Magha Puranam Telugu: మాఘ పురాణం 11వ అధ్యాయం - మాఘ స్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, February 10, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 11వ అధ్యాయం - మాఘ స్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ

 

దేవతలకు మాఘ మాస మహత్యాన్ని వివరించిన శ్రీహరి

ఇంద్రుని శాపవిమోచనం కోసం మాఘ స్నానం చేసి తనను యధావిధిగా పూజించిన దేవతలకు విశ్వామిత్రుడు వానర రూపం నుంచి ముక్తి పొందిన కథను తెలిపి ఆ శ్రీహరి మాఘ మాస వ్రత మహాత్యాన్ని ఈ విధంగా వివరించాడు.

శ్రీహరి ప్రవచనం

దేవతలు ఆచరించిన మాఘ వ్రతంతో ప్రీతి చెందిన శ్రీహరి వారితో "దేవతలారా! విశ్వామిత్రునికి శాపవిమోచనం కలిగించిన మాఘ స్నానం ఇంద్రుని కూడా తరింపజేస్తుంది. మీరు పద్మ పర్వతంపై ఉన్న ఇంద్రుని తీసుకెళ్లి తుంగభద్ర నదిలో మాఘ స్నానం చేయిస్తే అతనికి పూర్వ రూపం వస్తుంది. ఇంకా మాఘ మాస మహత్యాన్ని చెబుతాను శ్రద్ధ వినండి" అంటూ శ్రీహరి చెప్పసాగెను.

మాఘమాస వ్రత మాహత్యం

మాఘమాసంలో గోపాదం మునిగే అంత నీళ్లలో అయిన సరే స్నానం చేసి, మాఘ మాసాధిపతి అయిన నన్ను పూజించిన వారు వైకుంఠాన్ని చేరుతారు. గొప్పగా ప్రకాశించువానిలో సూర్యుడు, వృక్షములలో అశ్వత్థ వృక్షం, భోగాలను అనుభవించుటలో నారాయణుడు, శాస్త్రములలో వేదం, అన్ని జాతులలో బ్రాహ్మణుడు, ఋతువులలో వసంత ఋతువు, రాజులలో రాఘవరాముడు, అన్ని మంత్రములలో రామ తారక మంత్రం, స్త్రీలలో లక్ష్మీదేవి, సమస్త నదులలో గంగానది, పర్వతములలో మేరు పర్వతం ఎలాగైతే గొప్పవో అలాగే అన్ని వ్రతములలో మాఘ వ్రతం అతి శ్రేష్టమైనది. మాఘ మాసంలో కనీసం మూడు రోజులైనా నది స్నానం చేసి రంగుటగుల పుష్పాలతో శ్రీహరిని పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. శాశ్వత కైవల్యాన్ని పొందుతారు." కాబట్టి మీరు వెంటనే పద్మావతి పర్వతం వద్దకు వెళ్లి ఇంద్రునికి శాపవిమోచనం కలిగించండి" అని దేవతలకు మాఘమాస వ్రత మహాత్యాన్ని చెప్పి శ్రీహరి అంతర్ధానమయ్యాడు.

పద్మావతి పర్వతంపై మహా తొండను చూసిన దేవతలు

శ్రీహరి ఆజ్ఞ మేరకు పద్మావతి పర్వతం చేరుకున్న దేవతలు అక్కడ ఇంద్రుని వెతుకుచుండగా అక్కడ పెద్ద శరీరం, చిన్న తోక, చిన్న పాదాలు, చిన్న కళ్ళు ఉన్న తొండను చూసారు. ఆ తొండ కదలకుండా పాషాణం వలే పడి ఉంది. దేవతలు ఆ తొండ సమీపానికి వెళ్లగా ఆ తొండ ఒక గంభీరమైన ధ్వని చేసింది. దేవతలు ఆ శబ్దానికి భయపడి తొండను రాక్షసునిగా భావించారు. ఆ తొండ పుణ్యకాలం సమీపించినందున దేవతలంతా కలిసి తీగెలతో ఆ తొండను కట్టసాగారు. అయినప్పటికీ వారు తొండను కొంచెం కూడా కదల్చలేకపోయారు. అప్పుడు దేవతలు శ్రీహరి చెప్పిన విషయం గుర్తు చేసుకొని తుంగభద్రా నదీ జలాలతో ఆ తొండకు అభిషేకం చేసారు.

మాఘ స్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ

మాఘ మాసంలో తుంగభద్రా నది జలాలతో జరిగిన మాఘ స్నానంతో ఆ తొండకు శాపవిమోచనం కలిగి తొండ రూపం పోయి సకలాభరణ భూషితమైన స్త్రీ రూపాన్ని ధరించింది. ఆ సౌందర్యవతి దేవతల సమీపానికి వచ్చి వారికి నమస్కరించి నిలబడింది. అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయి ఆమెతో "నీవు ఎవరు? నీకు ఈ తొండ రూపం ఎలా వచ్చింది?" అని అడిగారు.

ఇక్కడ వరకు జరిగిన గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదాన్ని శివుడు పార్వతికి తెలియజేస్తూ పదకొండవ అధ్యాయాన్ని ముగించాడు. 

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ఏకాదశాధ్యాయ సమాప్తః 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages