Irukalala Parameswari Temple: శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం - నెల్లూరు
శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవాలయం నెల్లూరు పట్టణంలో మూలాపేటలో స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు ఒడ్డున నిర్మించబడింది.. ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించాడని ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతోంది. దేవాలయ మండపంలోను, స్తంభములపైన తెలుగు, తమిళ, దేవనాగరి భాషలలో ఉన్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రకాంశాలను తెలుపుతున్నాయి.
క్రీ.శ. 13 శతాబ్దంలో నెల్లూరును తెలుగుచోళరాజులు పరిపాలించారు. ఆ కాలంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత వల్ల తెలుగు చోళరాజైన చోడతిక్క తమ సహాయార్థం దండెత్తి రావలసినదిగా ఓరుగళ్ళు పురాధీశ్వరుడైన కాకతీయ గణపతిదేవుని వేడుకొన్నాడు. గణపతిదేవుడు మొదటిసారిగా క్రీ.శ. 1203 సంవత్సరంలో నెల్లూరు ప్రాంతంపై దండెత్తారు. అప్పటినుండి దాదాపు క్రీ.శ. 1317 వరకు కాకతీయులు అనేకమార్లు నెల్లూరుపై దండయాత్ర జరిపారు. ఈ నేపధ్యంలో ప్రతాపరుద్రదేవ మహారాజు కాలంలో (క్రీ.శ.1314- 15) ఈ ప్రాంతానికి వచ్చిన అతని సేనానులు ముప్పడి నాయకునికి అతని కొడుకు పెద్ద రుద్రునికి పుణ్యంగా నెల్లూరు భూమికి నెలమూడు వర్షాలు కురవగా ధనకనకాలు సమృద్ధిగా ఉన్న వారి భృత్యులు నాగగణ సేవకుడైన హరిదేవుని కుమారులైన నాయగానులోక బోయుడు, బ్రహ్మణబోయుడు అనేవార్లు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
మరొక శాసనం ప్రకారం విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా ఉదయగిరిని పాలిస్తూ సావణ్ణ ఒడియుల కాలంలో (క్రీ.శ. 1364- 65) అధికారి కాంచణం అనే ఆయన ప్రతి శుక్రవారం సంత ఏర్పాటు చేసి, సంతకు దేశ విదేశాలనుండి వచ్చే వర్తకుల నుండి వసూలయ్యే వర్తక సుంకాలలో కొంతభాగం శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి అంగరంగ వైభోగాలకు ఇచ్చేటట్లు కట్టడి చేశాడు. ఈ దేవాలయం బొంతరాళ్ళతో కట్టబడింది. ఇందు గర్భగృహంలో అంతరాలయ మండపం, అర్థమండపం, మండపం, వరండా ప్రధానమైన వాస్తుభాగాలు. దేవాలయానికి ముందు ముఖమండపం వుంది.
ఇందులోనే శాసనాలు స్తంభాలపైన, రాతి దూలాలపై వున్నాయి. ఇక్కడి దేవితో పాటు గుడ్లగూబ కూడా వుండటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటిది ఎల్లోరాలోని సప్తమాతృకుల శిల్పంలో చాముండి వద్ద చూడవచ్చు. ఈవిధంగా ప్రాచీన కాలం నుండి నేటి వరకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు గ్రామదేవతగా ప్రసిద్ధి చెంది, భక్తులు కోర్కెలు తీరుస్తూ కొంగుబంగారంగా పేరుపొందింది.
Comments
Post a Comment