Magha Puranam Telugu: మాఘ పురాణం 12వ అధ్యాయం - నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక- మాఘ స్నానంతో విముక్తి పొందిన ఇంద్రుని కథ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, February 10, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 12వ అధ్యాయం - నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక- మాఘ స్నానంతో విముక్తి పొందిన ఇంద్రుని కథ

 

మాఘ పురాణం పన్నెండో అధ్యాయం

పరమ శివుడు పార్వతికి గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదాన్ని తెలియజేస్తూ పన్నెండవ రోజు కథను చెప్పడం ప్రారంభించాడు.

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగెను. దేవతలు ఈ విధంగా తొండ రూపాన్ని విడిచిన సుందర వనితను ఆమె వృత్తాంతాన్ని వివరించమని కోరగా ఆమె ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టింది.

సుశీల పుత్రిక వృత్తాంతం

దేవతలతో సుందరమైన వనిత ఇలా చెప్పడం ప్రారంభించింది. "నేను కశ్మీర దేశంలో సుశీలుడను బ్రాహ్మణును పుత్రికను. నా తండ్రి యుక్తవయసులో నాకు వివాహం చేశాడు. కానీ వివాహం అయిన నాలుగు రోజులకే నా భర్త మరణించాడు. అతిచిన్న వయసులోనే నాకు ఈ గతి పట్టడం చూసి నా తండ్రి విచారంతో జీవితంపై వైరాగ్యంతో నన్ను బంధువుల ఇంట్లో విడిచి పెట్టి నా తల్లితో కలిసి అరణ్యాలకు వెళ్లాడు. కొంతకాలం తర్వాత తన యోగ విద్యతో శరీరం విడిచి పుణ్యలోకాలకు చేరాడు. నా తల్లి కూడా అతనిని అనుసరించింది.

బంధువుల ఇంట దీనావస్థలో సుశీల పుత్రిక

బంధువుల ఇంట్లో ఉన్న నేను కష్టజీవిగా బిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపసాగాను. నేను ఈ రోజు శుచియైన అన్నం తిని ఎరగను. ఎప్పుడు చద్ది అన్నం, ఇతరులు తిని వదిలేసిన అన్నాన్ని తింటూ ఉండేదాన్ని. వేళకు స్నానపానాదులు లేక శుచి శుభ్రం లేకుండా ఉండేదాన్ని. ఒక్కనాడు కూడా హరిని పూజించడం, దేవాలయానికి వెళ్లడం లాంటివి చేయలేదు. ఎవరైనా హరికథలు చెబుతున్నా వింటున్నా వారిని హేళన చేస్తుండేదాన్ని. చిల్లరగా కొన్ని వస్తువులు కొని తిరిగి అమ్ముతూ పుష్కలంగా ధనం సంపాదించాను. కానీ ఏనాడూ దైవకార్యం, దానధర్మాలు చేసి ఎరుగను.

ఎన్నో నీచ జన్మలు ఎత్తిన సుశీల పుత్రిక

ఇలా ఉండగా వయసులో ఉన్న నేను ఒక వైశ్య యువకునితో సంబంధం పెట్టుకొని అతని నుంచి ధనం తీసుకునేదాన్ని. ఇదే వృత్తిగా భావించి ఎంతోమందితో జారత్వానికి ఒడిగట్టి విపరీతంగా ధనం సంపాదించాను. కాలక్రమేణా మరణించాక నేను నరకంలో క్రూరమైన బాధలు అనుభవించాను. ఆ తరువాత అనేక జన్మల్లో భర్తలేని ఆడదానిగా, కోతిగా, కుక్కగా, పిశాచంగా, ఎద్దుగా, పశువులుగా, క్రిమికీటకాలుగా అనేక వందల జన్మలు ఎత్తాను. ఇప్పుడు మీరు నాకు మోక్షం ప్రసాదించిన తొండ జన్మను వెయ్యి సార్లు అనుభవించాను. ఒకానొక స్త్రీజన్మలో వైశాఖ మాసంలో నేను ఒక బ్రాహ్మణునికి మధ్యాహ్నం వేళ అన్నం పెట్టిన పుణ్యానికి ఇప్పుడు నా శాపవిమోచనం కలిగి ఇలా మారాను" అంటూ సుశీల పుత్రిక తన వృత్తాంతాన్ని దేవతలకు తెలియజేసింది.

సుశీల పుత్రిక వృత్తాంతాన్ని విన్న దేవతలు మాఘమాసంలో సూర్యోదయం సమయంలో కేవలం కొన్ని నీటి బిందువుల చేత తొండకు స్త్రీ రూపం రావడం చూసి ఆశ్చర్యపోయారు. చివరకు వారిలో ఒకరు ఆమెను వివాహమాడారు.

ఇంద్రుని వెతికి పట్టుకున్న దేవతలు

పద్మ పర్వతం మీద గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని దేవతలు వెతికి పట్టుకున్నారు. కానీ ఇంద్రుడు మాత్రం గాడిద రూపంలో దేవతల ముందుకు రావడానికి సిగ్గుపడి ఓ గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. అప్పుడు దేవతలంతా కలిసి గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని వద్దకు . వెళ్లి "ఇంద్రా! మేము దేవతలం. నీకు భయం లేదు. ఆ శ్రీహరి నీ శాపానికి కారణం చెప్పాడు. నీకు గాడిద రూపం పోయే మార్గాన్ని కూడా శ్రీహరి చెప్పాడు. నీకు శాపవిమోచనం కలిగించి స్వర్గానికి తీసుకెళ్లడానికి మేము వచ్చాం" అని చెబుతూ దేవతలందరు కలిసి ఆ గాడిదను తుంగభద్రా నదీతీరానికి తీసుకెళ్లారు. ఇంద్రుడు నడిచే శక్తిలేక అతి కష్టంగా సిగ్గుతో తలవంచుకొని వారితో కలిసి నడిచాడు.

ముప్పై రోజుల మాఘ స్నానంతో ఇంద్రునికి ముక్తి

దేవతలు మాఘమాస శుద్ధ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు 30 రోజులపాటు ఇంద్రుని తుంగభద్రా నది జలాలలో స్నాన చేయించారు. దేవతలు కూడా 30 రోజులు మాఘ స్నానం చేసి తరించారు. తత్పుణ్య ఫలితంగా దేవేంద్రుడు బ్రాహ్మణ శాపం నుంచి విముక్తుడై గాడిద ముఖం పోయి స్వర్గానికి పోయే శక్తిని పొందాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్లాడు.

ఇక్కడ వరకు చెప్పి గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "జహ్ను! చూసావుగా! మాఘస్నానం మహత్యం ఎంతటి గొప్పదో! ఈ కథ విన్నవారికి చదువు వారికి అమితమైన పుణ్యఫలం కలుగుతుంది. పూర్వం పంపా నదీతీరంలో ఒక భయంకరమైన పిశాచం మాఘ మాస మహిమ తెలియజేసే కథను విని పాప విముక్తుడయ్యెను" ఆ వృత్తాంతం వివరిస్తాను వినుము" అంటూ గృత్స్నమద మహర్షి పన్నెండో రోజు అధ్యాయాన్ని ముగించాడు.

ఇక్కడ వరకు జరిగిన గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదాన్ని శివుడు పార్వతికి తెలియజేస్తూ పదకొండవ అధ్యాయాన్ని ముగించాడు. 

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ద్వాదశ ధ్యాయ సమాప్తః 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages