Karthika Puranam: కార్తీక పురాణం 15వ అధ్యాయము - కార్తికదీపమాలార్పణ మహిమా, కర్మనిష్ట చరితము

 

ఓ జనకమహారాజా ! తిరిగి కార్తిక మాహాత్మ్యమును జెప్పెదను. భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తికమాసమందు హరిముం దఱ నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిర నివాసియగును. కార్తికమాసమందు ద్వాదశినాడు హరికి దీవమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తిక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగును.

కార్తికమాసమందు నెల రోజులు నియతముగా విష్ణ్వాలయమునకు దర్శనార్ధము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును బొందును. సందేహములేదు.

కార్తికమాసమందు హరిసన్నిధికిపోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును. కార్తికమాసమందు విష్ణ్వాలయ దర్శనార్ధము వెళ్ళనివాడురౌరవ నరకమును, కాలసూత్రనరకమును పొందును. కార్తికశుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజచేసిన పుణ్యమునకు అంతములేదు.

కార్తిక శుక్లద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడి భక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, ధూపముతోను, దీపములతోను, ఆజ్యభక్ష్య నైవేద్యముల తోను పూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తికశుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయ మందుగాని, శివాలయమందుగాని లక్షదీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు జేరి సుఖించును.

కార్తికమాసము నెలరోజులు దీపమును బెట్టలేని వాడు శుద్ధద్వాదశి నాడును, చతుర్ధశినాడును, పూర్ణిమనాడును మూడు రోజులుపెట్టవలెను. కార్తికమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంతకాలము దీపము నుంచిన యెడల పుణ్యవంతు డగును.

కార్తికమాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీప మును బాగుచేసి వెలిగించినవాడు పాపములేనివాడు అగును.

కార్తిక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింప జేసికొనును. ఈవిషయ మందొక పూర్వపు కథగలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన విష్ణ్వాలయ మొకటి గలదు. కార్తిక స్నానార్ధము కర్మనిష్టుడనునొక యతీశ్వరుడు ఆ సరస్వతీనదీ తీరమునకు వచ్చెను.

సరస్వతీతీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూల ముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళినితుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనెదెచ్చి పండ్రెండు దీప పాత్రలనుతెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను.

యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తికశుద్ధ ద్వాదశినాడురాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణముజేసి మెల్లగా దీపముల సన్నిధికి జేరెను. ఎలుకవచ్చి తనతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తినిగూడ గ్రహించవలను. అంతలో జ్వాలతోయున్న వర్తి సంపర్కము వలనజ్వాలలేని వర్తియుమండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను.

కార్తిక శుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆ రాత్రియే అచ్చటనే మృతినొంది ఎలుకదేహమును వదిలి దివ్యదేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి అయ పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె.

పాపరహితా! నేను ఎలుకను, గడ్డిలోగింజలను భక్షించు దానను, నిత్యము ఈదేవాలయమందుండుదానను. ఎలుకనై యున్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇదియే పుణ్యముచేతగలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వ డను? ఏమిపాపమును జేసితివి? ఏపాపము చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈ విషయమం తయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకునేను దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను.

ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వమునువిచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను. ఓయీ ! నీవు పూర్వ మందు బాహ్లికదేశమందు జైమినిగోత్రసంజాతుడవు. బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణపరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు.

స్నాన సంధ్యలనువిడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధభోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు.

నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమునుబెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల, పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి.

భూమియందు మూషఖముగా జన్మించి ఈ దేవాలయ మందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగు చుంటివి. దైవవశము వలన ఈ దినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి గనుక ఆ పుణ్యముచేత మూషకత్వము పోయి దివ్యరూపము గలిగినది. ఇక హరిభక్తి గలిగి శాశ్వతముగా వైకుంఠ మందు ఉందువు.

ఈ ప్రకారముగా యతిచెప్పిన మాటను విని ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసికొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికిపోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానముచేసి ఆ మహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తిక వ్రతమును జేసి తన్మహిమవలన అంతమందు సాయుజ్యముక్తి బొందెను.

కాబట్టి కార్తికశుద్ధ ద్వాదశినాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజా దీపమాలార్పణాదికమును జేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి