కావేరీ విరజానదిగాగ, వైకుంఠం రంగమందిరంకాగా, ఆ వాసుదేవుడు స్వయంగా రంగేశుడు కాగా సాక్షత్తు పరమపదమై అలరారుతున్న దివ్యదేశం శ్రీరంగం. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ తెంగలైసంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి. మనదేశంలోని అతి పెద్ద, అతిముఖ్య, అతిపురాతన ఆలయాలలో ఒకటి శ్రీరంగం. ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ఈ ఆలయానికి ప్రసిద్ది ఉంది.
ఈ ఆలయం అద్భుత కళాఖండంగా ఈ ఆలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు) స్థలంలో నిర్మితమైంది. దీని ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు (10,710 అడుగులు). ఆసియాలోనే అతిపెద్ద రాజగోపురం ఈ ఆలయానికి ఉంది. దీన్ని13 సెంట్ల భూమిలో 236 అడుగుల (72 మీటర్లు) ఎత్తుతో, 11 అంతస్తులతో నిర్మించారు. ఈ ఆలయంలోరంగనాథ స్వామి సన్నిధితో పాటు, 53 ఉప-సన్నిధులూ ఉన్నాయి. ధన్వంతరి సన్నిధి, గరుడాళ్వార్ సన్నిధి, ఉడయవర్ సన్నిధి, తాయారు సన్నిధి, హయగ్రీవార్ సన్నిధి, చక్రధ్వజ్వర్ సన్నిధి, వేయి స్తంభాల మండపం, చిన్న నీటి కొలనులు ప్రధానమైనవి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. హిందుయేతరులను రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడిగోపురం విమానం ఆకృతిలో ఉంటుంది. దీనికి పూర్తిగా బంగారు తాపడం చేశారు.
వైష్ణవానికి ధ్వజస్తంభాలుగా నిలిచిన 12 మంది ఆళ్వార్లూ ఈ దేవుని కొలిచినవారే...మనసా ఆరాధించినవారే! ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని ని శ్రీవైష్ణవ సిద్ధాంతానికి పట్టుగొమ్మ శ్రీరంగం. నాలాయిర దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలలో 247 పాశురాలు ఈ “తిరువారంగన్”నే కీర్తిస్తున్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్) “శ్రీశైలేశ దయాపాత్రం..” శ్లోకాన్ని రంగనాధస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు.
ఆలయవిశేషాలు
ఇచ్చట గర్భాలయంలో రంగనాథుడు శయనమూర్తిగా ఉంటాడు. ఈ స్వామికి “పెరియ పెరుమాళ్” (పెద్దదేవుడు) అని పేరు. విగ్రహం సైజులోనేకాదు స్వామివారికి దేవగణాలలో ఉన్న స్థాయి రీత్యా కూడా పెరియపెరుమాళ్ అన్న పేరు ఎంతో సార్థకంగా అమరింది. ఉత్సవ మూర్తిని'నంబెరుమాళ్' (మనదేవుడు) అనిపేరు. పెరియాళ్వార్ (పెద్ద ఆళ్వార్) విష్ణుచిత్తులవారు తన “ముముక్షుప్పడి” గ్రంథములో వివరిస్తూ "సర్వేశ్వరుని కళ్యాణగుణాలన్నీ నంబెరుమాళ్లో ఉన్నాయన్నారు. అప్పటి నుంచి శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ గా విఖ్యాతుడయ్యాడు.కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది.
ఒకానొక సమయంలో తురుష్కులు దండయాత్రకు వస్తుండగా రంగనాథుల ఉత్సవ మూర్తిని ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి ప్రాంతానికి చేర్చి వేరొక అర్చామూర్తిని శ్రీరంగంలో ప్రతిష్ఠించారు. అలా అనుకోనివిధంగా వచ్చి పూజలందుకున్న కొత్త ఉత్సవమూర్తిని 'తిరువరంగ మాళిగైయార్ అని వైష్ణవలోకం కీర్తించింది. గర్భాలయంలో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభాలకు "తిరుమణై తూణ్" 'అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రంలో పడి కొట్టుకొని పోయే వారిని ఆపి అక్కడ నిలబెట్టగల స్తంభాలుగా ఈ స్తంభాలకు పేరు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశానికి “గాయత్రీమంటపము” అనిపేరు. గర్భాలయానికి ముందుగల ప్రదేశం “చందన మంటపం”. గర్భాలయం చుట్టూ చేసే ప్రదక్షిణకు “తిరువణ్ణాళి” ప్రదక్షిణమని పేరు. ముత్తుస్వామి దీక్షితారు శ్రీరంగనాథునిపై రచించిన కృతులలో “రంగపురవిహార” కీర్తన ఎంతో సుప్రసిద్ధమైంది. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎం. ఎస్. సుబ్బులక్ష్మి ఐక్యరాజ్యసమితిలో గానం చేసి అంతర్జాతీయంగా స్వామివారి కీర్తిని చాటారు. డిసెంబర్, జనవరి మాసాల్లో ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రెండు నెలల కాలంలో సుమారు పది లక్షల మంది భక్తులు శ్రీరంగనాథుని దర్శించుకుంటారు.
శ్రీ రంగం ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపం. సప్త ప్రాకారాలతో ఇరవైఒక్క గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠం. ఒకొక్క ప్రాకారానికి ఒకొక్క విశిష్టత ఉంది. ఒకొక్క ప్రాకారంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ ఏడు ప్రాకారాలు యోగాలో ఏడు కేంద్రాలుగా వైష్ణవులు భావిస్తుంటారు.
మొదటి ప్రాకారం
మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విరజబావి, సేనమొదలియార్ సన్నిధి, పగల్ పత్తు మండపం, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. చిలుకల మంటపం నుంచి విమాన పరవాసు దేవుణ్ణి దర్శించాలి.
రెండవ-ప్రాకారం
ఈ గోపుర ద్వారానికి “ఆర్యభట్టాళ్వాశల్” అని పేరు. ఈ ప్రాకారంలో పవిత్రోత్సవ మండపం, ఉళ్కోడై మంటపం, విరజా మండపం, వేద విన్నప మంటపం ఉన్నాయి. ఈ మంటపంలో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి. ఉళ్కోడై మంటపానికి దొరమండపమని మరోపేరుంది. విరజా మండపం కింద విరజానది ప్రవహిస్తుందని అంటారు. వేద విన్నప మంటపంలో వేదపఠనం చేస్తారు. ఇవికాక పరమపద వాశల్, తిరుమడప్పళ్లి, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇక్కడి స్తంభంపై ఉన్న వినీత ఆంజనేయస్వామి కోరిన వరాలిస్తాడని ప్రతీతి.
మూడవ ప్రాకారం
ఈ ప్రాకారానికి “ఆలినాడన్ తిరువీథి” అనిపేరు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి ఉంది. దీనికి వెలుపల వాలీసుగ్రీవులు,నమ్మాళ్వార్ల సన్నిధి ఉన్నాయి. ప్రాకారానికి ఎడమ వైపు ధాన్యం కొలిచే మండపం, నంజీయర్ సన్నిధి ఉంది. ఉగ్రాణం పైన పట్టాభిరామన్, , ముదలాళ్వార్థ సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షవ, , దీని వెనుక వేదవ్యాసర్, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి, కిళ్ పట్టాభిరామన్, వైకుంఠనాథన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారం, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి.
నాల్గవ ప్రాకారం
ఈ ప్రాకారానికి "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారంలో కుడిపక్క కూరత్తాళ్వార్ సన్నిధి, పరాశర భట్టం సన్నిధి ఉంది. పరాశరుడి పాదాల వద్ద సంజీయర్ ఉన్నాడు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తుడైన గరుడాళ్వార్సన్నిధి ఉంది. ఎడమచేతి పక్క బజారు దాటాక నాదముని సన్నిధి ఉంది. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము ఉంది. ఈ ప్రాకారంలో శ్రీరంగ విలాసం ఉంది. దీనిపై తిరుమంత్రం, ద్వయం, చరమశ్లోకాలు, శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ అవతరించిన విధం శిల్పాలుగా కనబడతాయి. విజయ స్తంభం, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వార్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, శ్రీరంగనాచ్చియార్ సన్నిధి ఈ ప్రాకారంలో ఉన్నాయి. సన్నిధి ముఖమండప స్తంభం మీద తిరువెళ్లరై పుండరీకాక్షుడు ఉన్నాడు. ఇక్కడే శరణాగతి మంటపం ఉంది. మీనమాసం, పంగుని ఉత్తరా నక్షత్రంలో శ్రీరంగనాచ్చియార్తో శ్రీరంగనాథులు వేంచేసియున్నప్పుడు రామానుజుడు శరణాగతి గద్యను విన్నవించిన స్థలం ఇది. అందుకే దీన్ని శరణాగతి మంటపం అన్నారు. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూర్ఖు వాశల్ శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి కూడా ఈ ప్రాకారంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిపే పది దినాల రాపత్తు ఉత్సవం కోసం శ్రీ రంగనాధులు కొలువు దీరే వేయి కాళ్ల మండపం (సహస్రస్థూణా మండపం) ఈ ప్రాకారంలో ఉంది. దీనికి "ఆయిరం కాల్ మండపమనే" మరో పేరు కూడా ఉంది. ఇక్కడ స్వామి వేంచేపు చేసే స్థానానికి “తిరుమామణి మంటపమ”ని పేరు. ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్-మండపంలో ఒక పక్క దశావతారాలు, మరోపక్క కోదండరామన్ సన్నిధి ఉన్నాయి. దాని పక్కన లోకాచార్యుని సన్నిధి, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, పార్థసారథి సన్నిధి, ఉడయవర్ (రామానుజుల సన్నిధి ఉంది.. ఇక్కడ రామానుజుడు సశరీరులై ("తానానా” తిరుమేని) ఉన్నారు. ఇది ఒకప్పటి వసంత మండపం. ఇక్కడే ఆళవందార్, పెరియనంబి, వరదరాజస్వామి, వీరాంజనేయ స్వామి, విఠల్ కృష్ణన్, తొండరడిప్పొడియాళ్వార్ సన్నిధులు ఉన్నాయి.
ఐదవ ప్రాకారం
ఈ ప్రాకారానికి ఉత్తర వీధి అనిపేరు. తై (మకర), పంగుని ( మీన) మాసాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీరంగనాథుడు ఈ వీధులకు వస్తారు.
మకరమాస పుష్యమీ నక్షత్రంనాడు నంబెరుమాళ్లు ఉభయనాచ్చియార్లతో తేరుపై వస్తాడు. ఈ ప్రాకారంలో ఉత్తమనంబి తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్య పురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి ఉన్నాయి.
ఆరవ ప్రాకారం
ఈ ప్రాకారానికి “చిత్రవీధి" అనిపేరు. చిత్రి (మేషమాస) బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్లు ఈ వీధులలో ఊరేగుతాడు. అందుకని ఈ వీధికి "చిత్రవీధి" అని పేరు. ఇందులో నాలుగు గోపురాలుంటాయి. దానిలో తూర్పువైపున ఉండే గోపురం 30వ శతాబ్దం నాటి వైభవాన్ని, నైపుణ్యాన్ని కళ్లముందు ఉంచుతుంది. తిరునక్షత్ర సమయాలలో ఆళ్వార్లను ఈ తిరువీధులలో ఊరేగిస్తారు. ఉత్తర మాడ వీధిలో వేదాంత దేశికర్ సన్నిధి, జగన్నాథన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో రథం, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం ఉన్నాయి. దక్షిణ ప్రాకార వీధి మధ్యలో 5 అడుగుల లోతులో పాతాళకృష్ణన్ సన్నిధి ఉంది.
ఏడవ ప్రాకారం
ఈ ప్రాకారానికి “అడయవళంజాన్” వీధి అనిపేరు. ఈ ప్రాకారంలో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి, వెలియాండాళ్ సన్నిధి కూడా ఉంది. పడమటి ద్వారం గుండ తెప్పగుంటకు పోవచ్చు. మాసి (కుంభమాస) బ్రహ్మోత్సవాలలో రథోత్సవానికి బదులు తెప్పోత్సవం జరుపుతారు. ఆ ఉత్సవం ఈ తెప్పగుంటలోనే జరుగుతుంది. ఉత్తర ద్వారం నుంచి తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై ఉన్న కొల్లడం పోడానికి దారి ఉంది. ఇక్కడ ఆళవందార్ పడిత్తురై కూడా ఉంది.పడమటి ద్వారా సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి ఉంది. ఇదే శ్రీ వచన భూషణ మవతరించిన స్థలం. దక్షిణ గోపురం ద్వారా కావేరి నదికి పోవచ్చు. దీనికే రాయగోపురమని పేరు ఇలా యోగదృష్టితో..భోగనిద్రతో పాలిస్తున్నాడు శ్రీరంగనాథుడు.
Comments
Post a Comment