చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం. ''మఘం' అంటే యజ్ఞం యజ్ఞయాగాలు చేయడానికి ఈ మాసం శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతారు. ఈ మఘాధిపత్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే మాసం గనుక దీనిని మాఘమాసం అంటారు. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను' నశింప చేసేది అనే అర్థం ఉంది. ఈ మాసం మాధవ ప్రీతికరమని శాస్త్ర వచనం.
ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో వీలునుబట్టి నది, చెరువు, మడుగు, కొలను. బావుల వద్ద స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం. నువ్వుల భక్షణంలాంటివి చేయదగినవిగా పలు గ్రంథాలు చెబుతున్నాయి.
మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ద చవితి రోజున ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం, మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం మంచిది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేషంగా చెబుతారు. దీనినే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరుతో జరుపుకుంటారు.
శుద్ధ షష్టిని విశోక షష్టి, మందార షష్టి, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జన్మోత్సవం జరుపుకుంటారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశిష్టమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని జరుపుకుంటారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈరోజు చేయవలసిన కార్యం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీనినే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. దీనినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున భీష్మ ఏకాదశి వ్రతం కూడా చేసుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహిస్తుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేషంగా చెబుతారు. మాఘపూర్ణిమను సతీదేవి జన్మించిన తిథిగా కూడా చెబుతారు.
మాఘమాసంలో కృష్ణపాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను పూజించుకోవడం కనిపిస్తుంది. అందుకే ఈ మాసానికి పూర్వకాలం నుండి కూడా ఎంతో విశిష్టత ఉంది.
Comments
Post a Comment