Karthika Puranam: కార్తీక పురాణం 21వ అధ్యాయము - పురంజయాపజయము

 

ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీకఱ్ఱలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరముల తోను, కుంభాయుధ ములతోను, గొడ్డళ్లతోను, కఱ్ఱలతోను, ఆయుధముల విక్షేపముల తోను యుద్ధము చేసిరి.

గుఱ్ఱపు రౌతులతో గుఱ్ఱపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్ధమును భటులన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి.

ఓ అగస్త్యమునీంద్రా ! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహలధ్వనిజేయుచు వడిగా పురంజయుని వద్దకువచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములుపోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికి నవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణము లతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను.

తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారిబిగించి బ్రహ్మమంత్రములతో పదిబాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలముచేత వేయబడిన ఆ బాణములు సర్పములవలె పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటులవద్దకు పోవుటకు ఇష్టపడలేదు.

సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సు నందు గూర్చి పురంజయునితో ఇట్లనియె. క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడనుకాను.

ఇట్లుపలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధని, ఛత్రమును, వాని ధనుస్సును త్రుంచినవి.

పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకునుని ధనుస్సుకుచేర్చి నారిని చెవివరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. రాజా! శూరుడు వౌదువుగాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరుబాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను.

ఇట్లుపలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్యశరాఘాతములచేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమియందుపడిరి.

అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుఱ్ఱముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి, రథములు చక్రము లతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలపడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణములచేత శరీరమంతయు గాయములు పడినయొకభటుడు ధనుస్సును ధరించి నారిబిగించి అన్య భటునితో యిట్లనియె. తిరుగు వెనుకకు తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవుగదా, ఇట్లు చేయవచ్చునా ?

ఓ మునీ ఇట్టి నిష్టురములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని జేయుచు సింహగర్జనము లను జేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటునిమీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరముల నుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి.

ఆ యుద్ధమందుసూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యో న్యము శూరులను, భటులను బంగారపుకట్లతో గూడినవియు, స్వయముగా వాడియైన వియు, సానపెట్టబడినవియు, స్వనామచిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోను, ఇనుపనారాచములతోను, ఇనుప అలుగులుగల బాణములతోను, ఖడ్గములతోను, పట్టస ములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి.

గుఱ్ఱపురౌతులు కొందరినిచంపిరి. గుఱ్ఱపు రౌతులను యేనుగుబంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనగి ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్ఛాదిత లైన అపస్సర స్త్రీలు లావైనకుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకుబోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి.

యుద్ధమందు హతులైనవారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసలచేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు.

కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజులచేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగొర్పొడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములోడేరాలు వేయించి వాటియందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతో బ్రకాశించు చుండెను.

కాంభోజరాజునకు పదమూడు ఆక్షౌహిణీలసేనయున్నది. మూడు ఆక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమంతోడుటకును, తన రాజ్యము శత్రురాజులచేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచేఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓరాజా ! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితివేని విష్ణుమూర్తి సేవజేయుము.

ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండుపూర్ణిమ, కృత్తికానక్షత్రముతో కూడినది. కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పములచేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము.

సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తు లను అపత్తులు లేక రక్షించుట కొరకు తనవేయి అరలుగలవిష్ణుచక్రము పంపును. కార్తికమాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను. నీ అధర్మవర్తనము వలన అపజయము గలిగినది. ఇక ముందు సద్ధర్మ పరుడవుగమ్ము. అట్లయిన కొనియాడదగినవాడవగుదువు. ఓ రాజా! కార్తీకవ్రతమాచరింపుము. హరిభక్తుడవు కమ్ము. కార్తికవ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము గలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి