Chintamani Ganapathi Temple: చింతామణి గణపతి ఆలయం

మహారాష్ట్రలో వెలసిన అష్ట వినాయక క్షేత్రాలు ఒక క్రమ పద్ధతిలో దర్శిస్తేనే దర్శన ఫలం ఉంటుందని అంటారు. ఆ క్రమంలో దర్శించాల్సిన ఐదవ క్షేత్రం చింతామణి గణపతి క్షేత్రం. 

ఈ క్షేత్రం మహారాష్ట్ర పూణే జిల్లా హవేలీ తాలూకాలోని ధేవూర్‌లో వెలసింది. 

పూర్వం కపిల మహర్షి దగ్గర కోరికలు నెరవేర్చు చింతామణి ఉండేది. రాజ వంశానికి చెందిన గణరాజు ఆ చింతామణిని బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు. కపిల మహర్షి అభ్యర్థన మేరకు ఆ రాజును గణపతి సంహరించి ఆ చింతామణిని కపిల మహర్షికి అప్పగించాడు. కపిల మహర్షి చింతామణిని గణపతి మెడలో అలంకరిప్తాడు. కపిల మహర్షి కోరిక మేరకు గణపతి ఇక్కడ కొలువుదీరాడు. అందువలనే ఇక్కడి స్వామిని చింతామణి స్వామిగా భక్తులు పూజిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

చింతామణి గణపతి ఆలయంలో గణపతిని దర్శించి పూజిస్తే ఎలాంటి చింతలైనా దూరమవుతాయని, కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు.

చింతామణి గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.

చింతామణి గణపతి ఆలయాన్ని చేరుకోవడానికి విమానం కానీ, రైలులో కానీ పుణెకు చేరుకుంటే అక్కడ నుంచి సులభంగా స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు.

No comments