Bhadrachalam Temple: శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం - భద్రాచలం

శ్రీరామచంద్రమూర్తి పాదధూళితో పునీతమైనదివ్యస్థలం. పవిత్రగోదావరినదీ తీరంలో పుణ్యపురాశిగా విరాజిల్లుతూ ఉన్న మహిమాన్వితపుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రం. ఖమ్మంజిల్లాలో ఉంది. 

భద్రాచలానికి ఒకప్పుడు దండకారణ్య మని పేరు. పితృవాక్యపాలకుడైన శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ కొంతకాలం ఈ దండకారణ్యంలో గడిపాడు. ఈ సమయంలో ఒక శిలపై విశ్రమించి, ఆ శిలను ఆశీర్వదించగా, ఆ శిల మరుజన్మలో మేరువు, మేరుదేవిదంపతులకు భద్రుడుగా జన్మించి, నారదుడినుంచి రామమంత్రోపదేశాన్ని పొంది, తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి, శ్రీరాముడు ప్రత్యక్షమై, భద్రుడికోరికపై అక్కడే కొలువుదీరినట్లు కథనం. 

బ్రహ్మపురాణం ప్రకారం పర్వతరాజు అయిన మేరువు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. తపస్సును మెచ్చి, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మేరువు రామభక్తిపరుడైన కుమారుడిని ప్రసాదించ మని వరం కోరాడు. బ్రహ్మవరం ప్రసాదించాడు. వరంమేరకు మేరువుకు రామభక్తిపరుడైన 'భద్రుడు' కుమారుడిగా జన్మించాడు. భద్రుడు రామదర్శనం కోరి ఘోరతపస్సు చేశాడు. తపస్సును మెచ్చి శ్రీరాముడు శంఖ, చక్ర, ధనుర్భాణాలను ధరించి ప్రత్యక్షంకాగా ఆ రూపంలోనే తన శిరస్సుపై నివాసం ఉండ మని భద్రుడు వరం కోరాడు. అలా భద్రుడు శిలారూపాన్ని ధరించగా, దానిపై రాముడు కొలువుదీరినట్లు స్థలపురాణం. భద్రుడిపై రాముడు కొలువుదీరిన క్షేత్రం కనుక 'భద్రాచలం' అనే పేరు ఏర్పడింది.

క్రీ.శ.17వశతాబ్దం తొలిరోజుల్లో భద్రాచలానికి సమీపంలోని భద్రారెడ్డిపాలెం అనే గ్రామంలో 'పోకల దమ్మక్క' అనే గిరిజనమహిళ ఉండేది. రామభక్తిపరురాలైన ఆమెకు ఒకరోజు స్వప్నంలో శ్రీరాముడు సాక్షాత్కరించి, 'భద్రగిరిమీద వెతికితే తాను కనిపిస్తాను' అని పలికాడు. ఆ మరునాడు భద్రగిరిపై వెదుకగా ఇప్పుడు ఆలయం ఉన్నచోట శిలామూర్తులు దర్శనమిచ్చాయి. ఊరిపెద్దల సహాయంతో ప్రతిదినం గోదావరినీటితో అభిషేకించి, అడవిలో దొరికేపండ్లను నైవేద్యంగా అర్పించసాగింది.

ఈ స్థితిలో కుతుబ్షాహీ స్తుల్తాన్ అబుల్ హసన్ తానీషా పాలనలో పాల్వంచప్రాంతానికి తహశిల్దారుగా పని చేస్తూ ఉన్న 'కంచర్లగోపన్న'కు శ్రీరాముడు కలలో కనిపించి ఆలయం నిర్మించ మని ఆదేశించాడు. గోపన్న శ్రీరాముడికి ఆలయం, ప్రాకారం నిర్మించి, నిత్యకైంకర్యాలను ఏర్పాటు చేశాడు. ఆలయపోషణకు అవసరమైనమాన్యాలు వివిధఆభరణాలు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వఅనుమతి లేకుండా చేయడంతో తానీషా గోపన్నను బంధించి, కారాగారంలో ఉంచాడు. గోపన్న జైలులో భక్తితో, ఆవేదనతో, నిష్టూరంతో, కోపంతో ఆలపించిన కీర్తనలు రామ దాసుకీర్తనలుగా పేరుపొందగా, గోపన్న 'రామదాసు' అయ్యాడు. ఒకనాటి అర్ధరాత్రి రామలక్ష్మణులు మారువేషంలో తానీషా వద్దకు వెళ్ళి, ధనాన్ని చెల్లించగా, గోపన్న జైలునుంచి విడుదల అయ్యాడు. రాముడిమహిమను తెలుసుకున్న తానీషా పాల్వంచ ప్రాంతఆదాయాన్ని ఆలయానికి కేటాయించడమే కాకుండా ప్రతిసంవత్సరం శ్రీరామనవమినాడు జరిగే సీతారాముల కల్యాణోత్సవాలకు ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలను తామే పంపే ఏర్పాటు చేశారు. ఈ ఆచారం నేటికీ సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు ముత్యాల తలంబ్రాలు పంపడం ఆనవాయితీ అయింది.

పవిత్రగోదావరీనదితీరాన ఉన్న ఆలయం కొంత ఎత్తులో ఉంది. ప్రధానఆలయానికి చేరుకునే ప్రధానద్వారం పైన గాలిగోపురం నిర్మింపబడింది. ప్రధానఆలయంలో అడుగిడగానే ముందుగా శ్రీఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి అని ఆయనకు పేరు. ప్రధాన గర్భాలయంలో గర్భగృహంలోని మూలవిరాట్టు అయిన శ్రీరామచంద్రమూర్తి చతుర్భుజాలతో వామాంకంమీద కూర్చున్న సీతా దేవితో లక్ష్మణుడితో కలిపి భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరింప జేస్తూ కొలువుదీరి ఉన్నారు. శంఖ, చక్ర, ధనుర్బాణాలను చేతులలో ధరించి స్వామివారు దర్శనమిస్తారు. 

ఈ ప్రధానదేవతా మూర్తులతో పాటు ఆలయప్రాంగణంలో భక్తులు శ్రీ కనక వల్లీదేవి, శ్రీ కులశేఖరఆళ్వారు, బలిపీఠం, ధ్వజస్తంభంతో పాటు గట్టుమీద లక్ష్మీనరసింహస్వామి, రథశాల, జమ్మిమండపం, సంతానగోపాలస్వామి, భద్రుడిపై శిరస్సుపై గల శ్రీరాముడి పాదాలు, గోవిందరాజస్వామిఆలయం, ఏకాదశి సత్యనారాయణ స్వామిమండపం, శ్రీరంగనాయకస్వామి, విష్వక్సేనులు, శ్రీవేంకటేశ్వరస్వామి, నారదుడు, రామదాసు ధ్యానమందిరం వంటివి దర్శించవచ్చు. 

భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్లదూరంలో గల 'పర్ణశాల' తప్పక దర్శించవలసినప్రాంతం. వనవాసకాలంలో శ్రీసీతారామలక్ష్మణులు ఈ పర్ణశాలలో నివసించినట్లు ప్రతీతి. శూర్పణఖవృత్తాంతం, సీతాదేవి మాయలేడిని కోరడం, సీతాప హరణం, రావణరథంగుర్తులు వంటి ఎన్నో తార్కాణాలు ఈ పర్ణశాలలో దర్శనమిస్తాయి. సీతాదేవి ఏకాంతంగా స్నాన మాచరించిన గోదావరిపాయ నేటికీ సీతమ్మవాగుగా పిలువ బడుతూ ఉంది.

ప్రతిరోజూ పూజలు జరిగే భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిఆలయంలో శ్రీరామనవమిసందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమిరోజు భద్రాచలంలో జరిగే శ్రీసీతారాములకల్యాణం జగత్ప్రసిద్ధి చెందింది. ధను ర్మాసం, వైకుంఠఏకాదశి, దేవీనవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకారాలు, పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశినాడు జరిగే వైకుంఠద్వారదర్శనం, తెప్పోత్సవాలలో భక్తులు విశేషసంఖ్యలో పాల్గొంటారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి