Karthika Puranam: కార్తీక పురాణం 19వ అధ్యాయము - జ్ఞానసిద్ధకృతహరిస్తవము

 

జ్ఞానసిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతము లందు ప్రతిపాదింపబడిన వానినిగాను, గుహ్యమైనవానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయ మునిగాను దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదులచేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము.

వాక్యములతో జెప్ప శక్యముగానివాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయుసమర్ధుడవు జన్మసంసార సముద్రమందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబినవాడవు.

పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచు చున్నది. త్రాడునందుపాము భ్రాంతివలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదనిభావము. ఓకృష్ణా! నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూపచతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞ స్వరూపుడవు నీవే. నీ సంబంధియు, పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణసారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మస్వరూపుడవు. అఖిలవంద్యుడవు. మనస్సుచేతను చూడశక్యముగాని నీవు మాంసమయములైన నేత్ర ములకెట్లు గోచరమగుదువు?

ఓ కృష్ణా !నీకు నమస్కారము. ఓయీశ్వరా ! నీకు నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్ను ధన్యునిజేయుము. మీదర్శన ఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుషా ! నీకు మాటి మాటికి నమస్కారము.

ఓదేవేశా ! నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములయందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందు వలన నా జన్మసఫల మగుగాక. నీకేమియు కొఱతపడదు గదా ! నీ జ్ఞానానికి లోపము ఉండదుగదా.

నీవు దాతవు, కృపాసముద్రుడవు, నేను సంసారసముద్రమగ్నుడనై దుఃఖించు చున్నాను. కాబట్టి సంసారసముద్రమునందు బడియున్న నన్ను రక్షించుము శుద్ధచరితా, ముకుందా ! దుఃఖితుడనగు నన్నురక్షింపుము. త్రిలోకనాధా నమస్కారము, త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆది కారణా, పరమాత్మా నమస్కారము.

పరమాత్మరూపుడవు, పరమహంసపతివి, పూర్ణాత్ముడవు, గుణాతీతు డవు, గురుడవు, కృపావంతుడవు కృష్ణా! నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధిని నివాసివి, స్వర్గమోక్షద్రుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధుహృదయ పద్మినివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు నమస్కారము.

ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా ! నీకు నమస్కారము. వైకుంఠనిలయా ! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములుగల కృష్ణా! నీకు నమస్కా రము. విద్వాంసులు నీకు నమస్కారాదులుచేసి నీ పాదభక్తియును పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును బొందుదురు.

అనేక బోధలచేతను, తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రముల చేతను, నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేరు. నీపాదభక్తి యనుకాటుకను ధరించి నీ రూపమును జూచి దానినే యాత్మగాభావించి తరింతురు.

గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ విభీషణ, ఉద్దవ ముఖ్య భక్తులను కాఆడిన ఓహరీ ! నీకునమస్కారము. నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమాఱు నీనామసంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును.

కేశవా, నారాయణా, గోవిందా, విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా,త్రివిక్రమా, నిత్యరూపా, వామనా, శ్రీధరా, హృషీ sశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకువందనములు. ఓ కృపానిధీ! మమ్ములను రక్షించుము.

ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో నిట్లనియె. ఓ జ్ఞానసిద్ధా! నీ స్తోత్రమునకు సంతోషించితిని. నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదనుకోరుకొనుము అని విష్ణువు పల్కెను.

జ్ఞానసిద్ధుడిట్లడిగెను. గోవిందా నాయందు దయయున్నయెడల నీ స్థానమును యిమ్ము. ఇంతకంటే వేఱు ఏఇతర వరము కోరను. భగవంతు డిట్లు చెప్పెను. ఓ జ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును కాని ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై యున్నారు. బుద్ధిహీనులయి ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును జెప్పెదను వినుము. ఓమునీంద్రులారా ! మీరందరు వినుడు. నేజెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము.

నేను ఆషాఢశుక్ల దశమినాడు లక్ష్మితోగూడ సముద్రమందు నిద్రించె దను. తిరిగి కార్తికశుక్ల ద్వాదశినాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చెడి ఈ మాసచతుష్టయమందు శక్తివంచనచేయక వ్రతాదుల నాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాసచతుష్టయమందు వ్రతమాచరించనివాడు నరకమందుపడును. ఓ మునీశ్వరులారా! నా ఆజ్ఞమీద భక్తిమంతు లైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈ వ్రతమును తప్పకచేయండి. ఇంకా అనేక మాటలతో నేమిపనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈచాతుర్మాస్య వ్రతమును జేయదోపాడు బ్రహ్మహత్య ఫలమునుబొందును.

నాకు నిద్రగాని, మాంద్యముగాని జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని, లాబాలాభములుగాని లేవు. అనగా యీ నిద్రాదులకు భయపడి నేను సముద్ర మందు శయనించలేదు. నా భక్తిగలవారెవ్వరో భక్తిలేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెను. కాబట్టి నా ఆజ్ఞననుసరించి నాకిష్టమయిన ఈ చాతుర్మాస్య వ్రత మును జేయువారు విగతపాపులగుదురు నాకు ఇష్టులగుదురు.

నీచే చేయబడిన యీ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించు వారికి నా భక్తిస్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి యిట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్ర మందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్నకు సమాధాన ముగా ఈ చాతుర్మాస్యవ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలోను ఉత్తమోత్తమ మైనది. పాపవంతులుగాని, దురాత్ములుగాని, సాధువులుగాని ఎవరైనను హరిపరాక్ష్మీనులై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్యవ్రతమును జేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై జేయవలెను.

ఈ చాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవగాని, శ్రమణిగాని లేక సన్యాసిగాని తప్పకజేయవలెను. మోహముచేత చాతుర్మాస్యవ్రతమును జేయకుండిన యెడల శుచిత్వము చేసికొని లేక బ్రహ్మహత్య పాపమును బొందును. మనోవాక్కాయలములను శుద్ధముచేసికొని చాతుర్మాస్యమునందు హరిని పూచించినవాడు ధన్యుడగును.

చాతుర్మాస్యవ్రతమాచరించనివాడు కోటిజన్మములందు కల్లుద్రాగు వాడు పొందెడి గతిని బొందును. సందేహములేదు. పరమాత్మతుష్టికై చాతుర్మాస్యవ్రతమాచరించనివాడు గోహత్యచేసినవాని ఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలుచేసికొని ఏ విధముగా నైనను చాతుర్మాస్య వ్రతమాచరించువాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు విష్ణు లోకమునుజేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాటలనువిని చాతుర్మాస్య వ్రతమునుజేసి వైకుంఠలోకనివాసులయిరి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి