ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైందే. అందులో ఈ వైకుంఠ ఏకాదశి లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు.
- సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ద ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
- ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.
- మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు.
- ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.
- ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి.
- ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.
- ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం అటు తర్వాత జపం, ధ్యానం.
- ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు.
ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఆ నారాయణుడు మురాసురుడి వధించడానికి బయల్దేరతాడు. ఈ విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి వచ్చి, మహా విష్ణువును వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు.
శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.
2025 : జనవరి 10
Comments
Post a Comment