గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "జహ్ను మహామునీ! మాఘమాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసి, బంధు మిత్రులతో కలిసి భోజనం చేసిన వారికి గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుంది" అని చెప్పగా అది విన్న జహ్నువు "మునీశ్వరా! మాఘ మాసంలో ఎన్నో పుణ్య తిథులు ఉండగా ఏకాదశి మాత్రమే ఎందుకు గొప్పదయింది? పూర్వం ఎవరు ఈ ఏకాదశి వ్రతం చేసారు? మాఘ ఏకాదశి వ్రతఫలం ఎట్టిదని?" ప్రశ్నించగా గృత్స్నమదమహర్షి ఈ విధంగా చెప్పసాగెను.
మాఘ పురాణం ఇరవయ్యవ అధ్యాయం
గృత్స్నమదుడు జహ్నువుతో "జహ్నూ! వినుము పాపపరిహారం కలిగించి, పుత్ర పౌత్ర, సంపదలు కలిగించే కథను చెబుతాను వినుము" పూర్వం దేవదానవులు అమృతోత్పాదనం కోసం క్షీరసాగరాన్ని మధించాలని నిశ్చయించుకున్నారు. మేరు పర్వతాన్ని కవ్వముగా, వాసుకిని కవ్వానికి త్రాడుగా చేసి దేవతలు వాసుకి తోకవైపు, రాక్షసులు వాసుకి తలవైపు ఉండి క్షీరసాగరాన్ని మధించసాగారు. ఈ మహా మథనంలో అనేక గొప్ప వస్తువులు ఉద్భవించాయి. ముందుగా పాలసముద్రం నుంచి చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి పుట్టాయి. శ్రీమహాలక్ష్మిని శ్రీహరి పరిణయమాడి ఇల్లాలుగా స్వీకరించాడు. అటు తర్వాత ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, కామధేనువు వంటి అద్భుతాలు పుడతాయి. శ్రీహరి వీటిని స్వర్గాధిపతి ఇంద్రునికి ఇచ్చివేస్తాడు.
హాలాహలం ఉద్భవం
అమృతం కోసం దేవదానవులు మధిస్తున్న క్షీరసాగరం నుంచి అగ్నిహోత్రంతో సమానమైన తేజస్సుతో హాలాహలం పుట్టింది. ఆ విషజ్వాలలు భూలోకం నుంచి ఊర్ధ్వలోకం వరకు అన్ని లోకాలకు వ్యాపించి దహించసాగాయి. ఆ సమయంలో లోకరక్షకుడైన పరమశివుని దేవతలు ప్రార్ధించారు. అప్పుడు సర్వమంగళా దేవి అనుమతితో శివుడు హాలాహలాన్ని స్వీకరిస్తాడు. అయితే ఆ గరళం కడుపులోకి వెళ్తే కడుపులో ఉన్న 14 భువనాలు నాశనం అవుతాయని కరుణామయుడైన శివుడు ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలిపి గరళ కంఠుడయ్యాడు.
ఉదయించిన అమృత కలశం
దేవదానవులు తిరిగి క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెట్టగా చివరకు అమృతం ఉద్భవించింది. అమృత కలశాన్ని చూడగానే దేవదానవులు ఎవరికి వారే అమృతం తమకే దక్కాలన్న ఆశతో చూడసాగారు.
జగన్మోహిని అవతారంలో శ్రీహరి
జరుగుతున్న తంతు అంతా గమనించిన శ్రీహరి జగన్మోహిని రూపంలో అమృతకలశాన్ని చేతబట్టి దేవదానవులతో ఈ విధంగా అన్నాడు. "దేవదానవులారా! ఈ అమృతాన్ని మీకు సరిసమానంగా పంచుతాను. దేవతలంతా ఒక వరుసలో, రాక్షసులంతా ఒక వరుసలో గొడవల్లేకుండా బుద్ధిగా కూర్చుంటే ఎవరి వాటా వారికి దక్కుతుంది" అని అన్నాడు. చూడగానే పురుషులకు కూడా మొహం కలిగేంత సుందరంగా ఉన్న ఆ జగన్మోహిని మాటలకు అందరూ మైమరచిపోయారు. శ్రీహరి చెప్పినట్లుగానే దేవతలు ఒక వరుసలో రాక్షసులు ఒక వరుసలో కూర్చున్నారు.
శ్రీహరి మాయ
జగన్మోహిని తన మాయాజాలంతో ఆ అమృతాన్ని రెండు భాగాలుగా చేసి ఒక కలశంలో అమృతం, రెండో కలశంలో కల్లును ఉంచింది. తన అందంతో, మధురమైన మాటలతో మైమరిపిస్తూ మాయచేసి దేవతలకు అమృతాన్ని, రాక్షసులకు కల్లును పంచిపెట్టింది. రాక్షసులు కల్లునే అమృతంగా భావించి స్వీకరించారు.
మోసపోయిన రాక్షసులు
శ్రీహరి మాయను గ్రహించిన ఇద్దరు రాక్షసులు దేవతల రూపాన్ని ధరించి దేవతలా పంక్తిలో కూర్చుని అమృతాన్ని తాగాబోగా శ్రీహరి వారి కుయుక్తిని గ్రహించి వారు తగిన అమృతం గొంతులోకి వెళ్లే లోపులే వారి శిరసులను తన సుదర్శన చక్రంతో ఖండించాడు. ఇంద్రాది దేవతలు అమృతపానం చేయడం పూర్తయింది. రాక్షసులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి హాహాకారాలు చేసారు. శ్రీహరి జగన్మోహిని రూపాన్ని విడిచి విష్ణుమూర్తి స్వరూపాన్ని ధరించాడు. అప్పుడు శ్రీహరిచే శిరసు ఖండించబడిన రాక్షసులు "కేశవా! మాకు చావు బతుకు లేకుండా చేశావు మా గతి ఏంటి అని అడిగారు. అప్పుడు శ్రీహరి వారితో "మీరు వంతుల ప్రకారం మాయ కాలమందు సూర్యుని, చంద్రుని ఆహారంగా భక్షిస్తూ జీవింపగలరని చెప్పగా వారు ఆకాశమండలాన్ని చేరారు. వారు ఎవరో కారు గ్రహణ కాలంలో సూర్యచంద్రులను పట్టిపీడించే రాహుకేతువులు. అనంతరం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాదిదేవతలు అమృత కలశాన్ని పట్టుకొని తమ తమ నివాసాలకు చేరుకున్నారు.
భూమిపై పడిన అమృత బిందువులు
పాలసముద్రమందు అమృత కలశం ఉంచిన ప్రదేశంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయి. ఆ అమృత బిందువులు రెండు వృక్షాలుగా మొలకెత్తాయి. అవి ఒకటి పారిజాతం రెండవది తులసి.
సత్వజిత్తు కథ
భూమిపై పడిన అమృత బిందువుల నుంచి పెరిగిన పారిజాత తులసి వృక్షాలను సత్వజిత్తు అనే శూద్రుడు నీరు పోస్తూ, పెంచి సంరక్షించసాగాడు. ఆ స్థలంలో సత్వజిత్తు ఒక పూలతోటను వృద్ధి చేసాడు. ప్రతిదినం ఆ పూలను అమ్ముకుంటూ జీవనం సాగించసాగాడు.
పారిజాతపూలను దొంగిలించిన ఇంద్రుడు
ఇదిలా ఉండగా ఒకనాడు దేవేంద్రుడు రాక్షస సంహారం కోసం ఐరావతంపై వెళ్తూ మార్గమధ్యంలో పారిజాత వృక్షాన్ని చూసి ఆ పూల సుగంధానికి మైమరచి వాటిని కోసి స్వర్గంలోని తన భార్య శచీదేవికి, అప్సరసలు ఇచ్చాడు. ఆ పూల పరిమళానికి వారు ఎంతో సంతసించి ప్రతిరోజూ ఆ పూలు కావాలని కోరారు.
రహస్య దూతను నియమించిన ఇంద్రుడు
పారిజాత పూలను ఎవరికి తెలియకుండా కోసి స్వర్గానికి తీసుకురావడానికి ఇంద్రుడు ఒక రహస్య దూతను నియమించాడు. ఇంద్రుని ఆజ్ఞ మేరకు ఆ దూత ప్రతిరోజూ రాత్రివేళ రహస్యంగా పారిజాతాపులను కోసి ఇంద్రునికి ఇస్తూండేవాడు. ప్రతిరోజూ పారిజాత పూలు మాయం కావడం చూసి సత్వజిత్తుకు అనుమానం వచ్చింది. ఎలాగైనా పూల దొంగను పట్టుకోవాలని నిశ్చయించి ఒకరోజు రాత్రి కాపుకాసి ఉండగా యధావిధిగా దూత వచ్చి పూలను కోయడం చూసాడు. వెంటనే సత్వజిత్తు దూతను పట్టుకోడానికి ప్రయత్నించగా అతడు తప్పించుకొని ఆకాశమార్గంలో వెళ్లిపోయెను. స్వర్గానికి వెళ్లిన దూత ఇంద్రునితో జరిగింది చెప్పగా ఇంద్రుడు "నీవు ఆకాశంలో సంచరిస్తావు కాబట్టి నీకేమి భయం లేదు. యధావిధిగా నీవు పూలు కోసి తీసుకురా!" అని ఆజ్ఞాపిస్తాడు.
సత్వజిత్తు విచారం
జరిగిన ఘటనకు సత్వజిత్తు విచారిస్తూ ఏమి చేయాలా అని ఆలోచింది ఒక పన్నాగాన్ని పన్నుతాడు. ప్రతి రోజు తాను పూజ చేసే విష్ణువు నిర్మాల్యం తెచ్చి ఆ పూలతోటలో పారిజాత వృక్షం కింద చల్లుతాడు. యధావిధిగా ఇంద్రుని దూత ఆ రోజు కూడా వచ్చి పారిజాత పూలు కోస్తుండగా అతని కాళ్లకు శ్రీహరి నిర్మాల్యము తగులుతుంది. ఆ దోషం వల్ల అతనికి ఆకాశంలో సంచరించే శక్తి పోవడమే కాకుండా కుంటి వాడవుతాడు. అంతేకాకుండా శ్రీహరి నిర్మాల్యం తొక్కిన పాపానికి పిచ్చివాడు కూడా అవుతాడు.
ఇంద్రుని దూతను ప్రశ్నించిన సత్వజిత్తు
దోషంతో కుంటివాడయిన ఇంద్రుని దూతను పట్టుకొని సత్వజిత్తు ఈ విధంగా పారిజాతపూలను ఎందుకు అపహరిస్తున్నావు అని అడుగగా అప్పుడు ఆ దూత "స్వర్గాధిపతి ఇంద్రుని ఆజ్ఞ మేరకే తాను ఈ పని చేస్తున్నాని చెబుతాడు. పన్నాగంతో నన్ను కుంటి వాడిని చేసిన నీవు చాలా బుద్ధిమంతుడవని అంటాడు." అప్పుడు సత్వజిత్తు అతనిని అలాగే వదిలేసి తన ఇంటికి వెళ్లిపోతాడు. ఈ విధంగా మూడు రోజులపాటు కుంటివాడిలా ఇంద్రుని దూత పారిజాత వృక్షం కిందనే ఉండి పోతాడు. ఈ కథను ఇక్కడివరకు చెప్పి గృత్స్నమదమహర్షి ఇరవయ్యవ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ఏకోనవింశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment