రాజోత్తమా !తిరిగి చెప్పెదను వినుము. కార్తికమాసమందు అవిసె పువ్వులతో హరినిపూజించినవాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రతఫలము పొందును. కార్తికమాసమందు గరికతోను, కుశలతోను హరిని పూజించువాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తికమాసమందు చిత్రరంగులతో గూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్ష మొందును.
కార్తికమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలల నుంచువాడును, పురాణమును జెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నియును నశింపజేసి కొని పరమపదమును బొందుదురు. ఈ విషయమై యొక పూర్వకథగలదు. అది విన్నమాత్రముననే పాపములు పోవును. ఆయురారోగ్యములనిచ్చును. బహు ఆశ్చర్యకర ముగా నుందును. దానిని చెప్పెద వినుము. కళింగదేశమందు మందరుడను నొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నానసంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలిచేయుచుండెడివాడు.
అతనికి మంచిగుణములు గలిగి సుశీలయను పేరు గల ఒక భార్య యుండెను. ఆమెపతివ్రతయు, సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై యుండెను. ఓ రాజా! ఆ సుశీల భర్తదుర్గుణపూర్ణుడై నను అతనియందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలిజీవనము కష్టమనితలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని యుండి దానిడుచువారిని కొట్టి వారి ధనములనపహరించుచు కొంతకాలమును గడిపెను.
అట్లు చౌర్యమువలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రామ్మణుడు చౌర్యముకొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గానవచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మఱిచెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి అయిద్దురు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్దపులి కిరాత మనుష్యగ్రంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారములచేత ఒక్కమారే చనిపోయిరి.
ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతినొంది యమలోకమునకు బోయి కాలసూత్రనరకమందు యాతన బడిరి. యమభటులు వారినందరిని పురుగులతోను, అమేధ్యముతోను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలకాగుచున్నారక్తమందు బడవైచిరి.
జనకమహారాజా ! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను జేయుచు ఆచార వంతురాలై హరిభక్తియుతయై సజ్జనసహవాసమును జేయుచునిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓరాజా! ఇట్లుండగా దైవవశముచేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణచేయుచు నాట్యము చేయుచు పులకాంకితశరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనందబాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను.
అమెయు అయతినిజూచి భిక్షమిడి అయ్యా, యతిపుంగవా! మీరు మా యింటికి వచ్చుటచేత నేను తరించితిని, మీవంటి వారి దర్శనము దుర్లభము. మాయింటివద్ద నా భర్తలేదు. నేనొక్కదాననే పతిధ్యానమును జేయుచున్నదానను. ఆమె యిట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియ భాషిణీయు శ్యామయునయిన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయీ! ఈ రోజు కార్తికపూర్ణిను మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ యింటిలో పురాణపఠనము జరుపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను. గనుక నీవు పత్తినిచేసి ఇమ్ము. శ్యామయనగా యౌవనవతియని అర్ధము.
యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ యిల్లు చక్కగా అలికినదై అందు ఐదురంగులతో ముగ్గులను బెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే రెండు వత్తులనుజేసి నూనెతో యతీశ్వరునివద్ద వెలిగించి స్వామికి సమర్పించెను.
ఆ చిన్నది దీపపాత్రను, వత్తిని తాను యిచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపము ముందు హరిని బూజించి మనశుద్ధి కొరకై పురాణపఠనమారంభించెను.
ఆమెయు ప్రతియింటికిబోయి పురాణశ్రవణమునకు రండని చాలా మందిని పిలుచుకుని వచ్చి వారితోఎ సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యధేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను.
అంతలో శంఖచక్రాంకితులును, చతుర్భాహులును, పద్మాక్షులును, పీతాంబర ధారులనునైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోను, ముత్యాలతోను, పగడములతోను రచించినమాలికలతోను, వస్త్రములతోను, ఆభరణములతోను అలంక రించబడిన విమానమును దీసికొని వచ్చి సూర్యుడువలె ప్రకాశించెడి ఆ విమాన మందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను.
ఆమె వైకుంఠమునకు బోవుచు మధ్యమార్గమందు నరకమును జూచి అచ్చట తనపతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతో నిట్లుపలికెను. ఓ విష్ణుదూతలారా! నిమిషమాత్రము ఉండండి. ఈ నరక కూపమందు నా భర్తముగ్గురితో పడియుందుటకు కారణమేమి? ఈ విషయ మును నాకు జెప్పుడు.వీడు నీ భర్త, వీడు కూలిచేసియు, దొంగతనమును జేసియు, పరధనా పహరణము జేసినాడు, వేదొక్తమయిన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు.
ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్నవాని నొకనిని చంపి వానిధనము అపహరించి ఇతరదేశమునకు బోవుచున్నంతలో నీభర్తచేత హతుడాయెను. అట్టి పాపాత్మడు గనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈ మూడవవాడు కిరాతుడు. వీడు నీ భర్తను యీ బ్రాహ్మణుని యిద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాల్గవవాడు, పులి, కిరాతులు పరస్పర ఘాతములచే మృతినొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశినాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలనొందుచున్నారు. ద్వాదశినాడు నేయి వాడవలెను. నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏ పుణ్యముచేత వీరు నరకమునుండి ముక్తులగుదురని యడిగెను.
ఆ మాట విని దూతలిట్లనిరి. అమ్మా! కార్తికమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు ముక్తుడగును. ఆ పురాణశ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తిపుణ్యమును యీ కిరాతవ్యాఘ్రము లకు సమానముగానిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణశ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు బోయి ప్రజలను బిలిచిన పుణ్యమును యీకృతఘ్నునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానములచేత వారు వారు ముక్తులగుదురు.
విష్ణుదూతలమాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణస్త్రీ ఆయా పుణ్యములను వారివారికిచ్చెను. దానిచేత వారు నరకమునుండి విడుద లయై దివ్యమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెది ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తికమాసమందు పురాణ శ్రవణ మును జేయువాడు హరిలోకమందుండును.
ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేసికొని మోక్షమును బొందుదురు.
Comments
Post a Comment