శివపార్వతుల సంవాదం
పరమ శివుడు పార్వతితో "పార్వతి మాధవమాసంగా పేరొందిన మాఘ మాసంలో మాఘ స్నానం చేసి, మాఘవ్రతం చేసి శ్రీహరిని ఆరాధించి శూద్ర దంపతులు ముక్తి పొందిన కథను వివరిస్తాను శ్రద్ధగా వినుము" అంటూ ఆరో అధ్యాయాన్ని ప్రారంభించాడు.
సుమందుని దురాశ
పూర్వకాలం ఆంధ్రదేశంలో సుమందుడను శూద్రుడు ఉండేవాడు. ఇతను గొప్ప ధనవంతుడు. ధనధాన్యాలతో తులతూగుతుండేవాడు. నిత్యం వ్యవసాయం చేస్తూ, వడ్డీ వ్యాపారం కూడా చేయుచుండేవాడు. వడ్డీ వ్యాపారంలో అమిత క్రూరంగా ఉండేవాడు. అపకారపు బుద్ధి కలిగి గోవులను, గేదెలను, గుర్రాలను, మేకలను, గొర్రెలను, ఒంటెలను కొనడం, అమ్మడం చేస్తూ అధికంగా ధనం సంపాదించాడు.
దయాగుణం కలిగిన సుమందుని భార్య
సుమందుని భార్య కుముద సర్వ భూతములయందు దయకలిగి ఉండేది. సుమందుడు దుర్మార్గుడు, నాస్తికుడు, అసత్యవాది, పాపాత్ముడు. అతడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని తాను తినక, ఇతరులకు పెట్టక ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టాడు.
సుమందుని ఇంటికి ముని రాక
కొంతకాలానికి ఒకానొక మాఘ మాసంలో సుమందుని ఇంటికి శుచివ్రతుడను ముని పుంగవుడు వచ్చాడు. అది రాత్రి వేళ కావడం వల్ల ఆ ముని వర్షానికి తడిసి, చలికి వణుకుతూ, ప్రయాణ బడలికతో అలసి పోయి సుమందుని భార్యతో ఈ విధంగా అన్నాడు. "తల్లీ! నేను వర్షానికి తడిసి చలితో బాధపడుతున్నాను. ప్రయాణ బడలికతో అలసిపోయి ఉన్నాను. ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయమిస్తే ఉదయాన్నే నా దారిన నేను పోతాను" అనగా కుముద ఎంతో దయతో గోశాలలో కొంత ప్రాంతంలో గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఒక కంబళి పరచి ఆ మునిని ఆ రాత్రికి అక్కడే పడుకోమని, కప్పుకోడానికి ఒక కంబళి కూడా ఇచ్చింది. స్వచ్ఛమైన గోవు పాలు పితికి వేడి చేసి మునికి ఇచ్చి అతని ఆకలి బాధను తీర్చింది. అంత ఆ ముని పుంగవుడు సేదతీరి శ్రీహరిని ధ్యానించ సాగాడు. ఆ సమయంలో సుమందుడు గ్రామంలో లేకుండెను.
ముని పుంగవునితో కుముద సంభాషణ
అర్ధరాత్రి సమయంలో మునిపుంగవుడు శ్రీహరిని కీర్తించడం చూసి కుముద నిద్రలేచి ముని చెంతకు వెళ్లి "స్వామీ! మీరెవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎక్కడకు వెళ్తున్నారు?" అని అడుగగా ఆ విప్రుడు ఇట్లు చెప్పెను "అమ్మా! నేను తుంగభద్రా తీరం నుంచి వస్తున్నాను. మాఘ మాసంలో తీర్థయాత్రలు చేయాలన్న కోరికతో శ్రీరంగంలో రంగనాథుని సేవించడానికి వెళ్తున్నాను. మార్గాయాసంతో మీ ఇంటికి చేరాను." అని అనగా కుముద "స్వామీ! మాఘ మాసం అంటే ఏమిటి? తీర్థయాత్రలు అంటే ఏమిటి? మోక్షమంటే ఏమిటి? వివరంగా చెప్పండి అని అడిగింది.
మాఘ మాస మహత్యం వివరించిన ముని
కుముద మాటలకూ మునిపుంగవుడు "తల్లీ! మాఘ మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో నెల రోజుల పాటు నదీ స్నానం చేసి, తాజా తులసి దళాలతో, రంగురంగుల పుష్పాలతో శ్రీహరిని ఆరాధించి మధుర పదార్థాలు నివేదిస్తే శ్రీహరి సంతోషిస్తాడు. ఎవరయితే ఈ విధంగా మాఘ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఇక పునర్జన్మ లేకుండా శాశ్వత విష్ణు లోకాన్ని పొందుతారు. అంతేకాదు మాఘ మాసంలో కనీసం ఒక్కరోజైనా తెలిసిగాని తెలియకగాని నదీ స్నానం చేసిన వారికి విష్ణు సాయుజ్యం లభిస్తుంది" అని చెప్పాడు. ఇది విన్న కుముదకు కూడా మాఘ స్నానం మీద ఆసక్తి కలిగింది.
ముని వెంట బయల్దేరిన కుముద
ఆ రాత్రి గడిచి బ్రాహ్మీ ముహూర్తం సమీపించింది. ముని పుంగవుడు మాఘ స్నానం కోసం బయలుదేరుతుండగా కుముద తాను కూడా మునీశ్వరునితో నదీ స్నానానికి వస్తానని బయలు దేరింది. ఇంతలో పొరుగూరు వెళ్లిన సుమందుడు తిరిగి వచ్చాడు. మునీశ్వరుని చూసి ఎవరితను అని కుముదను అడిగాడు.
సుమందునికి ముని చెప్పిన విషయాలు చెప్పిన కుముద
కుముద తన భర్త సుమందునికి మునీశ్వరుడు చెప్పిన మాఘ వ్రత మహత్యాన్ని గురించి చెప్పి తాను కూడా మునీశ్వరునితో కలిసి నదీ స్నానానికి వెళ్తున్నట్లుగా చెప్పింది. కుముద మాటలకు ఆగ్రహించిన సుమందుడు మిక్కిలి కోపంతో "మాఘ మంటే ఏమిటి? దాని ఫలితమేమిటి? ఇదంతా నమ్మదగినది కాదు. ఈ విప్రుడు ఏదో మాయ చేస్తున్నాడు. నువ్వు నదీ స్నానం చేయడానికి వీల్లేదు. ఈ చలిలో నదిలో స్నానం చేస్తే చస్తావు. కాదని వెళ్లావంటే నేనే నిన్ను చంపేస్తాను" అని బెదిరించాడు.
మాఘ స్నానం కోసం వెళ్లిన కుముద వెంట పడ్డ సుమందుడు
కుముద మాఘ స్నానం మీద ఆసక్తితో భర్త కాదన్నా వినకుండా ముని వెంట నదీ స్నానానికి బయలు దేరింది. కర్ర తీసుకొని ఆమెను తరుముతో సుమందుడు కూడా వెంటపడ్డాడు. కుముద నదిలో దిగి స్నానం చేయసాగింది. సుమందుడు ఆమెను దండించాలన్న ఉద్దేశంతో తాను కూడా నదిలో దిగి ఆమెను వారించసాగాడు. ఈ పెనుగులాటలో కోపంతోనో, అజ్ఞానంతోనో తెలిసో తెలియకో సునందుడు కూడా నదీ స్నానం చేసేశాడు. మునీశ్వరుడు నదీ స్నానం పూర్తి చేసేయి శ్రీహరిని పూజించి తూర్పు దిక్కుగా పయనమై వెళ్ళిపోయాడు.
విష్ణు దూతలను ప్రశ్నించిన కుముద
కాలక్రమేణా సుమందుడు కుముద వార్ధక్యంతో రోగగ్రస్తులై ఒకేసారి మరణించారు. ఆ సమయంలో కుముద కోసం విష్ణు దూతలు, సుమందుని కోసం యమదూతలు వచ్చారు. కుముదను విష్ణు దూతలు వైకుంఠానికి తీసుకెళ్ళసాగారు. యమదూతలు సుమందుని నరకానికి తీసుకెళ్తుంటే అది చూసి బాధతో కుముద విష్ణు దూతలతో "ఓ విష్ణు దూతలారా! నా భర్త దుర్మార్గుడు అందుచేత అతను నరకానికి వెళ్తున్నాడు. కానీ అతనితో సాంగత్యం చేసిన నేను కూడా దుర్మార్గురాలినే కదా! మరి నన్ను ఎందుకు విష్ణు లోకానికి తీసుకెళ్తున్నారు?" అని ప్రశ్నించింది.
కుముదకు ధర్మసూక్ష్మం చెప్పిన విష్ణు దూతలు - సుమందునికి విష్ణులోక ప్రాప్తి
విష్ణు దూతలు "తల్లి నువ్వు మాఘ మాసంలో ముని పుంగవునికి భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. అతని ద్వారా మాఘ మాస వ్రత మహాత్యాన్ని గ్రహించి మాఘ స్నానం చేసావు. ఆ పుణ్యమే నీకు విష్ణులోక ప్రాప్తిని కలిగించింది" అని చెప్పారు. అప్పుడు కుముద "దూతలారా! నన్ను దండించే ఉద్దేశంతో అయినా సరే నా భర్త కూడా ఆ రోజు నాతో కలిసి నదీ స్నానం చేశాడు. మరి అతనిని ఎందుకు యమ లోకానికి తీసుకెళ్తున్నారు?" అని అడిగింది. అప్పుడు యమ దూతలు చిత్రగుప్తునికి ఆ విషయాన్ని విన్నవించారు. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యాలు లెక్కగట్టి అజ్ఞానంతో చేసినా ఒక్క మాఘ స్నానంతో అతని పాపాలన్నీ పరిహారమయ్యాయి. అతనికి విష్ణు లోకం ప్రాప్తించింది" అని చెప్పగా విష్ణు దూతలు సుమందుని కూడా విష్ణు లోకానికి తీసుకెళ్లారు.ఈ కథను చెబుతూ శివుడు పార్వతితో "పార్వతి! చూశావుగా! సత్సాంగత్యం వలన ఈ దంపతులు ఎలా మోక్షాన్ని పొందారో! మాఘ మాసంలో తెలిసి కానీ, తెలియక కానీ ఒక్కసారైనా నదీ స్నానం చేయడం మోక్షదాయకమని చెబుతూ శివుడు ఆరో అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! షష్టమాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment