మాఘ పురాణం పదమూడవ అధ్యాయం
పిశాచుని పూర్వజన్మ వృత్తాంతం
పూర్వం పంపా నది తీరంలో సమస్తమైన రాజులకు ఆశ్రయమైన పంపా నగరంలో మిక్కిలి ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. అతడు మహా పిసినారి. తాను సంపాదించిన ధనాన్ని తాను తినక ఇతరులకు పెట్టక ఎంతో ధనాన్ని కూడబెట్టాడు. వార్ధక్యం సమీపించి వాడు మరణించాడు. బతికి ఉన్న రోజుల్లో ఒక్క పుణ్య కార్యం కూడా చేయనందున వాడు నరకంలో అనేక బాధలు అనుభవించి కొన్ని వేల సంవత్సరాల తర్వాత తిరిగి భూలోకంలో ఆగర్భ దరిద్రుడిగా పుట్టాడు. గత జన్మ పాపఫలంగా వాడు కటిక దారిద్య్రాన్ని అనుభవించాల్సి వచ్చింది. దరిద్రం కారణంగా ధనం కోసం ఈ జన్మలో కూడా అనేక పాపకార్యాలు చేసాడు.
వైశ్యునికి పిశాచ జన్మ
అనేక పాపాలు చేసిన దోషంతో వాడు ఒకనాడు పిడుగు పడి చచ్చాడు. మరణించిన తరువాత వాడు పంపానది తీరంలోని ఒక మర్రిచెట్టుపై పిశాచమై ప్రజలను భయపెడుతూ ఉండేవాడు. భూమిపై తిరిగే, ఆకాశంలో సంచరించే అనేక ప్రాణులను పట్టి చంపి తింటూ పిశాచమై తిరుగుతూ ఉండేవాడు.
పంపా నది తీరానికి విచ్చేసిన వశిష్ట మహర్షి
ఒకనాడు బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ట మహర్షి తన శిష్యులతో కలిసి మాఘ స్నానం చేయడానికి పంపా నదీతీరానికి వచ్చాడు. మాఘ మాసంలో సూర్యోదయ సమయంలో వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి శాస్త్రోక్తంగా పంపానది తీరంలో మాఘ స్నానం చేసి నదీతీరంలో మాఘ మాసాధిపతి అయిన శ్రీహరిని పూజించి తన శిష్యులకు ఈ విధంగా మాఘ పురాణాన్ని చెప్పసాగాడు.
వశిష్టుని పురాణ ప్రవచనం
వశిష్ఠుడు తన శిష్యులతో "కుమారులారా! మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండగా ఏ నరుడు నదీస్నానం చేసి శ్రీహరిని పూజించి, మాఘ పురాణాన్ని చదవడం కానీ, వినడం కానీ, బోధించడం కానీ చేస్తాడో ఆ నరుని ప్రస్తుత జన్మతో పాటు గత జన్మల పాపాలు కూడా పోతాయి. ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి అంత్యమున వైకుంఠాన్ని చేరుతారు. ఎవరు మాఘమాసంలో ఒక్కరోజయినా నదీస్నానం చేయరో వారు నరకంలో పడి కొట్టుకుంటారు" అని వశిష్ఠుడు చెబుతున్న పురాణాన్ని మర్రిచెట్టుపై ఉన్న పిశాచుడు కూడా విన్నాడు.
నిజ రూపాన్ని పొందిన పిశాచుడు
పరమ పవిత్రమైన మాఘ పురాణ శ్రవణంతో వాడికి పిశాచ రూపం పోయింది. వాడు త్వరత్వరగా మర్రి చెట్టు దిగి కిందకు వచ్చి వశిష్టునికి నమస్కరించి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించాడు. అప్పుడు వశిష్ట మహర్షి ఆ వైశ్యుని రెండు ఘడియల పాటు సంకల్ప సహితంగా దర్భలతో పంపానది జలాలతో స్నానం చేయించాడు.
వైకుంఠాన్ని చేరిన వైశ్యుడు
మాఘస్నానం ఫలితం వలన మాఘ పురాణ శ్రవణ ఫలంచేత ఆ వైశ్యుడు శ్రీహరి అనుగ్రహంతో దివ్య శరీరం ధరించి వైకుంఠాన్ని చేరాడు.
గృత్స్నమదమహర్షి ప్రవచనం
గృత్స్నమదమహర్షి జహ్నువుతో ఈ కథను చెప్పి "జహ్నువూ! చూసావుగా! మాఘ మాస స్నానానికి, పురాణ శ్రవణానికి ఎంతటి మహత్యం కలదో! మాఘ మాసంలో మాఘ స్నానం చేసిన వారిని, మాఘ పురాణాన్ని రాసిన వారి, చదివిన వారి, బోధించిన వారి, వినిన వారి ముఖం చూడడం వలన సకల పాపాలు పోతాయి. ఎవరైతే మాఘ మాసంలో ఒక్క రోజు కూడా నది స్నానం చేయకుండా, మాఘ పురాణాన్ని వినకుండా శ్రీహరి కథలను వినకుండా తిరుగుతారో వారి ముఖాలను చుస్తే పాపం వస్తుంది. అలాంటి పాపం పోవాలంటే వెంటనే సూర్యుని చూసి నమస్కరించుకోవాలి. ఇదే మాఘ రహస్యం అని చెబుతూ గృత్స్నమదమహర్షి పదమూడవరోజు కథను ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! త్రయోదశాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment