విజయనగరం పైడిమాంబ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు. పైడిమాంబ సిరిమానోత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి పదహారురోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారంనాడు నిర్వహించే సిరిమానోత్సవం ప్రధానం. పైడితల్లి అమ్మవారికి తొలి సిరిమానోత్సవాన్ని 1758లో నిర్వహించారు. 50 అడుగులు పొడవుండే సిరిమానుకు చివర... అమ్మవారి రూపంలో పూజారి కూర్చునే విధంగా ఆసనం ఏర్పాటు చేస్తారు. సిరిమానును ఒకబండిపై అమర్చుతారు. ముత్తైదువలు సిరిమానుకి పసుపు కుంకుమలు పూసి.. నూతన వస్త్రాలు చుట్టబెట్టి పళ్లగెలలు కడతారు. సిరిమానుపై అధిష్టించిన పైడితల్లి తిరువీధుల్లో విహరిస్తూ ముమ్మారు కోటశక్తికి ప్రణమిల్లుతుంది. సిరిమానోత్సవం ప్రధానంగా రైతుల ఉత్సవం. అమ్మవారి వద్ద ఉంచిన విత్తనాలు రైతులందరికీ ఇస్తారు. బెస్తవారి వల, ఈటెలు - బల్లేలు, తెల్లఏనుగు వంటివి సిరిమానోత్సవం చూడదగిన విశేషాలు. సిరిమానోత్సవం తరువాత మంగళవారంనాడు పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే మంగళవారం రాత్రి ఉయ్యాల కంబాలతో పదహారు రోజుల ఉత్సవం పూర్తవుతుంది. ముగింపు వేడుకలో భాగంగా అమ్మవారిని రైల్వేస్టేషన్ వద్ద వనంగుడికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అప్పటినుంచి వైశాఖ శుద్ధ నవమి వరకు వనంగుడిలో ఉంచుతారు. దశమినాడు మూడులాంతర్ల సెంటర్ వద్దనున్న చదురుగుడికి చేర్చుతారు. విజయనగర వాసుల కోర్కెలను తీర్చేందుకు సాక్షాత్తూ జగన్మాతయే ఇక్కడికి పైడిమాంబగా వచ్చిందని భక్తుల విశ్వాసం.
2024 ముఖ్య తేదీలు
సెప్టెంబర్ 20 - పందిరిరాట ఉత్సవం
సెప్టెంబర్20 - మండల దీక్ష
అక్టోబరు 10 - అర్ధ మండల దీక్ష
అక్టోబరు 14 - తొలేళ్ల ఉత్సవం
అక్టోబరు 15 - సిరిమానోత్సవం
అక్టోబరు 22 - తెప్పోత్సవం
అక్టోబరు 27 - కలశ జ్యోతి ఉత్సవం
అక్టోబరు 29 - ఉయ్యాలా కంబాల ఉత్సవం
అక్టోబరు 30 - దీక్ష విరమణ, చండి యాగం, పూర్ణాహుతి
Comments
Post a Comment