Arupadiveedu: ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్యస్వామి ఆరు క్షేత్రాలు - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, July 16, 2024

demo-image

Arupadiveedu: ప్రసిద్ధి చెందిన సుబ్రమణ్యస్వామి ఆరు క్షేత్రాలు

Responsive Ads Here
aru%20padai%20veedu

తప్పక దర్శించవలసిన సుబ్రమణ్యస్వామి ఆరు ఆలయాలు  

పళని

పూర్వం శివుడు, 'గొప్ప జ్ఞానఫలం- 'నీవే' అని సుబ్రహ్మణ్యస్వామితో అన్నాడు. తమిళంలోని 'ఫలం నీ' అనే పేరు కాలక్రమంలో పలనిగా మారింది. అదే పళని క్షేత్రం. ఒకసారి నారదుడు అమూల్యమైన జ్ఞానఫలాన్ని తీసుకుని కైలాసానికి వెళ్లాడు. దానిని ముక్కలు చేయకుండా తినమని కోరాడు. పార్వతి ఆ ఫలాన్ని కుమారులకు ఇవ్వాలనుకుంది. "ఎవరైతే ముందుగా ఈ భూప్రదక్షిణం చేసివస్తారో వారికే ఈ ఫలం యిస్తాను' అని పార్వతీదేవి పలుకడంతోనే సుబ్రహ్మణ్యస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి బయలుదేరాడు. వేగంగా ప్రయాణించలేని వినాయకుడు ఆలోచించి, తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి భూప్రదక్షిణ ఫలాన్ని, నారదుడిచ్చిన జ్ఞానఫలాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. దాంతో అలిగిన సుబ్రహ్మణ్యస్వామి కైలాసం వదలి, ప్రస్తుతం పళని వున్న కొండపైకి వచ్చి కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతోంది. పళనిలో ఆలయం ఉన్న శివగిరి కొండ సుమారు 485 అడుగుల ఎత్తు. 695 మెట్లమార్గం ద్వారా, రోప్ వే లేదా రైలు మార్గాల్లో కొండ మీదికి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలు కలిగిన ఈ ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నిలుచుని ద్విభుజాలతో కటిహస్తుడై మరో చేతిలో దండం ధరించి కౌపీనధారిగా దర్శనం ఇస్తాడు. స్వామివారిని మురగన్, దండాయుధపాణి అని భక్తలు పిలుస్తారు. నవపాషాణం అనే విశిష్టమైన శిలతో తయారుచేసిన స్వామి విగ్రహం నుంచి ధూప, దీప సమర్పణ 4 సమయంలో మూలికా పదార్థాలు వెలువడుతాయని, వాటిని పీల్చడం వల్ల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఈ స్వామి కావడి ప్రియుడు. 3 పూలు, పాల కావళ్ళను భక్తులు స్వామి వారికి సమర్పిస్తారు. పళని లో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. చెన్నె నుంచి 445, మదురై నుంచి 119, కోయంబత్తూరు నుంచి 119, ఆ కన్యాకుమారి నుంచి 157 కిలోమీటర్ల దూరం లో వున్న పళని కి అన్ని 33 ప్రాంతాలనుంచి బస్సు సౌకర్యాలు వున్నాయి.

తిరుచెందూర్

కుమార స్వామి తిరుచెందూరులోనే ఆరురోజుల యుద్ధంతో తారకాసురుడిని సంహరించినట్లు స్థలపురాణం. తారకాసురుని తరువాత శూరపద్ముడు వివిధ రూపాలను ధరించి స్వామితో యుద్ధం చేయసాగాడు. చివరకు శ్రీసుబ్రహ్మణ్యస్వామి ధాటికి తట్టుకోలేక ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి నిలిచాడు. శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన చేతిలోని ఆయుధంతో మామిడిచెట్టును రెండుగా చీల్చి సంహారం చేశాడు. అయితే చీలిపోయిన మామిడిచెట్టు భాగాలు నెమలి, కోడిపుంజులుగా మారి శ్రీసుబ్రహ్మణ్యస్వామితో యుద్ధం చేయసాగాయి. చివరకు సుబ్రహ్మణ్య స్వామి వేస్తున్న బాణాలధాటికి తట్టుకోలేకపోయిన కోడిపుంజు, నెమలిలు స్వామిని శరణువేడగా, ప్రసన్నమైన సుబ్రహ్మణ్యస్వామి నెమలిని తన వాహనంగానూ, కోడిపుంజును తన ధ్వజానికి గుర్తుగానూ చేసుకుని తారకాసురుడిని సంహరించిన చోటనే కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతూ వుంది.

తిరుచెందూరు ఆలయం సముద్ర తీరంలో వుంది. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలను కలిగి వున్న ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చతుర్భుజాలతో కొలువుదీరివున్నాడు. పుష్పమాల, కుక్కుట ధ్వజం, అక్షమాల, కటి హస్తాలతో స్వామి వారు దేదీప్యమానంగా దర్శనమిస్తాడు. తిరుచెందూరులో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. తిరునల్వేలి నుంచి 53, కన్యాకుమారి నుంచి 85, రామేశ్వరం నుంచి 205 కిలోమీటర్ల దూరంలో తిరుచెందూరు ఉంది. బస్సు సౌకర్యాలు వున్నాయి.

తిరుపరంకుండ్రం

సుబ్రహ్మణ్యస్వామికి వల్లి, దేవసేన అని ఇద్దరు భార్యలున్నారు. వారిద్దరూ పూర్వజన్మలో విష్ణుమూర్తి కుమార్తెలే. అప్పుడు వారిపేర్లు అమృతవల్లి, సుందరవల్లి,. వారిలో అమృతపల్లిని దేవేంద్రుడు పెంచుకున్నాడు. ఆమెయే దేవసేన. తారకాసురుడిని సంహరించి తనను రక్షించిన సుబ్రహ్మణ్యస్వామికి దేవసేననిచ్చి దేవేంద్రుడు తిరుప్పరకుండ్రంలో వివాహం జరిపించాడు. తిరుప్పరకుండ్రం లో ఆలయం శివమలై అనే కొండ పై వుంది. వివిధ మండపాలు కలిగిన ఆలయ ప్రధాన గర్భాలయం లో స్వామి వారు పెండ్లికుమారుడిగా చతుర్భుజాలతో దర్శనం ఇస్తాడు. ఈ క్షేత్రంలో అభిషేకం మూలవిరాట్టుకు కాకుండా స్వామి వారి ఆయుధం అయిన దండానికి చేయడం విశేషం. స్వామి వారితో పాటు గర్భాలయంలో దేవసేన, విష్ణువు , దుర్గాదేవి, లక్ష్మి వంటి దేవతాముర్తులు కొలువుదీరి వున్నారు. కాగా, మదురై లోని మీనాక్షి సుందరేశ్వరులు తమ కుమారుడి వివాహం జరిగిన ఈ క్షేత్రాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారని కథనం. మధురై కి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి మధురై నుంచి బస్సు సౌకర్యాలు వున్నాయి.

తిరుత్తణి

కనిమలై, కల్లారగిరి, తణికాచలం, నీలాద్రి, 'నీలోత్పలగిరి' అనే పేర్లతో కూడా తిరుత్తణిని పిలుస్తుంటారు. తిరుత్తణి సమీపంలోని వల్లిమలై అనే కొండమీద “శ్రీవల్లి" అనే ఆమె సుబ్రహ్మణ్యస్వామి తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది. వారి వివాహం ఇక్కడే జరిగింది.

తిరుత్తణి క్షేత్రంలో ఆలయం 360 మెట్లున్న కొండమీద ఉంంది. ఘాట్ రోడ్ ఉంది. మూడు ప్రాకారాలు, విశాలమైన మండపాలు కలిగిన ఆలయంలోని ప్రధానగార్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు ద్విభుజాలను కలిగి, జ్ఞానదండం, కటిహస్తములతో భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తారు. స్వామివారికి ఇరువైపులా వున్న ప్రత్యేక గర్భాలయాల్లో దేవేరులైన శ్రీవల్లీ, దేవసేనలు వున్నారు. మూలవిరాట్టును నిశితంగా పరిశీలిస్తే స్వామివారి వక్షస్థలంపై గుండ్రటి ప్రదేశంపైన చందనం అద్దబడి వుంటుంది. తారకాసురుడు దొంగిలించిన విష్ణుమూర్తి శంఖు, చక్రాలను సుబ్రహ్మణ్యస్వామి తిరిగి తీసుకువచ్చాడు. తిరుత్తణి లో భక్తులకు వసతిసౌకర్యాలు లభిస్తాయి. చెన్నె నుంచి 86, తిరుపతి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట చెన్నె ప్రధాన రైలు మార్గంలో వున్న తిరుత్తణికి బస్సు, రైలు సౌకర్యాలు వున్నాయి.

స్వామిమలై 

తండ్రి అయిన శివుడికి గురువైనవాడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి స్వామి కొలువుదీరిన కొండ "స్వామిమలై". కావేరీనదీ తీరంలో వుంది. తారకాసురుడిని అతని సోదరుడు శూరపద్ముడిని అంతమొందించి, తన పదవిని, శక్తులను తిరిగి తనకు యిచ్చినందులకు కృతజ్ఞతగా దేవేంద్రుడు ఈ స్వామికి ఐరావతాన్ని బహూకరించాడు. అందుకు సంకేతంగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఏనుగు కొలువుదీరి వుంది.

స్వామిమలై ఆలయం చిన్నకొండపై వుంది. ఆలయానికి వెళ్ళే సోపానమార్గంలో వున్న 60 మెట్లు అరవై సంవత్సారాలకు ప్రతీకగా చెబుతారు. మూడుప్రాకారాలున్న ఆలయ ప్రాంగణంలో మూడవ ప్రాకారంలో ప్రధాన ఆలయం వుంది. ప్రధాన గర్భాలయంలో స్వామివారు ద్విభుజాలతో కొలువు దీరి వున్నాడు. ఒకచేతిలో దండాన్ని ధరించిన స్వామివారు మరోచేతిని కటిహస్తంగా ధరించి దర్శనం ఇస్తాడు. స్వామి వారిని భక్తులు స్వామినాధుడు, గురునాధుడు, శివగురునాధుడు అనే పేర్లతో పిలుస్తారు. స్వామిమలై లో భక్తులకు వసతి సౌకర్యాలు వున్నాయి. కుంభకోణం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో వున్న స్వామిమలై కి కుంభకోణం నుంచి బస్సుసౌకర్యాలు వున్నాయి.

పజముదిర్చోలై

పళముదిల్ శులై, అఝుగర్ కోయిల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. పూర్వం 'అవ్వయ్యార్' అనే శ్రీసుబ్రహ్మణ్యస్వామి భక్తురాలికి సుబ్రహ్మణ్యస్వామి పళ్ళను, జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రమిది. కుమారస్వామి ఇక్కడి వైఘై నదీతీరంలో తపస్సు చేసుకుంటూ తన దేవేరులిద్దరితో ఇక్కడే నివాసమున్నాడని స్థలపురాణం చెబుతోంది. అటవీ ప్రాంతంలో ఆలయం వుంది. చిన్న ఆలయం. ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అందమైన రూపంతో చతుర్బుజుడుగా ఇరు దేవేరులతో కొలువుదీరి వున్నాడు. స్థానికులు స్వామి వారిని కల్వఘర్ అని పిలుస్తారు. స్వామివారు ధరించిన ఆయుధం పాషాణం తో చేసివుండడం విశేషం. ఈ స్వామి వారిని దర్శించి పూజించడం వల్ల విద్య విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి. ఈ క్షేత్రంలో భక్తులకు పెద్దగా వసతి సౌకర్యాలు లభించవు. 19 కి.మీ. దూరంలోని మధురై నుంచి బస్సుసౌకర్యాలు వున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages