Karthika Puranam: కార్తీక పురాణం16వ అధ్యాయము - స్తంభదీపదానమహిమా, ఉద్భూతపురుష వృత్తాంతము

 

వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తిక వ్రత మును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతర మందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తికమాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈపమును హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును.

కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దే శించి స్నానముదానము చేయవలెను. అనగా అట్లు చేసిన యెడల సంతా నము గలుగునని భావము. కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమను దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతానవిచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు.

కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టు వాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తిక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచువారిపాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును.

కార్తికమందు స్తంభమును సమర్పించనివాడు నరకమునుండి విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను.

శిలతోగాని, కర్రతోగాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.

మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆ ఆలయముచుట్టును వనముండెను. కార్తిక వ్రతపరాయణులై మునీశ్వరులచ్చటికివచ్చి విష్ణువును షోడశోప చారములతోను మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒకముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠ లోకనివాసియగును.

కాబట్టి మనము ఆలయమునస్తంభదీపమును బెట్టుదము. ఈ దినము కార్తికపూర్ణిమ అయివున్నది. ఈ దినము సాయంకాలము స్తంభ దీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమనాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పావములు నశించి వైకుంఠలోకమును పొందెదదరు. వారందరు ఆ మాట విని సందీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి.

ఓ రాజా ! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు, ఆకులులేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తీకవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు శాలివ్రీహితిలసమేతముగా దీప మును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరి కథను చెప్పికొనుచుండిరి.

కథచెప్పికొనుచుండగా దేవాలయము ఎదుటచటచట అనే శబ్దములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంతమునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచు యొక పురుషునిజూసి ఇట్లనిరి.

ఓయీ ! నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగానున్నావు? ఆ విషయము నంతయు త్వరగా చెప్పుము.

రాజా! వారిట్లు అడుగగా వాడు వారికి దండప్రణామము ఆచరించి సంతోషముతో అంజలిపట్టి ఇట్లని చెప్పదొడగెను. ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుఱ్ఱములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్టవర్తనగలవాడనైతిని.

నేను వేదశాస్త్రములను జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్ధ యాత్రకు పోలేదు. స్వల్పమైనను దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్య కర్మచేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును. వారికెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను యివ్వనూ లేదు.

సర్వకాలమందును వారికెన్నడును ఏ దానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ ధారాదత్తముచేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను జేసికొనువాడను, మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్భుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించి తరువాత భూమికివచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆ తరువాత కోటిమారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటిమారులు స్థాణువు (మొద్దు)గా కాలము గడుపు చుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయా వంతులగు మీరు చెప్పుదురు గాక. మీ దర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరు లారా నా పూర్వపాపమిట్టిదని పలికివాడూర కుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తిక మాసఫలము యథార్ధమయినది. ప్రత్యక్షమోక్ష మిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.

ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దుముక్తి నొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన యెడల పాపమునశించి దయాకు వయిన దామోదరునిచేత మోక్ష మొందించబడినది. ఇట్లు వాదమునుజేయు వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె.

జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్దుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రి యములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వ మును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమువిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి