భగవంతుని అవతారాలు మొత్తం 21 అని భాగవతం పేర్కొంది. అయితే వాటిలో అందరికీ సుపరిచితమైనవి, సుప్రసిద్ధమైనవి దశావతారాలు. రాబోయే తరాలకు మన పురాణ విజ్ఞానం అందచేయడానికే బొమ్మల కొలువు సంస్కృతి ఏర్పడింది. దసరాలాంటి విశేష పర్వదినాల సందర్భాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి అనేక దేవతా స్వరూపాలను పిల్లలు నెలకొల్పుతారు. వాటితో పాటు మన సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు కూడా ఉంటాయి. ఈ కొలువును అవకాశం ఉన్నవారు పది రోజులూ ఉంచుకోవచ్చు. ఏడు వరసల్లో బొమ్మల్ని అందంగా పేర్చాలి. వాటిలో జీవ కోటి, ప్రాణికోటి, వృక్షకోటి, పక్షులు, భగవంతుని అవతారాలు, భక్తుల మూర్తులు, దేశ భక్తులు, వీరులు మహా కవులు తదితరులనందరినీ అలంకరించుకోవచ్చు. బొమ్మలకొలువు చూడగానే మన భారతీయ సనాతన సంప్రదాయమంతా స్పష్టంగా కనబడేలా ఉండాలి. ఏడువరసల బొమ్మలు అంటే ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు. బొమ్మల కొలువులో బొమ్మలకు ప్రతిరోజూ హారతి సమర్పించాలి. నైవేద్యం అవసరం లేదు. బొమ్మల కొలువు చూడడానికి వచ్చినవారికి తాంబూలం అందించాలి.
రఘువంశరాజులకి కులదేవత సూర్యుడు. సూర్యుని పూజించిన తరువాతనే వారు ఇతర దేవతలను ఆరాధన చేసేవారు. కులం అనే మాటకి సమాన లక్షణాలున్న సముదాయం, గుంపు అని అర్థం. ఈ కాలంలో అది వర్ణభేదం అనే అర్ధంలో వాడుకలోకి వచ్చింది. కానీ కులం అంటే వంశం అనే అర్థం సరైనది. ఒక వంశంలో తరతరాలుగా పూజలందుకునే దైవాన్ని కులదేవత అంటారు. ప్రతివంశానికి ఒకకులదేవత ఉంటుంది. ఇష్టదేవతారాధనకు ముందు కులదేవతారాధన చేయడం తప్పనిసరి.
Comments
Post a Comment