మాఘ పురాణం మొదటి అధ్యాయం
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణ లోని మాఘ పురాణం మొదటి అధ్యాయం - పరమ శివుడు పార్వతికి మాఘమాసం మహిమ తెలుపుట
శివపార్వతుల సంవాదం
పూర్వం కైలాసంలో శివ పార్వతులు కూర్చుని ఉండగా పార్వతి పరమ శివునితో "నాధా మీ అమృత వాక్కులచే నేను ఎన్నో పురాణాలు విన్నాను. విన్న కొద్దీ ఇంకా వినాలని కుతూహలం కలుగుతున్నది. ప్రయాగ మహాత్య సహితమగు మాఘ మాస మహాత్యమును నాకు సవివరంగా తెలియజేయుము" అని ప్రార్థించగా ఆ కైలాసనాథుడు ప్రసన్న చిత్తుడై "ఓ పార్వతీ! అత్యంత మహిమాన్వితమైన మాఘ మాస మహత్యంను వివరిస్తున్నాను. శ్రద్ధగా వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను.
మాఘ స్నాన మహత్యం
సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ మనుజుడు మాఘ మాసమున ప్రాతఃకాలమందు నదీ స్నానం చేయునో అతడు అన్ని పాపముల నుంచి విముక్తుడై అంత్యమున మోక్షాన్ని పొందును.
మాఘ మాసంలో ప్రాతః కాలమందు ప్రయాగలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠమును చేరుదురు. మాఘ మాసంలో ఊరి చివర చెరువులో కానీ, బావులలో కానీ, కడకు గోవు పాదం మునిగినంత గుంటలో అయినా స్నానం చేసిన వారు సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు.
మాఘ మాసంలో మొదటి రోజు నదీ స్నానం చేస్తే సమస్త పాపం నశించును. రెండవరోజు చేసే నదీ స్నానంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మూడవ రోజు స్నానం చేసిన పుణ్యాత్ములకు ఎలాంటి పుణ్య ఫలం ఇవ్వాలో ఆ విష్ణుమూర్తికే అంతు పట్టదంట! ఇక మాఘ మాసం మొత్తం నదీ స్నానం చేసిన వారి పుణ్యఫలం అంతులేనిది. అంటూ శివుడు పార్వతితో ఇంకను ఇట్లు చెప్పసాగెను.
పార్వతీ! మాఘ మాసమున సూర్యుడు ఉదయించుచున్న సమయంలో ప్రయాగలో గంగలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘ మాసంలో స్నానం చేయుటకు శక్తి లేనివారు, జలాశయాలు లేనివారు గోవు పాదం మునిగేంత నీటిలో మర్దన చేసుకుంటూ స్నానం చేసినా సరే సకల పాతకాలు నశిస్తాయి.
మాఘ మాసమంతా శ్రద్ధాసక్తులతో, భక్తితో స్నానం చేసి, శ్రీ మహావిష్ణువును అర్చించి మాఘ పురాణ పఠనం చేసిన వారు విష్ణు లోక ప్రాప్తిని పొందుటయే కాకుండా వైకుంఠాధిపతి కాగలరు. మాఘ పురాణ పఠనం, కానీ శ్రవణం కానీ నది ఒడ్డున చేసినచో ఆ పుణ్యం అనంతం.
మాఘ స్నానం చేయని వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
మాఘ మాసమున చలికి భయపడి కానీ, సిగ్గుతో కానీ, ఇతర ఏ కారణాలతో కానీ కనీసం ఒక్కరోజయినా నదీ స్నానం చేయని వారు కుంభీపాక నరకంలో పడి కొట్టుకుంటారు.
సకలదోష పరిహారం మాఘ స్నానం
పార్వతీ! బ్రహ్మ హత్య చేసిన వాడు, మద్యపానం సేవించేవాడు, కన్యలను అపహరించేవాడు, గురుపత్నిని పొందేవాడు, బంగారం దొంగిలించేవాడు, దుష్టులతో సహవాసం చేసేవారు ఇంకా ఘోరమైన పాపాలు చేసే వారు కూడా మాఘమాసంలో ఒక్కసారైనా నదీస్నానం చేసినట్లయితే సమస్త పాపముల నుంచి విముక్తులై శ్రీహరిని చేరుతారు.
ఒక వేళ అనారోగ్య కారణాలచేత మాఘ మాసంలో నదీ స్నానం చేయలేనివారు తమకు బదులుగా వేరొకరికి కొంత ధనం ఇచ్చి సంకల్ప పూర్వకంగా నదీస్నానం చేయించినట్లైతే వారు స్వయంగా మాఘ స్నానం చేసిన ఫలం దక్కును.
చివరగా ఆ పరమ శివుడు పార్వతితో 'ఓ పార్వతీ! ఎవరు భక్తితో మాఘ మాసంలో మొదటి రోజు నదీ స్నానం చేసి ఈ కథను చదవడం కానీ వినడం కానీ చేస్తారో వారు కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. స్నానం చేయలేక పోయినా కనీసం మాఘ పురాణం చదివినా, విన్నా ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణానంతరం విష్ణులోక ప్రాప్తిని పొందుతారు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ప్రథమాధ్యాయ సమాప్తః
No comments:
Post a Comment