సప్తమోక్షపురాల్లో ఒకటిగా, శివుడి కన్నుల్లో ఒకటిగా పేరు పొందిన కాశీక్షేత్రం జగన్మాత శ్రీవిశాలాక్షీదేవిగా కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం అష్టాదశశక్తిపీఠాలలో పదిహేడవ క్షేత్రం వారణాసి
జ్యోతిర్లింగాలలో శ్రీ విశ్వేశ్వరమహాలింగానికి, అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీ విశాలాక్షీదేవికి నిలయమైన వారణాసికే కాశీ క్షేత్రం అని పేరు.
సప్తమోక్షపురాల్లో ఒకటిగా, శివుడి కన్నుల్లో ఒకటిగా పేరు పొందిన కాశీక్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానదీ తీరాన ఉంది.
సంస్కృతంలో 'కస్' అంటే ప్రకాశించునది లేదా వెలుగును విరజిమ్మునది.
'అ' అంటే మోక్షసాధనకు అవసరమైన వెలుగును (జ్ఞాన మనే వెలుగు) ప్రసాదించునది కనుక ఈ క్షేత్రానికి 'కాశి' అనే పేరు ఏర్పడినట్లు కథనం.
ఈ క్షేత్రాన్ని బెనారస్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లతో పాటు ప్రాచీనకాలంలో కాశీని వివిధ పేర్లతో పిలిచేవారు. త్రినేత్రుడైన శివుడికి ఈ క్షేత్రంలో ఉండటం మహాఇష్టం కనుక ఈ క్షేత్రానికి 'ఆనందకాననం' అనీ, ఈ క్షేత్రంలో ఏ విధమైన పాపాలు, దోషాలు దరిచేరవు కనుక 'అవిముక్తక’ అనే పేర్లు ఉన్నట్లుగానూ, వీటికి తోడూతీరస్థలి, ముక్తిభూమి,క్షేత్రపురి, ముక్తిపురి, మహాస్మశాని, రుద్రావాస, తపఃస్థలి వంటి అనేక పేర్లు ఉన్నట్లు చెప్పబడుతోంది.
కాశీవద్ద గంగానదిలో వరుణ, అసి అనే నదులు సంగమిస్తున్నాయి. కనుక వారణాసి అని పేరు.
ఈ క్షేత్రం సతీదేవి 'మణికర్ణిక' పడినట్లుగా కథనం.
పురాణ గాధ
మహిమాన్వితమైన కాశీక్షేత్రంలో పరమ శివుడు విశ్వనాథునిగా కొలువుతీరగా అమ్మ వారు అన్నపూర్ణగా పూజలనందుకుంటోంది. ఈ క్షేత్రంలో విశాలాక్షీదేవి కొలువుదీరడానికి వెనుక ఆసక్తికరమైన పురాణగాధ ప్రచారంలో ఉంది.
పూర్వం ఒకానొక సమయంలో భూలోకమంతా చెడు పాలకులతో నిండిపోయింది. అన్యాయాలు అధికమయ్యాయి. ఫలితంగా సుమారు అరవై సంవత్సరాలపాటు తీవ్రమైన అనా వృష్టి ఏర్పడింది. పంటలు పండలేదు. ఆహారంలేక ప్రజలు మరణించసాగారు.
ఈ విధంగా ప్రజలుపడుతున్న అవస్థలను చూసి జాలి కలిగిన బ్రహ్మదేవుడు అనేక రకాలుగా ఆలోచించి చివరకు మనువంశమునకు చెందిన రిపుంజయుడి వద్దకు వెళ్ళాడు. అప్పటికి రిపుంజయుడు తపస్సులో నిమగ్నమై ఉన్నాడు.
తపస్సు చేసుకుంటూ ఉన్న రిపుంజయుడిని మేలుకొల్పి- “రిపుంజయా! నీవు ధర్మవర్తనుడవైన క్షత్రియుడవు. ఈ భూలోకంలోని ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటూ ఉన్నారు. నీవు పరిపాలనా బాధ్యతలను స్వీకరించు. ప్రజల కష్టాలను తీర్చి సుభిక్షమైన పాలనను అందించు. నీవు దివో దాసుడు అనే పేరుతో కాశీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించు” అని బ్రహ్మదేవుడు పలికాడు.
అందుకు-"లోకరక్షకా! నీ ఆజ్ఞను శిరసావహించి దివో దాసు అనే పేరును స్వీకరించి పరిపాలన బాధ్యతలను చేపడతాను. అయితే అందుకు నాదొక షరతు. దానిని అంగీకరించిన యెడల నేను అందుకు సిద్దం” అని రిపుంజయుడు తెలిపాడు.
"నీ షరతు నాకు అంగీకారమే! అయితే అదేమిటో తెలియ జెప్పు" అని బ్రహ్మదేవుడు అడిగాడు.
“కాశీనగరంలో ఉన్న నాగులు, యక్షులు, దేవతలు అంద రూ కాశీనగరాన్ని వదలి వెళ్ళాలి. ఆ విధంగా వారు వెళ్ళిన మరుక్షణమే నేను పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తాను.” అని సమాధానమిచ్చాడు.
అందుకు బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు.
దివోదాసుడు విధించిన షరతు ప్రకారం ఇతర దేవతలతో పాటు శివుడు కూడా తనకు అత్యంత యిష్టమైన కాశీనగరాన్ని విడిచి వెళ్ళాడు.
దివోదాసు కాశీని రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.
అయితే శివుడు కాశీ వియోగాన్ని భరించలేకపోయాడు.తిరిగి కాశీపట్టణాన్ని ఎలాగైనా చేరాలని అగ్ని, వాయు, వరుణ, సూర్యదేవుల సహాయంతో ప్రయత్నించాడు. కానీ, ప్రయోజనం లేకుండాపోయింది. కాశీ వియోగబాధ శివుడికి అధికమైంది. ఇలాంటి స్థితిలో తండ్రి బాధను చూడ లేని వినాయకుడు అందుకు పూనుకున్నాడు.
వినాయకుడు 'డుంఢి భట్టారకుడు' అనే పండితునిగా అవతారాన్ని ధరించి కాశీకి చేరుకుని, దివోదాసుకు సన్నిహితుడయ్యాడు. కాశీరాజ్యంలో ధర్మవిపరీతము జరిగేటట్లుగా చేశాడు. రాజ్యంలో ధర్మ సంక్రమం కావడాన్ని సహించలేని దివో దాసుకు వైరాగ్యం కలిగింది. భక్తి కలిగింది. దీనితో రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి కాశీనగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
దివోదాసు కాశీని వదలివెళ్ళడంతో శివుడు పరమానంద భరితుడై ఆనందతాండవం చేస్తూ కాశీనగరంలోకి ప్రవేశిం చాడు. పార్వతీదేవి ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో విశాలమైన కన్నులతో చూసి ఆనందిస్తూ 'శ్రీ విశాలాక్షి' పేరుతో కాశీక్షేత్రం లోనే కొలువుదీరినట్లు పురాణగాధ చెబుతోంది.
క్షేత్ర విశేషాలు
పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో దర్శనీయాలు అనేకం ఉన్నాయి. వారణాసిలో గంగానది తూర్పువైపునకు, వరుణా నది ఉత్తరంవైపుకు అసినది దక్షిణంవైపునకు ప్రవహిస్తుంటాయి. ఈ నదులవెంట అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టాలకు ఘాట్లు అని పేరు. సుమారు వందవరకూ ఘాట్లు. వాటికి వివిధ పేర్లు ఉన్నాయి. ఈ ఘాట్లన్నీ కూడా రెండు కిలోమీటర్లలోపు వరుసగా ఉన్నాయి. అంటే ఒకదాని నుంచి మరొకటి కేవలం ఇరవైగజాల దూరంలో ఉంటాయి. వీటిల్లో ఐదుఘాట్లు ప్రధానమైనవిగా పేరుపొందాయి.అందులో మొదటిది 'అసీసంగంఘాట్'. అసీనది గంగా నదిలో విలీనమయ్యేచోట ఈ ఘాట్ ఉంది. రెండవఘాట్ వరుణానది గంగానదిలో విలీనం అయ్యేచోటు ఉన్న ఘాట్ ఇది. మూడవఘాట్ 'దశాశ్వమేథ ఘాట్' అని పేరు. దీనికే 'దశసోమార్ ఘాట్' అని కూడాపేరు. పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ పది అశ్వమేథయాగాలు చేసినట్లు పురాణకథనం.
నాలుగవ ఘాట్ పేరు 'పంచగంగాఘాట్'. ఈ ఘాట్లో గంగానదిలో యమున, సరస్వతి, కిరణ, ఘాతపాప అనే నదులు అంతర్వాహినిగా కలుస్తాయనీ అంటే పంచనదులు కలుస్తూ ఉన్న ఘాట్ కనుక 'పంచగంగాఘాట్ ' అనే పేరు ఏర్పడింది. ప్రధానమైన ఘాట్లో ఐదవ ఘాట్ - 'మణికర్ణికా ఘాట్'. ఇది అత్యంత పవిత్రమైన ఘాట్.
ఈ ఘాట్ అత్యంత పవిత్రమైనదిగా చెప్పడానికి సంబంధించిన ఒకపురాణ గాధ ప్రచారంలో ఉంది. ఒకసారి శ్రీమహా విష్ణువు గంగానదీతీరంలో తన చక్రంతో ఒక గుంతను చేసు కుని అందులో కూర్చుని తపస్సు చేయసాగాడు. ఒక ప్రక్క గంగాజలం, మరోపక్క స్వేదంతో ఆ గుంత అంతా నిండి పోయింది. అయినా తపస్సులోనే నిమగ్నమై ఉన్నాడు. కానీ ఏ మాత్రం విష్ణువు ధ్యానం చెక్కుచెదరలేదు. ఈ విషయాన్ని కైలాసం నుంచి గమనించిన శివుడు, విష్ణువు తపస్సును మెచ్చు కున్నట్లుగా తలఊపాడు.
ఆ విధంగా తలఊపిన సమయంలో శివుడి చెవులకున్న కర్ణిక పడింది. అందువల్ల దీనికి మణికర్ణికా అను పేరు ఏర్పడటంతోపాటు అత్యంత పవిత్రమైనదిగా పేరుపొందింది. ఈ ఘాట్లోగానీ, సమీపంలోగానీ మరణించినవారి చెవిలో శివుడు స్వయంగా తారకమంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని కధనం.
అంతేకాకుండా ఈ ఘాట్ వద్ద దహనసంస్కారం చేస్తే మోక్షం లభిస్తుందనేది కూడా నమ్మకం. మణికర్ణికాఘాట్ సమీపంలోని సన్నటి సందులో విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. భక్తులు శ్రీవిశ్వేశ్వరలింగాన్ని స్వయంగా గంగానది నుంచి నీరు తెచ్చి అభిషేకించవచ్చు.
స్వామిని తాకి పూజలు చేయవచ్చు.
ఈ విశ్వేశ్వరస్వామివారి ఆలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది.
ఈ ఆలయంలోని అన్నపూర్ణాదేవి అక్షయపాత్రను, గరిటెను చేతులలో ధరించి దర్శనమిస్తుంది. ఈమెను పూజిస్తే భుక్తికి ఎటువంటి లోటు ఉండదనేది నమ్మకం. శ్రీవిశ్వేశ్వరాలయ ప్రాకార ద్వారానికి పక్కగా ఢుండి వినాయకుడు కొలువు దీరి ఉన్నాడు. స్వామివారి ఆలయానికి సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో కాలభైరవుని ఆలయం ఉంది.
కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు. ఇంకా దుర్గాదేవి మందిరం, తులసీ మానస మందిరం, సంకట విమోచన మందిరం, కేదారేశ్వరమందిరం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి.
గంగానదికి ఆవలివైపున సుమారు 10 కిలోమీటర్ల దూరంలో రామ్నగర్ ఉంది. దీనికే 'వ్యాసకాశి' అనిపేరు.
ఆలయ విశేషాలు
విశ్వేశ్వరస్వామివారి ఆలయానికి రెండువీధుల తరువాత దక్షిణంగా అష్టాదశ మహాశక్తులలో ఒకరైన విశాలక్షి ఆలయం ఉంది.
అయితే ఈ ఆలయం కేవలం ఒక సాధారణమైన ఇంటి లాగానే ఉంటుంది. కానీ ఆలయమని అనిపించదు. ఈ ఆలయం ముఖమండపం,గర్భాలయాలను కలిగివుంది. గర్భాలయంలో శ్రీవిశాలాక్షీదేవి కొలువుదీరి ఉంది.
శ్రీ విశాలాక్షీదేవి మూలవిరాట్టు వెనుకవైపున మరో అమ్మవారి మూర్తి దర్శనం ఇస్తుంది.
పూర్వం స్వయంభువుగా వెలసిన ఈ అమ్మవారికే పూజలు జరిగేవని తర్వాతికాలంలో ప్రస్తుత మూర్తిని ప్రతిష్ఠించినట్లు చెబుతారు.భక్తులు ఈ ఆలయంలో ఆర్జితసేవలను జరిపించుకోవచ్చు.
చరిత్ర
చరిత్రకందని కాలం నుంచి కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడు ఆరాధనలందుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది.
అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం అనేకసార్లు పునర్నిర్మించబడింది. అంటే ఇప్పుడున్న ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్పవచ్చు. కాగా మహారాజా రంజిత్సింగ్ ఆలయ గోపురాలకు బంగారు తాపడం చేయించాడు.
స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్న సమయంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని పండిత మదనమోహన్ మాలవ్యా స్థాపించాడు.
పూజలు, ఉత్సవాలు
ప్రతిరోజూ అభిషేకాలు, అర్చనలు, పూజలు, హారతులు జరిగే కాశీక్షేత్రంలోని ఆలయాల్లో వివిధ సందర్భాలలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు.
మహాశివరాత్రి సందర్భంగాను, కార్తీకమాసంలోనూ విశ్వేశ్వరస్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
విశాలాక్షి అమ్మవారి ఆలయంలో దేవీనవరాత్రుల సంద ర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు.
రవాణా, వసతి సౌకర్యాలు
వారణాశిలో అనేక తెలుగు ఆశ్రమాలు, సత్రాలు, వివిధ పీఠాల వారి సత్రాలు వున్నాయి.
దాదాపు వీటన్నింటిలోనూ వసతి, భోజన సౌకర్యాలు లభి స్తాయి. దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వార ణాసికి రైలు సౌకర్యాలున్నాయి. కన్నులతోనే భక్తులను రక్షించే చల్లని తల్లిగా పేరుపొందిన కాశీ విశాలక్షీదేవిని దర్శించి భక్తులు తరించవచ్చు.
Comments
Post a Comment