Karthika Puranam: కార్తీక పురాణం 13వ అధ్యాయము - కార్తికద్వాదశీమాహాత్మ్యము, సువీరశ్రుతకీర్తి కథ

 

వసిష్ఠుడిట్లు చెప్పెను. జనకరాజా ! కార్తికమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మము లన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తికధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకుజెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయని యెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట గోరువారును, నరకభయముగలవారును ఈ ధర్మములను తప్పక చేయ వలెను.

కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తికమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయన మును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును.

తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మ మగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును జెప్పుటకు నాకు శక్యముగాదు.

పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మనున కుపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడసరిపోవు. కార్తిక మాసమందు ఉపనయనదానము జేసి తరువాత మాఘ మాసమందుగాని, వైశాఖమాసమందుగాని ఉపనయనమును జేయించవలయును.

సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి.

ఆ ఉపనయనములకు సంకల్పము కార్తికమాసమందు చేయవలెను. అట్లు చేసిన యెదల గలిగెడి ఫలమును జెప్పుటకు భూమియందుగాని, స్వర్గమందుగాని యెవ్వనికి సామర్ధ్యము కలదు?

పరద్రవ్యము వలన తీర్ధయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన యెడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు గలుగును.

కార్తిక మాసమందు ధనమిచ్చి యొక బ్రాహ్మణునకు ఉపనయన మును వివాహ మును జేయించిన యెడల అనంత ఫలము కలుగును. కార్తికమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓజనకరాజా! ఈ విషయమై పురాతనకథ యొకటి గలదు. చెప్పెదను, సావధానుడవై వినుము.

ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు. మిక్కిలి వీర్యశౌర్య ములు కలవాడు. ఆతడు దురాత్ముడు. ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడినవాడై రాజ్యభ్రష్టుడై “అరోథవా ఏషా ఆత్మనోయత్పత్నీత" అను శ్రుత్తుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసికొని అరణ్యమునకు బోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను.

ఆ యరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతియాయెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను గనెను.

రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకుని తన పురాకృతపాపమును స్మరించుచు బాలికను కాపాడు చుండెను. తరువాత పూర్వపుణ్యవశముచేత ఆ కన్యక వృద్ధినొంది సౌందర్యముతోను లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానంద కారిణియై యుండెను.

ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను జూసి యొక ముని కుమారుడు సువీరా ! నీ కూతురును నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆమాటవిని రాజు మునికుమారకా ! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈ కన్యను నీకిచ్చెదను. ఓ జనకమహారాజా ! ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య యందుండు కోరికతో రాజుతో ఇట్లనెను.

ఓ రాజా ! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను దానితో నీవు రాజ్యమందుండు సుఖములను బొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదననెను.

తరువాత మునికుమారుడు ఆ నర్మదాతీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతురినిచ్చి తనయొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను.

ఆ కన్యయు వివాహము కాగానే భర్తవద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి.

రాజు భార్య తిరిగి యొక కుమార్తెను కనెను. రాజు దానిని జూసి సంతోషించి యీ సారి యీ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును. దానితో నాజన్మమంతయు గడచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలచుచుండగా పూర్వపుణ్య వశముచేత ఒకయతీశ్వరుడు స్నానార్ధము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును జూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయీ నీవెవ్వడవు యీ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు న్నావు చెప్పుమని యడిగెను.

దారిద్య్రముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యవియోగముతో సమానమయిన వియోగ దుఃఖములేవు. కాబట్టి దారిద్య్ర దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను.

ఈ యరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్న దానిని యౌవనము రాగానే ఒక మునికుమారుని వలన బహు ధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆ ధనముతో సుఖముగా జీవించు చున్నాను. ఇంక యేమివినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమునువిని యతి ఇట్లనెను. రాజా! ఎంతపనిచేసితివి. మూఢుని వలె పాపములను సంపాదించుకొంటివి.

కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవన మను నరక మందు నివసించును. కన్యాద్రవ్యముచేత దేవఋషి పితరులను తృప్తి జేయుచున్న వానికి పితృదేవతలు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యా ద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనముచేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును.

సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది. కాని కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా జెప్పబడియుండలేదు. కాబట్టి ఈ కార్తికమాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురు నకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము.

కార్తికమాసమందు విద్యాతేజశ్మీలయుక్తుడయని వరునకు కన్యా దానము చేసిన వాదు గంగాదిసమస్త తీర్థములందు స్నానదానములు చేసెడి వాడు పొందెడి ఫలమును, యధోక్తదక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను జేసినవాడు పొందెడి ఫలమును బొందును.

సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది. కాని కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా జెప్పబడియుండలేదు. కాబట్టి ఈ కార్తికమాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురు నకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము.

కార్తికమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయని వరునకు కన్యా దానము చేసిన వాడు గంగాదిసమస్త తీర్థములందు స్నానదానములు చేసెడి వాడు పొందెడి ఫలమును, యధోక్తదక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను జేసినవాడు పొందెడి ఫలమును బొందును.

ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనియె. బ్రాహ్మణుడా ఇదియేమి మాట. పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా యేమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లైనా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా యీ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను బొంచెదను. నీకెందుకు నీ దారిని నీవుపొమ్ము.

ఆ మాటవిని యతిస్నానము కొరకు నర్మదానదికి పోయెను. తరువాత కొంతకాల మునకు ఆ యరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసికొని పోయిరి. అచ్చట యముడు వానిని జూసి కళ్లెఱ్ఱజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును రాజుపితరులను గూడ పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగాగల వృక్షములతో గూడిన చిక్కనివనము.

ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మము లను సూజు యజ్ఞములుచేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను. స్వర్గమునకు బోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను. ఈ శ్రుతకీర్తిని సువీరుని పాపశేషముచేత స్వర్గము నుండి తాను నరకమునపడి యమ యాతనల నొందుచు యొకనాడు యిదియేమి యన్యాయము. పుణ్యము జేసిన నన్నుయమలోకమందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునితో నిట్లనియె.

సర్వమును దెలిసిన ధర్మరాజా ! నా మనవి వినుము. ఎంతమాత్ర మును పాప మును జేయని నాకు ఈనరకమెందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమునపదుట ఎందుకు కలిగినది?

శ్రుతకీర్తి యిట్లు చెప్పిన మాటలను విని యముడు పల్కెను. శ్రుత కీర్తి! నీవన్నమాట సత్యమేగాని నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యా ద్రవ్యముచేత జీవించినాడు. ఆ పాపముచేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమి యందు దుష్టయోనులందు జన్మించెదరు.

శ్రుతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది. దానికింకను వివాహము కాలేదు. కాట్టి నీవు నా ప్రసాదము వలన యీ దేహముతో అచ్చటికి బోయి అచ్చటనున్న మునులతో యీ మాటను జెప్పి కార్తికమాస మందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లిచేయుము.

కార్తికమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునికిచ్చు వాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాదు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడల ధనదాత యును, లోకాధిపతియునగును. కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును బొందును.

కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము. దానిచేత నీ పితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు. శ్రుతకీర్తి యమునిమాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణము లతో కార్తిక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆ పుణ్య మహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుబోయి సుఖముగా నుండెను. తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యా మూల్యమును యిచ్చెను. దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకుబోయిరి. తానును యథాగతముగా స్వర్గమును జేరెను.

కాబట్టి కార్తికమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును.

ఇందుకు సందేహములేదు. కన్యామూలము యివ్వలేని వారు మాటతోనయినా వివాహము నకు సహాయము జేసిరేని వారి పుణ్యమునకు అంతములేదు. కార్తికమాసమందు కార్తిక వ్రతమాచరించువాడు హరిసాయుజ్యమును బొందును. ఇదినిజము. నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తిక వ్రతమాచరించని వారు రౌరవనరకమునుబొందుదురు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి