- ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
- ఈ రోజు లలితా దేవిని విశేషంగా అర్చించి, ఆ రాత్రి అంతా అమ్మవారిని భజన చేస్తూ జాగరణ చేయాలి.
- ఈ వ్రతం ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ఆచరణలో ఉంది.
- ఈ వ్రతాన్ని చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి, సకల శుభాలు కలుగుతాయి.
వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం 'త్రిపురత్రయం'లో రెండవ శక్తి స్వరూపిణి లలితా పరాభట్టారిక. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని 'లలితా పంచమి' అని కూడా అంటారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తుల కష్టాలు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవ రాత్రులలో అయిదవ రోజు ‘ఉపాంగ లలితా వ్రతం’ ఆచరిస్తారు.
ఈ రోజు అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారంలో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేయాలి. ముత్తైదువలకు యధాశక్తి తాంబూలాలు ఇచ్చుకోవాలి. ఈ రోజు ఇళ్లల్లో, దేవాలయాలలో కూడా ముత్తైదువులచే సువాసినీ పూజలు చేయిస్తారు.
ఉపాంగ లలితా వ్రతం రోజు శ్రీ లలితా దేవి అపారమైన కరుణతో తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుంది. కుంకుమ పూజలు చేసిన వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచమి నాడు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్టించుకుని, 'ఓం శ్రీ మాత్రేనమః' అని వీలైనన్ని సార్లు జపించుకుంటే ఆ చల్లని తల్లి కరుణాకటాక్షాలు తన భక్తులపై ప్రసరింపజేస్తుంది.
2024 తేదీ: అక్టోబర్ 07
Comments
Post a Comment