ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంనుంచి 58 కిలో మీటర్ల దూరంలో కార్వేటినగరం ఉంది.
నారాయణవనంను పరిపాలించిన సూర్యవంశరాజులు ఒకసారి వేటకు ఈ ప్రాంతానికి రాగా కుక్కలను కుందేళ్ళ తరుముతుండడం వారి కంటపడింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన వారు ఈ ప్రాంతంలో ఉన్న అడవిని నరికి ఒక ఊరు నిర్మింపజేశారు. అడవిని నరికి కట్టిన ఊరు కనుక ఈ ఊరికి 'కాడువెట్టి నగరం' అనే పేరు ఏర్పడింది. అది కాల క్రమంలో కార్వేటినగరంగా మార్పు చెంది. నట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. 1541వ సంవత్సరంనాటి శాసనం ఈ ఊరిని 'కార్వేడు' అని పేర్కొంది. కార్వేటి అనే దేవత ఈ ప్రాంతంలో కొలువుదీరడం వల్ల ఆమె పేరు మీదే కార్వేటినగరం అని ఈ క్షేత్రానికి పేరు వచ్చినట్లు కూడా ప్రచారంలో ఉంది.
శ్రీకృష్ణభగవానుడు ఈ క్షేత్రంలో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతం నారాయణవనం రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ రాజ్యాన్ని సూర్య వంశానికి చెందిన కరికాల చోళుడు పరిపాలించాడు. ఆయన కుమారుడు తొండమాన్చక్రవర్తి. తొండమాన్చక్రవర్తి మునిమనవడు నారాయణరాజు. తన పూర్వీకుల మాదిరే నారాయణరాజు కూడా దైవభక్తి పరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించిన రాజు. అటు వంటి నారాయణరాజు మునిమనుమడైన వెంకటరాజు తన పాలనాకాలంలో కార్వేటి నగరం పాలనను పెరుమాళరాజుకు అప్ప గించాడు. పెరుమాళరాజుకు ఒకనాటి రాత్రి స్వప్నంలో శ్రీకృష్ణభగవానుడు సాక్షా త్కరించి ఆలయాన్ని నిర్మించి తనను ప్రతి ష్ఠించమని పలికాడు. దీనితో ఆయన కార్వేటినగరంలో ఆలయాన్ని నిర్మించి శ్రీరుక్మిణీసత్యభామసమేత శ్రీవేణుగోపాల స్వామివారిని ప్రతిష్ఠింపజేసినట్లు స్థల పురాణం వెల్లడిస్తూ ఉంది.
కార్వేటినగరంలో విశాలమైన ప్రాంగణంలో కన్నులపండుగ చేస్తూ - శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం దర్శన -మిస్తుంది. ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణికి 'స్కందపుష్కరిణి' అని పేరు. ఆలయం తూర్పుఅభి ముఖంగా ఉంది. ఆలయ ప్రధానప్రవేశద్వారంపై ఐదుఅంతస్తుల గోపురం, పైభాగంలో ఏడుగోపురకలశాలు ప్రతిష్ఠింపబడి దర్శన మిస్తుంది. ఆలయప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడాళ్వారుమండపం ఉన్నాయి. ప్రధాన ఆలయం రంగమండపం, ముఖమండపం, అంత రాలయం, గర్భాలయాలను కలిగి ఉంది. రంగమండపంలోని స్తంభాలు శిల్పకళాశోభితమై భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ దర్శనమిస్తాయి. ముఖమండపంలో ఆళ్వారులు కొలువుదీరి ఉన్నారు. ముఖమండపంనుంచి అంతరాలయంలోనికి ప్రవే శించే ద్వారానికి ఇరువైపులా జయ, విజయులు ద్వారపాల కులుగా కొలువుదీరి దర్శనమిస్తారు.
ప్రధానగర్భాలయంలో శ్రీవేణుగోపాలస్వామివారు శ్రీరుక్మిణీసత్యభామాసమేతుడై కొలువుదీరి పూజలందుకుంటూ ఉన్నాడు. స్వామివారు రెండుచేతులతో వేణువును మీటుతూ గోవును ఆనుకొని దివ్యమంగళ స్వరూపంతో ఉండగా, స్వామి వారికి ఇరువైపులా శ్రీరుక్మిణిదేవి శ్రీసత్యభామలు కొలువుదీరి ఉన్నారు. ఆలయప్రాంగణంలో శ్రీకోదండరామస్వామి, శ్రీగోదా దేవి, శ్రీరామానుజాచార్యులు, శ్రీవిష్వక్సేనుడువంటి దేవతా మూర్తులను దర్శించుకోవచ్చు.
చారిత్రకంగా పరిశీలిస్తే 17వ శతాబ్దంలో ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. కార్వేటినగరం పాలకులు ఈ ఆల యాన్ని నిర్మింపచేయడంతోపాటు స్వామివారిని సేవించి తరిం చారు. కాగా వెంకటపెరుమాళ్జు 1719లో ఆలయాన్ని పున ర్నిర్మించారు. 1930వ సంవత్సరంలో దేవాదాయశాఖ ఈ ఆలయపాలన చేపట్టగా, 1989వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ ఆలయపాలనా బాధ్యతలను స్వీక రించారు. 2006వ సంవత్సరంలో గోపురజీర్ణోద్ధరణ చేసి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
ప్రతిరోజు పూజలుజరిగే కార్వేటినగరం శ్రీవేణు గోపాలస్వామివారికి ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో బ్రహ్మో త్సవాలు జరుగుతాయి. వైశాఖబహుళపంచమి నుంచి చతుర్దశి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రావణమాసంలో శ్రీకృష్ణా ష్టమి పండుగ సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం, వైకుంఠఏకాదశి, సంక్రాంతి సందర్భంగా కూడా ప్రత్యేకఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి.
సంతానప్రదాయకుడిగా పేరు పొంది ఆరాధనలందు కుంటున్న కార్వేటినగరం శ్రీవేణుగోపాలస్వామివారిని దర్శించి భక్తులు తరించవచ్చు.
Comments
Post a Comment