కార్తిక శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా వ్యవహరిస్తారు. దీనికి దామోదర ఏకాదశి, మోక్షప్రద ఏకాదశి అని కూడా పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైతే కార్తిక శుద్ధ ఏకాదశికి ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో శయనిస్తాడు. కార్తిక శుద్ధ ఏకాదశినాడు మరోపక్కకు తిరుగుతాడు. అందువల్లనే దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు. శ్రీరంగాది క్షేత్రాలు, కావేరాది నదులు స్వామికి అభిముఖంగా ఉంటాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కృతమాల, పయోద అనే నదులు స్వామికి పృష్టభాగంలో ఉంటాయి.
అధర్మం నశించాలనుకునేవారు కార్తిక శుద్ధ ఏకాదశి అనంతరం కృష్ణ గోదావరి నదులలో స్నానం ఆచరించాలి. స్వామికటాక్షం, మోక్షం కావాలనుకునే వారు గంగా, కావేరాది నదులలో స్నానమాచరించాలని విష్ణుధర్మం ద్వారా తెలుస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశినాడు నదీ స్నానం చేసి ఉపవసించి తులసీ, ధాత్రీలను యధాశక్తి ఆరాధించి అభీష్టసిద్ధిని పొందవచ్చును.
కార్తిక శుద్ధ ఏకాదశినాడు కేశవునికి లక్ష తులసీ పూజార్చన చేస్తే ప్రతి తులసీదళంతో ముక్తి లభిస్తుంది. ఎన్ని తులసి దళాలతో అర్చన చేస్తే అన్ని కోట్ల ముత్యాలు లభిస్తాయి. ముత్యాలు అనగా మోక్షలక్షణాలు అని అర్ధం. కార్తికమాసంలో ప్రత్యేకించి ఈ ఏకాదశి నాడు ధాత్రీ (ఉసిరి) వృక్షాన్ని పూజించాలి. ఈనాడు ఉసిరి చెట్టు కింద కూర్చుని నారాయణ నామాన్ని జపిస్తే ఒక నామం కోటి నామాలతో సమానం.
ఈ ఏకాదశినాడు సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించి అర్ఘ్యప్రదానం చేసి శ్రీహరి నామం జపించి భక్త జనులతో కలసి ధాత్రీ తులసీ వృక్షములను పూజించి వాటి సమీపాన పగలు, రాత్రి హరి నామ సంకీర్తన చేసినవారికి పునర్జన్మ ఉండదు.
కార్తికమాసంలో ప్రత్యేకించి శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ నాడు ఉసిరి రసాన్ని ఒంటికి రాసుకుని స్నానమాచరించే వారి పితృదేవతలందరికీ శ్రీమన్నారాయణుడు వెంటనే మోక్షం ప్రసాదిస్తాడు.
Comments
Post a Comment