Mandapams in Tirumala: తిరుమల ఆలయంలో మండపాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో మండపాలు చాలా ఉంటాయి.. ఏ మండపంలో ఎలాంటి క్రతువులు నిర్వహిస్తారు ?

ప్రతిమా మండపం

తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం నుంచి లోపలికి వెళ్లగానే 16 స్తంభాలతో  విజయనగర శిల్పసంప్రదాయం ఉట్టిపడేలా ప్రతిమా మండపం ఉంటుంది. దీన్నే శ్రీ కృష్ణదేవరాయ మండపం అని అంటారు. ఈ మండపంలో దక్షిణభాగాన శ్రీకృష్ణదేవరాయలు ఆయన దేవేరులు, తిరుమలదేవి-చిన్నాదేవి నమస్కరిస్తూ నిలువెత్తు రాగి విగ్రహాలు కనిపిస్తాయి. శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించి లోపలికి వచ్చి ఈ ప్రతిమా మండపంలోనే కొంతసేపు విశ్రమిస్తారు. ఇక్కడే ఆచార్యపురుషులు దివ్యప్రబంధగానం చేస్తారు.

అద్దాలమండపం  

ప్రతిమా మండపానికి ఉత్తరదిక్కున ఎత్తైనప్రదేశంలో అద్దాలమండపం (ఆయినామహల్‌) ఉంది. అందులో డోలోత్సవానికి గొలుసులు వేలాడతీసి ఉంటాయి. ఊయలలో ఊగేటప్పుడు స్వామివారు అద్దాలలో అన్నివైపులా ప్రతిబింబిస్తారు. ఇక్కడ నిత్యం డోలోత్సవం జరుగుతుంది. క్రీ.శ.1831 నాటికే ఈ మండపముందని రికార్డుల ద్వారా తెలుస్తోంది.

రంగమండపం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించే సమయం లో ఈ పేరును మనం ఎక్కువగా వింటుంటాము. రంగమండపం లేదా రంగనాయకమండపం. ఈ మండపం అద్దాల మండపానికి ఎదురుగా ఎత్తైన రాతిస్తంభాలతో ఉంది. క్రీ.శ. 1320-60 మధ్య శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో రక్షింపబడి పూజలందుకొన్నారని ప్రతీతి. బ్రహ్మోత్సవాల సమయాల్లో స్వామివారు ఇక్కడే పూజానైవేద్యాలు అందుకుంటారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు ఇక్కడే జరిగేవి. 

తిరుమలరాయ మండపం

రంగమండపాన్ని ఆనుకుని ఉన్న ధ్వజస్తంభమండపానికి 10 అడుగుల దూరంలో తిరుమలరాయమండపం  ఉంది. క్రీ.శ.1473లో సాళువ నరసింహరాయలు ఈ మండపం ప్రతిష్ఠించారు. ఇక్కడ హంసతూలికాతల్పంలో స్వామివారు ఉభయనాంచారులతో ఊగుతారు. 16వశతాబ్దంలో తిరుమలరాయలు దీనిని విస్తరింపజేసి ఏటా వసంతోత్సవం జరిపే ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ సమయం లో స్వామివారు ఈ మండపంలోకి వేంచేస్తారు.

ధ్వజస్తంభ మండపం

ఈ ధ్వజస్తంభ మండపాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు.  శ్రీవారి  బ్రహ్మోత్సవాల ఆరంభంలో అంకురార్పణ అనంతరం ధ్వజారోహణం నిర్వహిస్తారు.  బంగారు ధ్వజస్తంభంపై గరుడాళ్వారు ధ్వజపటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు దేవతలకు ఆహ్వానం పలుకుతారు.  

నాలుగుకాళ్ల మండపం

తిరుమలరాయ మండపానికి పడమరగా సంపంగి ప్రదక్షిణలో ఆగ్నేయమూలగా నాలుగుకాళ్ల మండపాలున్నాయి. అప్పట్లో స్వామివారు ఇక్కడికే వేంచేసేవారు. క్రీ.శ.1470లో సాళువనరసింహరాయలు తన కుటుంబసభ్యులపేర దీనిని నిర్మించాడు. ఉట్లపండుగ రోజ కృష్ణస్వామి ఇక్కడ వేంచేపు చేసి పూజలందుకుంటాడు. దీనినే శిక్యోత్సవమంటారు.

కల్యాణమండపం

సంపంగి ప్రదక్షిణకు దక్షిణంవైపున దీర్ఘచతురస్రాకారంలో నిత్యకల్యాణం పచ్చతోరణానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది శ్రీవేంకటరమణస్వామి కల్యాణ మండపం. ఇక్కడే రోజూ ఆర్జిత సేవల్లోని కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కొన్నేళ్లక్రితం ఇది రంగమండపంలో జరిగేది. పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం కూడా ఇక్కడే ఏటా నిర్వహించబడుతాయి.

మహామణిమండపం

ఆనందనిలయంలోకి ప్రవేశించగానే మహామణి మండపం బంగారు వాకిలికి గరుడమందిరానికి మధ్య ఉంది. దీనినే ఘంటామండపం, ముఖమండపం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నాలుగువరుసల్లో 16 స్తంభాలున్నాయి. క్రీ.శ. 1417లో విజయనగరసామ్రాజ్య మంత్రి మల్లన దీనిని నిర్మించారు. ఈ స్తంభాలపై వరాహస్వామి, నరసింహస్వామి, మహావిష్ణువు, వేంకటేశ్వరస్వామి, వరదరాజస్వామి వారు దర్శనమిస్తాయి.

ఈ మండపంలో నిత్యం ప్రాతఃకాలాన మూడు గంటలవేళ సుప్రభాత పఠనం చేస్తారు. కొలువు, పంచాంగ శ్రవణం, ఆదాయవ్యయ నివేదన ఇక్కడే చేస్తారు.   ఈ మండపానికి  దక్షిణాన రెండు పెద్దగంటలు  పెద్ద ఇనుపగొలుసులతో వేలాడదీసి ఉంటాయి. స్వామివారికి నివేదన సమయంలో వీటిని మోగిస్తారు. ఇదే ఘంటామండపం. దీనినే తిరుమామణి మండపం అని కూడా పిలుస్తారు. తమిళంలో 'మణి' అంటే గంట అని అర్థం.

స్నపనమండపం 

బంగారువాకిలి లోపల చతురస్రాకారంలో కనిపించేదే స్నపనమండపం. నాలుగుస్తంభాలపై బాలకృష్ణుడు, యోగనరసింహుడు, శ్రీ కాళీయ మర్దన కృష్ణ శిల్పాలు రమ్యంగా చెక్కబడ్డాయి. దీనిని తమిళంలో తిరువిలాన్‌కోయిల్‌ అంటారు. క్రీ.శ. 614లో పల్లవ రాణి సమవాయి(పెరుందేవి) వెండి భోగశ్రీనివాసమూర్తిని బహూకరించిగా, ఈ మండపంలో అభిషేకాదులు అప్పట్లో జరిగేవి.

శయనమండపం

రాములవారి మేడ దాటగానే కన్పించేదే శయన మండపం. ఇక్కడ రోజూ రాత్రివేళ భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతసేవ జరుపుతారు. వెండిగొలుసులతోనున్న బంగారు పట్టె మంచంపై స్వామివారిని పరుండజేస్తారు. అన్నమయ్య వంశీకుడు అన్నమయ్యలాలి పాడుతారు. సుప్రభాతం తర్వాత తోమాల సేవల సమయంలో దివ్యప్రబంధ గానాన్ని చేస్తారు. సహస్రనామ పఠనం, వేదపఠనం ఇక్కడే జరుగుతాయి. ఆర్జిత సేవాభక్తులు ఇక్కడ కూర్చొని స్వామిని వీక్షిస్తారు.

వెండివాకిలికి దక్షిణదిశలో అంకురార్పణ మండపం ఉంది. విమాన వేంకటేశ్వరుని దర్శించి, హుండీలో కానుకలు సమర్పించి రాగానే యోగనారసింహుని ప్రదక్షిణమండపం కన్పిస్తుంది.

అంకురార్పణమండపంలో బ్రహ్మోత్సవాలకు ముందు బీజావాపం అనే వైదికప్రక్రియ జరుగుతుంది. ఈ మండపాలకు తోడుగా గొల్లమండపం, పారువేట మండపం, ఆస్థానమండపం, సహస్రదీపాలంకరణసేవాకొలువు మండపం, వసంతోత్సవ మండపం, వాహనమండపం, నాదనీరాజన మండపం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇనుమడింప జేస్తాయి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి