బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో దసరా నవరాత్రులు అప్పుడు బతుకమ్మ జరుపుకుంటారు.బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ.
రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.
ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు మరియు తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.
ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
ఆ పై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు.
చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.
చీకటి పడుతుంది అనగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది.ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులూ, ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.
2024 లో అక్టోబరు 02 నుండి అక్టోబరు 10 వరకు వరకు బతుకమ్మ సంబురాలు జరుగుతాయి.
తేదీ | బతుకమ్మ పేరు | నైవేద్యం |
అక్టోబరు 02 | ఎంగిలి పూల బతుకమ్మ | నువ్వులు, బెల్లంతో నైవేద్యం |
అక్టోబరు 03 | అటుకుల బతుకమ్మ | పప్పు, బెల్లం , అటుకులు |
అక్టోబరు 04 | ముద్దపప్పు బతుకమ్మ | ముద్దపప్పు , పాలు, బెల్లం |
అక్టోబరు 05 | నానే బియ్యం బతుకమ్మ | పాలలో నానబెట్టిన బియ్యపు పిండి, బెల్లం |
అక్టోబరు 06 | అట్ల బతుకమ్మ | అట్లు |
అక్టోబరు 07 | అలిగిన బతుకమ్మ | నైవేద్యం పెట్టరు |
అక్టోబరు 08 | వేపకాయల బతుకమ్మ | సకినాల పిండితో వేపకాయలు |
అక్టోబరు 09 | వెన్న ముద్దల బతుకమ్మ | వెన్న లేదా నెయ్య, బెల్లం |
అక్టోబరు 10 | సుద్దల బతుకమ్మ | చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం , నువ్వులన్నం |
Comments
Post a Comment