కార్తీక మాస శుద్ధ ఏకాదశినే ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి, భోధన ఏకాదశి. దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనికూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.
మహాభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి, ఉపవాస దీక్ష విరమించి వ్రతం ముగించాలి.
కార్తీక మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఈ మాసంలో వచ్చే ఏకాదశి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి స్కందపురాణంలో వివరించారు. పాపాలను హరించే ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా, అనంతమైన పుణ్య ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి సర్వ సంపదలు, సమాజంలో మంచి స్థానం లభిస్తాయి. పాపా పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడంవల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పినట్టు స్కాందపురాణం చెబుతోంది.
ఈ రోజున ఒకరికైనా అన్నదానం చేస్తే కోటిమందికి అన్నదానం. చేసినంత ఫలితం లభిస్తుందట. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలోకూడా సర్వసుఖాలు లభిస్తాయని శాస్త్ర వచనం. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీమహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి హారతి ఇవ్వడం కుదరనివారు దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చె హారతిని వీక్షించినా హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం తొలగిపోతుంది.
Comments
Post a Comment