కార్తిక మాసంలో సోమవారం అని వారంపేరు తలుచుకున్నా వెయ్యిసార్లు శివుణ్ణి తలచినట్లేనని అంటారు. దీన్నిబట్టి కార్తిక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజనీ అర్ధమవుతుంది. ఆ రోజు చేసిన పూజలకు, అభిషేకాలకు, దానాలకు ఈశ్వరుడు అధికంగా సంతుష్ఠుడవుతాడు. భక్తుల సర్వ అభీష్టాలను తీరుస్తాడు. కార్తిక సోమవారం నాడు చేసే శివనామస్మరణ సద్యోముక్తిని కలిగిస్తుంది.
కార్తిక సోమవారంనాడు నదీస్నానం ఉత్తమం. ఆరోజు తెల్లవారుజామునే నదిలో మూడు మునకలేయాలి. సంకల్పంతో, అఘమర్షణ మంత్రయుక్తంగా స్నానం పూర్తిచేయాలి. సూర్యునికి, పితృదేవతలకు తర్పణలు చేయాలి శక్తిమేరకు శివాభిషేకం చేయాలి. పగలంతా ఉపవాసం చేయాలి, ప్రదోషకాలంలో అంటే సాయంత్రవేళలో నక్షత్ర దర్శనం అయ్యేంతవరకు శివారాధన కొనసాగించాలి. కార్తికమాసంలో సోమవారంనాడు నక్తవ్రతం అంటే, ఒంటిపొద్దు భోజనం చేయడం ఆచారం. పగలంతా ఉపవాసం చేసి, నక్షత్ర దర్శనం అయ్యాక విరమిస్తారు. కార్తిక సోమవారం ఏకాదశి వచ్చినట్లైతే ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగారణ చేయాలి, ఉదయమే ద్వాదశి ఘడియల్లో పూజ చేయాలి. శక్తి కొద్దీ అన్న సమారాధన చేయాలి. కార్తికం చలికాలం కావడం చేత మానవులకు ఆహారం అరుగుదల మందంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఆహారం తినకుండా ఉపవాసం ఉండి రాత్రి భుజించాలంటారు. ఈ నియమాలన్నీ పాటిస్తూ శివునికి బిల్వపత్రాలతో పూజచేస్తే భక్తుల కోరికలు నెరవేరతాయి. ఈ మాసంలో ప్రతి సంధ్యాకాలంలో ఆవునేతితో దీపం వెలిగిస్తే మరింత పుణ్యప్రదాయకం.
సోమవార వ్రతకథ
సోమవారంనాడు శివుడికి శక్తికొద్దీ పూజ చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని స్వయంగా శివుడే పార్వతికి చెప్పాడు. ఒకసారి ఆకాశ మార్గాన పార్వతీపరమేశ్వరులు విహరిస్తుండగా పార్వతీదేవికి పరమేశ్వరుణ్ణి ఈ వ్రతాన్ని గురించి అడిగింది. "నాథా! వరబేధాలు సకల మానవకోటి లేకుండా ఆచరించగలిగే వ్రతం ఏదైనా ఉందా? అది శాస్త్ర సమ్మతమైనది, ఆచంద్రతారార్కం మానవులకు శుభఫలాలను అందించే వ్రతం అయినట్లయితే అలాంటి వ్రతాన్ని చెప్పమని పార్వతి కోరింది. దానికి ఈశ్వరుడు సమాధానమే సోమవార వ్రతం. ప్రదోషకాలం వరకూ ఉపవాసం చేసి అభిషేక అర్చనలతో సోమవారం నన్ను పూజించినవారికి సమస్త శుభఫలాలు సమకూరుతాయని శివుడు బోధించాడు.
ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి వశిష్ఠ మహర్షి జనకమహారాజుకు చెప్పాడు. కార్తికపురాణంలోని సోమవార వ్రత కథ ప్రముఖమైనది. మిత్రశర్మ, స్వాతంత్య్ర నిష్ఠురి అనే దంపతుల కథ ఇది. నిష్టురి తన భర్త మిత్రశర్మను నిద్రలో ఉండగా చంపుతుంది. ఆ పాపానికి గాను నరకంలో శిక్ష అనుభవిస్తుంది. తరువాత కుక్కగా పుడుతుంది. ఒకరోజు తినడానికి ఏమీ దొరక్క ఆ కుక్క ఆకలితో అలమటిస్తూ తిరగసాగింది. ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతాన్ని ఆచరించి బలి అన్నాన్ని బయటపెట్టగా దాన్ని ఆకుక్క తినేసింది. ఆత్మజ్ఞాన సంపన్నుడైన బ్రాహ్మణుడు సోమవార వ్రత ఫలాన్ని కుక్కకు ధారబోయగా దానికి ముక్తి లభించింది. శివసాన్నిధ్యానికి వెళ్లింది. జన్మజన్మల పాపాలన్నింటినీ తొలగించగలిగే శక్తి కార్తిక సోమవారం వ్రతానికి ఉందని ఈ కథ తెలియచేస్తుంది.
కార్తిక సోమవారం పగలంతా భోజనం చేయకుండా. సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం. అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసం. అలా చేయడం సాధ్యం కాని వారు ఉదయం పూట యథా ప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి తీర్థాన్ని మాత్రం స్వీకరించడం ఏకభుక్తం అవుతుంది. పగలంతా ఉపవాసంతో గడిపి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు... దీన్నే అయాచితం అంటారు.. ఇవేవీ చేయలేని వారు కార్తీక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది.. దీన్నే తిలాదానం అంటారు.. ఈ ఆరు విధానాల్లో కనీసం ఒకటైనా ఆచరించడం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది.
Comments
Post a Comment