Magha Puranam Telugu: మాఘ పురాణం 8వ అధ్యాయం- స్నాన పుణ్యంతో రాక్షసుడి నుంచి తప్పించుకున్న విద్యాధర పుత్రిక కథ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, February 6, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 8వ అధ్యాయం- స్నాన పుణ్యంతో రాక్షసుడి నుంచి తప్పించుకున్న విద్యాధర పుత్రిక కథ


 
శివపార్వతుల సంవాదం

పరమ శివుడు పార్వతితో "ఓ పార్వతీ! మాఘ స్నాన మహత్యంతో విద్యాధర పుత్రిక శ్రీహరి భక్తుని ఏ విధంగా భర్తగా పొందిందో వివరిస్తాను. శ్రద్ధగా ఆలకింపుము" అంటూ ఎనిమిదవ రోజు అధ్యాయాన్ని మొదలు పెట్టాడు.

మాఘ పురాణం 8వ అధ్యాయం

విద్యాధర పుత్రిక మాఘ స్నాన మహత్యంతో శ్రీహరి భక్తుని భర్తగా పొందిన వైనం పూర్వం దేవతాసంభవుడైన విద్యాధరుడు అనే అతను సంతానం కోసం పరితపిస్తూ సంతానం కోరుచూ గంగానది తీరంలో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయసాగెను. ఇంద్రియములను నిగ్రహించి, ఎండా వాన చలిలో కూడా చలించక బ్రహ్మాదేవుని గురించి కఠిన తపస్సు చేయసాగెను.

విద్యాధరునికి ప్రత్యక్షమైన బ్రహ్మ

వెయ్యి దివ్య సంవత్సరాలు విద్యాధరుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై "విద్యాధరా! నీ తపస్సుకు మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోమనగా", విద్యాధరుడు బ్రహ్మదేవునితో " దేవా! నేను పుత్ర సంతానం కోసం తపస్సు చేయుచున్నాను. నాకు పుత్ర సంతానం ప్రసాదించమని" కోరగా బ్రహ్మదేవుడు విద్యాధరునితో "నీకు పుత్ర సంతాన యోగం లేదు. నీ తపస్సు మెచ్చి నేను నీకిచ్చే వరం వలన నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది" అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు.

అతిలోకసౌందర్యవతిగా విద్యాధర పుత్రిక

బ్రహ్మ చెప్పినట్లుగానే విద్యాధరునికి చూడ చక్కని ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టింది మొదలు శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి చెందుతూ యుక్త వయసు వచ్చాక కోమలమైన, అతిలోక సౌందర్యవతి అయింది. పెళ్లీడుకు వచ్చిన కుమార్తెను చూసి ఇంతటి సౌందర్యవతి, సుశీల అయిన ఈమెకు తగిన యోగ్యుడైన వరుడు ఎక్కడ ఉంటాడా! అని విద్యాధరుడు నిత్యం చింతిస్తూ ఉండేవాడు.

వేదవేదాంగాలు చదివిన రాక్షసుడు

ఇదిలా ఉండగా ఒక రాక్షసుడు తమ కులదేవత అయినా మాయాదేవిని పూజించి ఆమె నుంచి పొందిన వర ప్రభావం చేత సమస్త వేదాలు, శాస్త్రాలు తెలుసుకొని, తత్వ చర్చలు, చేయగల సమర్థుడై, మాయ యుద్ధ విశారదుడై, కాపారూపమును పొందగల శక్తి కలవాడై ఉన్నవాటితో తృప్తి చెందక పరమ శివుని త్రిశూలం పొందగోరి ద్రోణ పర్వతం మీద తపస్సు చేయసాగాడు.

రాక్షసుని ఘోర తపస్సు

ద్రోణపర్వతం సకల జంతువులకు, పశు పక్ష్యాదులకు ఆశ్రయమిస్తూ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సమూహాలచే పూజలందుకుంటుండేది. ఆ అరణ్యంలో ఆ రాక్షసుడు తన కాలి చిటికెన వేలును భూమిపై ఆనించి, నిశ్చలంగా ఊర్ధ్వ ముఖుడై చేతులు జోడించి శివుని ప్రార్ధిస్తూ ఒక సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేసాడు.

ప్రత్యక్షమైన శివుడు

రాక్షసుని ఘోర తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమనగా ఆ రాక్షసుడు శివుని చేతిలోని త్రిశూలం కావాలని కోరాడు. పరమ శివుడు రాక్షసునికి త్రిశూలం ఇస్తూ ఇలా అన్నాడు. "ఓ రాక్షసోత్తమా! ఎప్పుడైతే ఈ త్రిశూలం నీ శత్రువుల చేతికి చిక్కుతుందో అప్పుడు ఇదే త్రిశూలంతో నీకు మరణం సంభవిస్తుందని" చెప్పి అదృశ్యమయ్యాడు.

రాక్షసుడి అహంకారం

శివుని నుంచి త్రిశూలం పొందిన రాక్షసుడు "ఈ త్రిశూలాన్ని నేను విడిస్తే కదా ఇది శత్రువుల చేతికి చేరి నాకు ఆపద కలిగేది అందుకే నేను ఈ త్రిశూలాన్ని ఎప్పటికి విడవను" అని అనుకుంటాడు.

ఈశ్వరుని త్రిశూలంతో ముల్లోకాలు తిరిగిన రాక్షసుడు

శివుని నుంచి త్రిశూలం పొందిన గర్వంతో రాక్షసుడు దానిని చేతపట్టి ముల్లోకాలు తిరిగి అందరినీ భయభ్రాంతులకు గురి చేసాడు. చివరకు సముద్రం మధ్యలో లోతైన ప్రదేశంలో ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం శత్రు దుర్భేద్యమైనదిగా ఉండేది. బంగారు మేడలు, రత్నాల రాశులతో ఇంతటి సుందరమైన పట్టణం ప్రపంచంలో ఇంకొకటి కలదా అని అనిపించేలా ఉండేది.

పెళ్లి చేసుకోవాలనుకున్న రాక్షసుడు

అద్భుతమైన పట్టణం నిర్మించాక ఆ రాక్షసుని మనసు పెళ్లి వైపు మళ్లుతుంది. తన ఐశ్వర్యానికి, పరాక్రమానికి సరితూగే కన్య ఎక్కడ ఉందా అని వెతకడానికి వాడు బయలుదేరాడు. యోగ్యమైన కన్య కోసం 14 భువనాలు వెతికిన రాక్షసుడు దేవలోకంలో విద్యాధరుని కుమార్తెను చూసి తన రాక్షస రూపం వదిలి గంధర్వ రూపం దాల్చి ఆమె ముందు నిలిచి తనను వివాహం చేసుకొమ్మని కోరాడు.

విద్యాధర పుత్రికను అపహరించిన రాక్షసుడు

రాక్షసుని మాటలు విన్న విద్యాధర పుత్రిక "నేను నా తండ్రి సంరక్షణలో ఉన్నాను. మీరు నా తండ్రిని అడగండి" అనింది. రాక్షసుడు విద్యాధరుని కలిసి ఆయన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమంగా విద్యాధరుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఈ రాక్షసుడు కామరూపం దాల్చి విద్యాధర పుత్రికను అపహరించి బలవంతంగా ఆమెను తానున్న పట్టణానికి తీసుకెళ్లాడు. ఇక్కడ విద్యాధరుడు తన కుమార్తె కనబడక దిగులు చెందసాగాడు.

వివాహ ముహూర్తం కోసం బ్రహ్మను కలిసిన రాక్షసుడు

విద్యాధర పుత్రికను తన మందిరంలో బంధించిన విద్యాధరుడు వివాహం కోసం సుముహూర్తం నిర్ణయించడానికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. అప్పుడు బ్రహ్మ మరో ఎనిమిది మాసాల తర్వాతనే వివాహానికి మంచి ముహూర్తం కలదని చెప్పి రాక్షసుని పంపించి వేశాడు.

విద్యాధర పుత్రికను ప్రలోభపెట్టిన రాక్షసుడు

బ్రహ్మ వద్ద నుంచి వచ్చాక రాక్షసుడు విద్యాధర పుత్రికతో "కళ్యాణి! మన వివాహానికి ఇంకా ఎనిమిది మాసాల గడువుంది. అంతవరకు నేను నిన్ను స్పృశించను. నీవు సంతోషంగా ఉండుము" నీకేమి కావాలో చెప్పు" అని అడుగుతాడు.

విద్యాధర పుత్రికను హఠకేశ్వరం తీసుకెళ్లిన రాక్షసుడు

రాక్షసుని మాటలకు ఆమె కొంతసేపు మిన్నకుండి తరువాత రాక్షసునితో "రాక్షసుడా! నాకు ప్రతి సోమవారం సాయంత్రం శివదర్శన వ్రతముంది. అందుకోసం శివలింగ ఎక్కడ ప్రతిష్టించావో చెప్పు " అని అడిగింది. అంతట ఆ రాక్షసుడు ఆమెను తన ఇంటి నుంచి పాతాళానికి తీసుకొని పోయి హఠకేశ్వర స్వామిని చూపిస్తాడు. అప్పడు విద్యాధర పుత్రిక సంతోషించి ప్రతి సోమవారం సాయంత్రం పాతాళలోకంలోని హఠకేశ్వర స్వామిని దర్శిస్తూ ఉండేది.

నారదుని రాక

ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి ముల్లోకాలు తిరుగుతూ హఠకేశ్వరానికి వచ్చి అక్కడ విద్యాధర పుత్రికను చూసి "అమ్మాయి! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించగా ఆమె రాక్షసుడు తనను బలవంతంగా ఎత్తుకొచ్చి ఇక్కడ ఉంచాడని ఎనిమిది మాసాల తర్వాత వివాహం చేసుకోబోతున్నాడని చెప్పింది.

నారదుని అభయం

ఆమె మాటలు విన్న నారదు "అమ్మాయీ! భయపడకు! నీకు శ్రీహరి భక్తుడైన వాడు భర్తగా రాగలడు. అతనిని నేను నువ్వున సముద్ర ప్రాంతానికి తీసుకువస్తాను. ఇక్కడ ఉన్న హఠకేశ్వర స్వామికి ముందరభాగంలో మానసమను సరస్సు కలదు. రానున్నది మాఘమాసం. నువ్వు మాఘమాసంలో సూర్యోదయం సమయంలో ఈ సరస్సులో స్నానం చేసి శ్రీహరిని ఫలపుష్పాలతో పూజించి, మాఘ పురాణాన్ని శ్రద్ధగా వినుము. ఆ శ్రీహరి భక్తుడే నీకు భర్తగా రాగలడు" అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

మాఘ స్నానం చేసిన విద్యాధర పుత్రిక

నారదుని మాటలు విన్న విద్యాధర పుత్రిక మాఘమాసం కోసం వేచి చూసింది. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత మాఘ మాసం వచ్చింది. పరమ పవిత్రమైన మాఘ మాసం నెలరోజుల పాటు విద్యాధర పుత్రిక సరస్సులో స్నానం చేసి ఆ శ్రీహరిని పరి పరి విధాలుగా పూజించింది.

సౌరాష్ట్ర రాజ్యాధిపతి కలుసుకున్న నారదుడు

ఇటు విద్యాధర పుత్రిక వద్ద నుంచి బయలు దేరిన నారదుడు సౌరాష్ట్ర దేశమునకు వెళ్లి సదా శ్రీహరిని పూజించే ఆ దేశాధిపతి అయిన హరిద్రదుని కలుసుకున్నాడు. ఈ హరిద్రధుడు సమస్తు భూతకోటియందు శ్రీహరిని గాంచుతూ, సర్వకాల సర్వావస్థలలోను ఆ శ్రీహరిని స్మరిస్తూ అన్నింటిలోనూ శ్రీహరిని దర్శిస్తుండేవాడు.

రాజుకు కర్తవ్యం బోధించిన నారదుడు

నారదుడు ఆ రాజుతో" ఓ భక్తాగ్రేసరా! ఒక విద్యాధర కన్యకను ఒక రాక్షసుడు బలవంతంగా అపహరించి సముద్రం మధ్యలో ఉన్న తన నగరంలో దాచిపెట్టాడు. ఆమెను వివాహంలో చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నాడు. నీ పరాక్రమంతో ఆ కన్యను రక్షించి నీ ధర్మపత్నిగా చేసుకో!" అన్నాడు. అప్పుడు ఆ రాజు నారదా! సముద్రం మధ్యలో ఉన్న రాక్షసుని నేను ఎలా చంపగలను? ఆ కన్యను ఎట్లు తీసుకొని రాగాలను?" అనగా నారదుడు రాజుతో "రాజా! నీవు అక్కడకు వెళ్తే సముద్రమే నీకు దారి ఇస్తుంది. ఆ రాక్షసుని వద్ద శివుడు ప్రసాదించిన శివ త్రిశూలం కలదు. నీవు ఆ త్రిశూలాన్ని సంగ్రహించి దానితోనే వాడిని సంహరించమని చెప్పాడు.

హారిద్రదుని సాహసం

నారదుడు చెప్పినట్లుగా హరిద్రధుడు రథం ఎక్కి సముద్ర తీరానికి చేరాడు. రాజును చూడగానే సముద్రం రెండుగా చీలి రాజుకు దారి ఇచ్చింది. ఆ మార్గంలో వెళ్లి హరిద్రధుడు రాక్షసపురానికి చేరాడు. ఆ సమయంలో రాక్షసుడు వివాహానికి సుముహూర్తం నిశ్చయనించడానికి బ్రహ్మ వద్దకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ వాడు త్రిశూలాన్ని ఇంట్లోనే విడిచి వెళ్లాడు. హరిద్రధుడు శివదత్త త్రిశూలాన్ని చేపట్టి ఉండగా ఆ రాక్షసుడు తిరిగి వచ్చాడు.

రాక్షసుని అంతర్మధనం

హరిద్రదుని చేతిలో త్రిశూలం చూడగానే రాక్షసుని మదిలో బ్రహ్మ చెప్పింది మెదిలింది. ఇక తనకు చావు తప్పదని తలచి పోరాడి చావాలని నిర్ణయించుకొని హరిద్రదునిపైకి యుద్ధానికి వెళ్లాడు. ఇరువురు ఘోరమైన యుద్ధం చేసారు. ఆ యుద్ధంలో హరిద్రధుడు శివదత్తత త్రిశూలంతో రాక్షసుని వక్షస్థలంల్లో కొత్తగా ఆ దెబ్బకు వాడు నేల కరిచి మరణించాడు.

విద్యాధర కన్యక కళ్యాణం

హరిద్రధుడు విద్యాధర కన్యకను చూడగా ఆమె ఆ శ్రీహరి భక్తుని చూసి ఇతడే తన భర్త అని తలచి సిగ్గుతో తలవంచుకొనెను. అంత నారదుని సమక్షంలో వారి కళ్యాణం జరిగింది. అటు పిమ్మట ఆ దంపతులు తమ గృహానికి చేరి జీవించి ఉన్నంతకాలం శ్రీహరిని పూజిస్తూ మరణించిన తరువాత విష్ణు లోకమునకు చేరుకున్నారు.

"చూసావుగా! పార్వతీ మాఘ స్నానం వలన విద్యాధర పుత్రిక రాక్షసుని బారి నుంచి బయటపడి శ్రీహరి భక్తుని ఏ విధంగా భర్త పొందిందో" అని చెబుతూ శివుడు ఎనిమిదో రోజు కథను ముగించాడు. 

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! అష్టమాధ్యాయ సమాప్తః 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages