పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శాపగ్రస్తులైన ఇంద్రద్యుమ్నునికి, హూహూ అనేటువంటి ఒక రాక్షసునికి శాపవిమోచనాన్ని కలిగించి మోక్షాన్ని ప్రసాదించినటు వంటి దివ్యదేశమే ఈ 'తిరుకపిస్థలం'. అలాగే కపివానరం. హనుమంతునికి ఈ దేవదేవుడు రాముడిలాగా దర్శనభాగ్యాన్ని కల్గించినందువల్ల ఈ స్థలాన్ని 'కపిస్థలమ్' అని కూడా వ్యవహరిస్తారు. గజేంద్రమోక్షవృత్తాంతం ఎన్నోపురాణాలలో, ఆళ్వారుల యొక్క శ్రీసూక్తములో కూడా కన్పిస్తూంటాయి. ఈ కపిస్థలక్షేత్రాణ్ణి ఒకే ఒక ఆళ్వారు అంటే తిరుమళిశైఆళ్వారు వారు మాత్రమే మంగళాశాసనం చేసి ఉన్నారు.
ఈ క్షేత్రం కావేరీనదీతీరంలో దాదాపు 0.35 ఎకరా స్థలంలో పెద్దప్రాకారంతో, రాజగోపురంతో, శిల్పకళానైపుణ్యంతో విరాజిల్లుతున్నది. కుంభకోణం నుండి తిరువైయ్యార్ వెళ్లేటు వంటి మార్గంలో పాపనాశం రైల్వేస్టేషన్కి మూడుకిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. 'తిరుకపిస్థలమ్', 'కృష్ణా రణ్యక్షేత్రమ్' అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి 'గజేంద్రవరదుడు'. 'కణ్ణన్' అని కూడా ఈ స్వామిని కీర్తిస్తూంటారు. అమ్మవారు 'రమామణివల్లి'.
ఈ ఆలయం యొక్క విమానం గగనాకారవిమానం. తూర్పుముఖం, భుజంగశయనం. హనుమంతునకు గరుత్మంతునికి కూడా ప్రత్యక్షం. తిరుమళిశైఆళ్వార్ కీర్తించినటువంటి క్షేత్రమిది. 108 దివ్యదేశాలలో 5 క్షేత్రాలకు కృష్ణారణ్య క్షేత్ర మనేటువంటి వ్యవహారం కలదు. ఆ అయిదు కూడా 'తిరు కణ్ణంగుడి', 'తిరుకణ్ణమంగై', 'తిరుకణ్ణపురం', 'తిరుక్కోవిలూర్' అలాగే ఈ క్షేత్రం 'తిరుకపిస్థలమ్'. ఈ అయిదు క్షేత్రాలు కృష్ణా రణ్యక్షేత్రంగా వ్యవహరింపబడుతుంది.
స్థలపురాణం
భక్తియోగంచేత భగవదనుగ్రహం లభిస్తుందని శాస్త్రం. ఈ భక్తియోగాన్ని అవలంబించినటువంటి పాండ్యదేశరాజు ఇంద్రద్యుమ్నుడు అతని యొక్క చరిత్రయే గజేంద్రమోక్షం అని చెప్పబడుచున్నది. పాండ్యరాజు ఇంద్రద్యుమ్నుడు శ్రీమన్నారాయణునియందు అమితమైనటువంటి భక్తి కలవాడు. సర్వ దేశసర్వకాల సర్వావస్థలయందు కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానిస్తూనే ఉంటాడు. అంచేత ఇతడి రాజ్యం సుభిక్షంగా ఉండేది. శ్రీమన్నారాయణుడు ఇంద్రద్యుమ్నుడికి మోక్షాన్ని ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఒక చిన్ననాటకాన్ని ఆడుతాడు.
అందులో ఒకానొక సందర్భంలో ఇంద్రద్యుమ్నుడు దేవదేవుణ్ణి ధ్యానం చేస్తున్నటువంటి సందర్భంలో దుర్వాస మహర్షి అచటికి వచ్చాడు. ఈ రాజు భక్తివిశేషం చేత ఎవ్వరిని కూడా చూడలేదు. ధ్యానమగ్నుడైయున్నాడు. ఈ భక్తియోగంలో ఉన్నటువంటి రాజు తన యొక్క కళ్ళను మూసుకోకుండా అలాగే తెరిచి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి దుర్వాస మహర్షి తాను వచ్చినా కూడా చూడనట్టు ఇతడు ఇలా ఉన్నాడా? లేక ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నాడా? సందేహించి తనను అవమానించినటువంటి ఇంద్రద్యుమ్నుణ్ణి ఒక ఏనుగుగా మారమని శాపం ఇచ్చాడు. భగవంతునియందు ఉన్మత్తుడైనటు వంటి రాజు తనయొక్క తప్పును తెలుసుకుని ఆ దుర్వాస మహర్షిని 'స్వామీ! మీరు శాపమిచ్చారు. నన్ను ఏనుగుగా అవమన్నారు. నాది ఒకే ఒక కోరిక. ఈ ఏనుగు జన్మలో కూడా నేను దేవదేవుణ్ణి ఎల్లప్పుడూ స్మరించేటట్టు అనుగ్రహించ మని' వేడుకోగా ఆశ్చర్యంతో దుర్వాసమహర్షి 'ఆహా! శాప విమోచనం ఏమిటి? అని అడగకుండా ఈ రాజు నేను భగవంతుణ్ణి ఎల్లప్పుడు కూడా సేవించుకుంటూ ఉండాలి' అని అడిగాడే, ఎంత దుఃఖం కలిగినా కూడా భగవంతుణ్ణి వదిలి పెట్టనటువంటి భక్తి ఇతనికి ఉన్నదని చాలా సంతోషపడి, “నీవు అనుకున్న విధంగా జరుగును” అని చెప్పి, “మొసలిబారినపడి "నటువంటి నిన్ను శ్రీమన్నారాయణుడే రక్షిస్తాడని, లక్ష్మీవల్లభుడు నీ ఎదురుగా వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు" అని మహర్షి శాపమిమోచనమార్గాన్ని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ సమయంలోనే 'హూహూ' అనేటువంటి ఒక రాక్షసుడు తామరపుష్పాలతో నిండినటువంటి ఒక కొలను లోపల ఉండి, ఆ కొలనులో ఎవరైతే స్నానానికి వస్తారో వారి కాళ్ళను పట్టుకొని హింసించడం మొదలుపెట్టాడు. ఈ ప్రకారంగా అందరిని హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూఉన్నాడు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో అగస్త్యమహర్షి ఆ తటాకానికి రావడం, అతణ్ణి కూడా హింసించడం, ఆ మహర్షి నీవు ఒక మొసలిగా మారిపొమ్మని శాపమివ్వడం జరిగింది.
ఆ 'హూహూ' తాను చేసినటువంటి తప్పును తెలుసు కొని, అగస్త్యమహర్షిని శాపవిమోచనాన్ని వేడుకోగా, మహర్షి కూడా ఈ తామర తటాకంలో తామరపుష్పాన్ని కోయడానికి భగవంతుని యందు అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక గజేంద్రుడొస్తాడు. ఆ గజేంద్రుణ్ణి నీవు పట్టుకుంటే నీకు శాపం తీరుతుంది అని చెప్పడం జరిగింది.
శ్రీహరియొక్క భక్తుడైనటువంటి గజేంద్రుని రాక కొరకు ఆ మొసలి (హూహూ) ఎన్నో సంవత్సరాలు కాచుకొని ఉన్నది. ఈ శాపంచేత ఏనుగుగా మారినటువంటి ఇంద్ర ద్యుమ్నుడు, భగవంతునికి పుష్పాన్ని సమర్పించాలనేటువంటి ఉద్దేశ్యంతో ఈ తటాకానికి రావడం జరిగింది. ఆ సమయంలో అందలి మొసలి ఈ ఏనుగుయొక్క కాళ్ళను గట్టిగా పట్టుకొన్నది. ఏనుగుకు స్థలంలో బలం, మొసలికి జలంలో బలం. మొసలి బలంగా జలానికి ఏనుగుని లాగుతుంటే, ఏనుగు బలంగా ఆ జలంనుండి స్థలానికి లాగుతున్నది. ఇలా వేల సంవత్సరాలు ఏనుగుకి మొసలికి యుద్ధం జరిగింది. తర్వాత ఏనుగు అశక్తుడై తనను కాపాడేటువంటి దైవం భగవంతుడొక్కడే అని తెలుసుకొని ఆ గజేంద్రుడు అతణ్ణి 'అనంతా! గోవిందా! నన్ను కాపాడవా! నన్ను రక్షించవా!' అని ఎలుగెత్తి పిలువగా, ఆ ఏనుగు యొక్క అవస్థను చూసినటువంటి భగవంతుడు, తన భక్తుణ్ణి రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో గరుత్మంతుని పై వచ్చి వెంటనే చక్రా యుధాన్ని ప్రయోగించి మొసలి తలను నరికి, ఏనుగును కాపాడి, తన నిజస్వరూపంతో స్వామి ఏనుగుకి ప్రత్యక్ష మయ్యాడు. అందువల్ల 'గజేంద్రవరదః' అని ఈ స్వామికి పేరు. గజేంద్రుణ్ణి రక్షించాడు కనుక 'గజేంద్రవరదుడు' అనే పేరు కల్గింది. ఏనుగుకు, మొసలికి కూడా మోక్షాన్ని ప్రసాదించినటు వంటి దేవదేవుడు గనుక ఈ 'కపిస్థలమ్' చాలా ప్రసిద్ధమైనది. కనుక ఎవరైతే ఈ దివ్యదేశానికి వచ్చి ఆ స్వామిని వేడు కుంటారో, వారి మనోరథాలనంతా కూడా స్వామి పూర్తి చేస్తాడు. రమామణివల్లితాయార్ సమేతుడై నటువంటి గజేంద్రవరదుణ్ణి సేవించి మనం దేవదేవుని యొక్క కృపాకటాక్షములకు పాత్రులౌతాం.
No comments:
Post a Comment