- కార్తీక మాసంలో పౌర్ణమి కన్న ముందు శ్రావణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారంగా పిలుస్తారు.
- కోటి సోమవారం అంటే ఒక కోటి సోమవారాలతో సమానం.
- ఈ రోజు శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగిస్తే మంచిది అని నమ్ముతారు.
- కార్తీక మాసంలో అన్ని సోమవారాలు వ్రతం చేయలేని వారు ఈ ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది.
- ఈ రోజు విధివిధానంగా శివుడిని పూజించడం వల్ల మోక్షం లాభిస్తుంది అన్ని నమ్ముతారు.
కార్తిక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు చేసే స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.
ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచియై నదీస్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ మాసంలో నది స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది.
ఉపవాసం
సాధారణంగా కార్తిక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తిక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తిక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహరం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.
శివకేశవుల పూజ
ఈ రోజు శివాలయంకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుని అభిషేకించాలి. నువ్వులనూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. అనంతరం బిల్వ దళాలతో, తుమ్మి పూలతో శివుని అర్చించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించాలి. సాయంకాలం యధావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని విష్ణువు ఆలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేసి, తులసీమాలను నారాయణునికి సమర్పించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
వనభోజనం
సాధారణంగా కార్తిక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వనభోజనానికి మాములు కన్నా కోటి రెట్లు అధిక ఫలం ఉంటుంది. ఈ రోజు ఉసిరిక చెట్లు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధు మిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయాలి.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
కార్తిక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
2024 తేదీ: నవంబర్ 09.
Comments
Post a Comment