగంతో హిమాలయాలకు వెళ్తాడు. సంజీవని పర్వతానికి చేరుకున్న హనుమ మూలికలు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో ఓ ప్రదేశంలో సంజీవని పర్వతం నుంచి అర్ధ భాగం విరిగి పడిపోతుంది. ఆ ప్రదేశమే ఇప్పటి అరగొండ. అర కొండ పడింది కాబట్టి అర కొండ అని పేరొంది కాలక్రమేణా అరగొండగా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

సంజీవని పర్వతం విరిగి పడిన ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పడింది. అదే సంజీవరాయ తీర్ధంగా ప్రసిద్ధి చెందింది. సంజీవరాయ తీర్ధంలో సంజీవకరణి, విషల్యకరణి అనే మహిమాన్విత వనమూలికలు, ఔషధాలు కలిసి ఉండడం వలన ఆ తీర్ధంలో నీటికి అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వాసం. అంతేకాదు ఇక్కడ మట్టిని శరీరానికి రాసుకుంటే భయంకరమైన చర్మవ్యాధులు నశిస్తాయని విశ్వాసం. త్రేతాయుగం నాటి ఈ సంజీవరాయ తీర్థంలో స్నానం చేయడానికి, తీర్ధ జలాలను సేవించడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు.

ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. అందుకే ఇక్కడి హనుమను కొలవడం వలన సకల ఐశ్వర్యాలు, విజయాలు చేకూరాలన్న ఉద్దేశంతో సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి, హనుమంతుని విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఎవరైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుందని విశ్వాసం. 

పౌర్ణమి రోజు సంజీవరాయ తీర్ధంలో చంద్ర కిరణాలు ప్రసరించి ఆ నీటికి ఉన్న మహత్యం వేయి రెట్లు పెరుగుతుందని నమ్మకం. ఆ రోజున తీర్ధాన్ని సేవిస్తే ఎలాంటి అనారోగ్య బాధలైనా దూరమవుతాయంట! అందుకే పౌర్ణమి రోజు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. అంతేకాదు ఓ నియమం ప్రకారం తొమ్మిది పున్నములు ఈ క్షేత్రానికి వచ్చి తీర్థ జలాలను సేవిస్తారు భక్తులు.

ప్రతి పౌర్ణమికి ఉదయాన స్వామికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. సాయంత్రం ప్రాకారోత్సవం, ఆకుపూజ, వడమాల సేవలతో పాటు విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో శివుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి.

ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 వరకు ఆలయాన్ని దర్శించవచ్చు 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ