NAGALAMADAKA SUBRAMANYA SWAMY: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - నాగలమడక - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, January 28, 2025

NAGALAMADAKA SUBRAMANYA SWAMY: శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయం - నాగలమడక

కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించి, స్వామి అనుగ్రహంతో సకల అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.

నాగలమడక ప్రదేశం విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు. నాగలమడక కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కి.మీ. దూరంలో ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

పురాణ ప్రాశస్త్యం

శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడక లో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశం వదలి కామనదుర్గ కాకాద్రి కొండకు ప్రయాణమైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు. ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామి వారి గుడి ఇప్పటికీ ఉండడం విశేషం.

ఆలయ స్థల పురాణం

నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. ప్రతి సంవత్సరం ఆయన నాగలమడక నుంచి కాలి నడకన దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చేవారంట

ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు గారు కుక్కేలో సుబ్రహ్మణ్యుని రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారు. ఆ సమయంలో స్వామి రథాన్ని ఎంతమంది భక్తులు లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందంట! చివరకు అన్నంభట్టు గారు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని స్థానికులు చెబుతారు.

నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర

నాగాభరణం

ఇక సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి వృద్ధాప్యంలో అన్నంభట్టు కుక్కేకు రాలేడని భావించి నాగాభరణంను ఇచ్చి నాగలమడకలోనే ఉంటూ తనను సేవించుకోమని చెప్పినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అన్నంభట్టు ఆ నాగాభరణంను తీసుకువచ్చి నాగలమడకలో ప్రతిష్ఠించడం వల్లనే ఈ ప్రదేశానికి నాగలమడక అని పేరు వచ్చిందంటారు.

పొలం నుంచి ప్రత్యక్షమైన నాగులు

అనంతరం అన్నంభట్టుకు స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్ద నాగప్రతిష్ఠ చేయమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు.

ఆలయ విశేషాలు

ఆలయ నిర్మాణం ప్రారంభ దశలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండ పరచి మంటపాన్ని నిర్మించారు. కొంతకాలానికి రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారానికి సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

భక్తి భావం కలిగించే సుందర విగ్రహం

నాగలమడక లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా ఉంటుంది. మూడు చుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్ప స్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.

పాపాలు పోగొట్టే పుల్లి విస్తర్ల విశిష్టత!

నాగలమడక లో ఒక ఆశ్చర్యకరమైన ఆచారం ఈనాటికీ కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. అందులో విశిష్టమైనది పుల్లి విస్తర్లు. పులి విస్తర్లు అనగా బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు. ఈ పులి విస్తర్లు తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న ఆచారం.

స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం చేసి విడిచిన పుల్లి విస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని పవన పినాకిని నదిలో తలంటు స్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. పూర్తి ఉపవాసంతో ఈ విధంగా చేసిన తర్వాత భక్తులు ఉపవాస దీక్షను విరమించడం విశేషం.

ఎద్దుల పరుష

నాగలమాడకు సుబ్రహ్మణ్యుని బ్రహ్మ రధోత్సవాల సందర్భంగా నిర్వహించే జాతరలో ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ జాతరకు తుముకూరు జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుంటాయి. దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి.

 దర్శనఫలం

అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా పేరొందిన నాగలమడక సుబ్రహ్మణ్యుని దేశవ్యాప్తంగా విశిష్ట ఖ్యాతి వుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని దర్శించడం వలన సమస్త కుజ, రాహు, కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనం.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages