అష్టవినాయక దేవాలయాల్లో నాలుగోది వరద వినాయక క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ తాలూకాలో ఉన్న మహ్ద్ గ్రామంలో ఉంది. ఇది స్వామివారు స్వయంభు.
పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించే రుక్మాంగదుడు అనే రాజు వేటకై వెళ్లి అలసిపోయి దాహము తీర్చుకొనుటకు వాచకవి అనే ముని ఆశ్రమమునకు వెళ్లెను. ఆ సమయంలో మునీశ్వరుడు నదీ స్నానానికి వెళ్తూ, తాను తిరిగి వచ్చే వరకు రాజును ఆశ్రమంలోనే కూర్చోమని చెప్పి వెళ్తాడు.
ముని పత్ని ముకుంద ఆశ్రమంలో కూర్చుని ఉన్న రుక్మాంగదుని చూసి మోహిస్తుంది. రుక్మాంగదుడు మహా శీలవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. ముని పత్ని కోర్కెను అతను సున్నితంగా తిరస్కరిస్తాడు. అందుకు ముని పత్ని కోపించి, అతనిని కుష్టు రోగివి కమ్మని శపిస్తుంది. శాపగ్రస్తుడైన రుక్మాంగదుడు కుష్టు రోగ నివారణకై నారద మునీంద్రుని ఉపదేశానుసారం, గణపతిని ధ్యానించి, పూజించి, రోగ విముక్తుడవుతాడు.
ఇక్కడ ముని పత్నియైన ముకుందకు, రుక్మాంగదుని శపించినా కూడా అతనిపై మోహము వీడలేదు. ఇది గ్రహించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ముకుంద కోర్కెను తీరుస్తాడు. ఫలితంగా ముకుంద ఒక మగ బిడ్డకు జన్మ ఇస్తుంది. ఆ బాలునికి వాచకవి ముని "గృత్స్నమదుడు' అని నామకరణము చేసెను. గృత్స్నమదుడు ముని బాలకుడులా పెరిగి పెద్దవాడవుతాడు. ఒకనాడు అత్రి, విశ్వామిత్రుడు సహా ఇతర మునులతో గృత్స్నమదుడు ఆధ్యాత్మిక వాగ్వివాదమునకు దిగగా, వారు 'నీవు ఋషి పుత్రుడవుకావు, రుక్మాంగద రాజ పుత్రుడవు కాబట్టి నీవు ఎన్నటికీ మాతో సరి సమానం కాలేవు అని అవమానిస్తారు.
గృత్స్నమదుడు చింతాక్రాంతుడై తన తల్లియైన ముకుందను నిజము చెప్పమని అడుగగా ఆమె గృత్స్నమదుడు, రుక్మాంగద మహారాజు పుత్రుడే అని నిజం చెబుతుంది. అప్పుడు గృత్స్నమదుడు కోపగించి తన తల్లిని ముళ్ల పల్లు గల చెట్టుగా మారి అందరితో తిరస్కరింపబడుదువు గాక! అని శపిస్తాడు. ఆమె కూడా తన కుమారుని త్రిలోకాలకూ కంటకుడైన వాడూ, మహా బలపరాక్రమాలు కలిగిన రాక్షసుని కుమారుడుగా జన్మిస్తాడని ప్రతి శాపమిస్తుంది.
అంతలో ఆకాశవాణి గృత్స్నమదుడు ఇంద్రుని పుత్రుడని పలికెను. ఆ సమాచారం విని తల్లి, కుమారుడు ఆశ్చర్యపోతారు.
గృత్స్నమదుడు తన పరిస్థితికి చింతించి, పుష్పక వనానికి పోయి, కేవలం వాయువును భక్షించుచు వేయి సంవత్సరాలు విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమై గృత్స్నమదుడు గొప్ప వేద బ్రాహ్మణుడవుగా, ద్రష్టగా కీర్తిని సంపాదిస్తాడని వరము ప్రసాదిస్తాడు. గృత్స్నమదుడు సంతోషించి, వినాయకుని అక్కడే వెలసి వాడ వినాయకుడిగా భక్తుల కోర్కెలను తీర్చమని కోరగా వినాయకుడు అంగీకరించెను.
తరువాత గృత్స్నమదుడు వినాయకునికి ఆలయమును నిర్మించి వినాయక మూర్తిని అందులో ప్రతిష్ఠ చేస్తాడు. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. వినాయకుని తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటుంది. ఈ ఆలయంలో మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయానికి నలువైపులా నాలుగు ఏనుగు విగ్రహాలు ఉంటాయి.
వరద వినాయకుని ఆలయంలో మాఘ చతుర్థి సందర్భంగా జరిగే ప్రత్యేక పూజలో పాల్గొని ప్రసాదంగా స్వీకరించిన కొబ్బరికాయను సేవిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెబుతారు. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. శ్రీ గణేశ పురాణము ప్రకారం ఈ కథను విన్నవారు, చదివినవారు సకల అభీష్టములను పొంది, గణేశానుగ్రహమువలన మోక్షమును పొందుతారని తెలుస్తోంది.
ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 వరకు
ముంబై నుండి 63 కి.మీ పూణే నుండి 85 కి.మీ దూరంలో వుంది ఈ ఆలయం
No comments:
Post a Comment