వేదాలు, పురాణాలలో చెప్పబడిన కొన్ని కర్మలను, విధులను నిర్వహించడం ద్వారా మనస్సు, శరీరాలకు ఒక గొప్ప విశేషం లేదా పవిత్రత కలిగించడాన్ని సంస్కారం అని చెప్పవచ్చు.
అంటే దోషాలను పోగొట్టి గొప్ప గుణములను కలిగించుట సంస్కారం. ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి చేరుకునేలాగా చేయడమే సంస్కారం. ఇంకోరకంగా చెప్పాలంటే సంస్కారం అంటే మంచి చేయడం.
సంస్కారాల వల్ల మనిషి సంస్కరించబడి దయ, ఓర్పు వంటి ఆత్మసంబంధమైన గొప్ప గుణాలు కలిగి చివరకు బ్రహ్మపదం పొందగలరని గౌతమాది మహర్షులు పేర్కొన్నారు. వివిధ రంగులతో ఒక ఆకారం ఎలా ఏర్పడుతుందో సంస్కారాల వల్ల ఉత్తమస్థితి కలుగు తుందని అంగిరస మహర్షి పేర్కొన్నారు.
ఋగ్వేదం మొదలుకొని నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, నిబంధన గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలలో సంస్కారాల వివరాలు కనిపిస్తాయి.
మనువు, బృహస్పతి, దక్షుడు, గౌతముడు, వశిష్ఠుడు, అంగిరసుడు, యోగీశ్వరుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, వ్యాసుడు, సత్యవ్రతుడు, ఋష్యశృంగుడు వంటి మహనీయు లెందరో సంస్కారాలను ఈ లోకానికి అందించారు.
ఈనాడు 16 సంస్కారాలు అమల్లో ఉన్నాయి. వీటిని "షోడశ సంస్కారాలు" అనే పేరుతో పిలవడం జరుగు తోంది. వీటిలో మనిషి జన్మించడానికి ముందు అనుసరించే సంస్కారాలు అంటే జనన పూర్వ సంస్కారములు మూడు. మనిషి జన్మించిన తర్వాత అనుసరించే సంస్కారాలు అంటే జననానంతర సంస్కారములు పదమూడు. ఈ పదమూడు సంస్కారాల్లో చివరిదైన అంత్యేష్టి మనిషి మరణించాక జరిపే సంస్కారం.
గర్భాదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామ కరణం, నిష్క్రమణ, ఉపవేసనం, అన్నప్రాసన, చూడాకరణం, కర్ణవేధ, అక్షరాభ్యాసము, ఉపనయనం, ఉపాకర్మ, స్నాతకం, వివాహం, అంత్యేష్టి అనేవి షోడశ సంస్కారాలు.
* వివాహానంతరం భార్యా భర్తల తొలిసమాగమం కోసం, మంచి సంతానం కోసం జరిపే సంస్కారం గర్భాదానం
* గర్భదోషాలు తొలగి మంచి సంతానం పుట్టాలని జరిపే సంస్కారం పుంసవనం.
* మాతా, శిశు రక్షణ ఉద్దేశిస్తూ... గర్భిణీ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ చేసే సంస్కారం సీమంతం.
* పుట్టిన బిడ్డ యొక్క బాలారిష్టాలు తొలగించేందుకు చేసే సంస్కారం జాతకర్మ,
* జన్మించిన బిడ్డకు పేరు పెట్టే సంస్కారం నామకరణం.
* బిడ్డను తొలిసారిగా ఇంటినుంచి బయటకు తీసుకొని వచ్చి సూర్యుడిని దర్శింపచేయడం నిష్క్రమణ.
* శిశువుకు మొదటిసారిగా చంద్రుడిని దర్శింపచేయడం ఉపవేశనం.
* బిడ్డకు మొదటిసారిగా ఘనాహారాన్ని అలవాటు చేసే క్రియే అన్నప్రాసన.
* శిశువు పుట్టిన తర్వాత పుట్టువెంట్రుకలు తీయించే సంస్కారం చూడాకరణం.
* చెవులు కుట్టించే క్రియ కర్ణవేధ.
* అక్షరాలు నేర్పించడం ప్రారంభించే కార్యక్రమం అక్షరా భ్యాసం,
* విద్యాభ్యాసం కోసం పిల్లలను గురువు వద్దకు పంపే ముందు చేసే సంస్కారం ఉపనయనం.
* వేదవిద్యనభ్యసించే ముందు చేయబడే సంస్కారానికి ఉపాకర్మ.
* గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత వివాహానికి ముందు చేసే సంస్కారానికి స్నాతకం అని పేరు.
* గృహస్థాశ్రమం ప్రారంభించేందుకోసం జరిపే సంస్కారం వివాహం.
+ మరణానంతరం చేయబడేది అంతిమ సంస్కారం అంటే అంత్యేష్టి
ఈ సంస్కారాలు జరపడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
No comments:
Post a Comment