Pavagada Shani Temple: శ్రీ శనీశ్వరుడి ఆలయం - పావగడ

 

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని పావగడలో వెలిసిన శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. పావగడలో వెలసిన శనీశ్వరుని దర్శనం కోసం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందని, ఆగిపోయిన పనులు పూర్తవుతాయని విశ్వాసం.

ఆలయ చరిత్ర

పావగడను హొయసులు, మొఘలులు, మైసూర్ రాజులు ఇలా ఎందరో పాలించారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు నుంచి గట్టెక్కేందుకు ఆ ఊరి ప్రజలంతా కలిసి సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడు ఆ మునులు ఒక నల్లరాతిని తీసుకొని, శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమిపై ప్రతిష్టించారు.

తీరిన కరువు

భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా కురిసి కరువు కాటకాల నుంచి ప్రజలకు విముక్తి లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగాలు జరిపిస్తుంటారు.

శనీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ

కొన్నేళ్ల క్రితం అమ్మవారి విగ్రహం పక్కన శనీశ్వరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భక్తులు సంకల్పిస్తారు. భక్తులంతా కలిసి శీతలాదేవి పక్కనే శనీశ్వరుని ప్రతిష్టిస్తారు. ఇక్కడ శనీశ్వరుని ప్రతిష్టించాక అమ్మవారి దేవాలయం కాస్తా శనీశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందినది.

ఆలయ విశేషాలు

పావగడ శనీశ్వరుని ఆలయం ఇతర ఆలయాలకంటే భిన్నంగా వృత్తాకారంలో ఉంటూ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయంలోని ఒక పెద్ద మండపంపై శీతలాదేవి వెలసి ఉంది. దాని చుట్టూ రంగురంగుల దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి.

విఘ్నాలను గణపతి విగ్రహం

ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమవైపు గణపతి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని మొదట దర్శించాకే భక్తులు అమ్మవారిని, శనీశ్వరుణ్ణి మరియు ఇతర దేవతలను దర్శిస్తారు.

సంతాన భాగ్యం కలిగించే అశ్వత్థ వృక్షం

గణపతి విగ్రహానికి కుడివైపున అశ్వత్థ చెట్టు భక్తులకు దర్శనమిస్తుంది. అక్కడే శీతలాదేవి మహాబీజాక్షర యంత్రం కనిపిస్తుంది. పిల్లలు లేనివారు అశ్వత్థ వృక్షాన్ని పూజించి, అమ్మవారికి రంగురంగుల గాజులు సమర్పిస్తారు. శీతలాదేవిని పూజించిన భక్తులకు సంతాన భాగ్యంతో పాటు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

శనీశ్వరుని సన్నిధి

శీతలాదేవి ఆలయం వెనక శనీశ్వరునికి ప్రత్యేక సన్నిధి కలదు. ఈ సన్నిధిలో నవగ్రహాల మధ్య కవచం ధరించి ఉన్న శనీశ్వరుణ్ణి గమనించవచ్చు. ప్రతి శనివారం, శనిత్రయోదశి, శని జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, వ్రతాలు జరుగుతాయి.

ప్రాకార పూజలు

వివాహం ఆలస్యం అయ్యేవారు, సంతానం లేని వారు, వ్యాపారంలో వృద్ధి కోరుకునేవారు శనీశ్వరుని సన్నిధిలో పెళ్లి జరగటానికి మాంగళ్య పూజ, వ్యాపారంలో వృద్ధి చెందటానికి ప్రాకార పూజ జరిపించుకుంటే సత్వర ఫలితం ఉంటుందని నమ్మకం. కోరికలు నెరవేరిన భక్తులు తిరిగి శీతలా దేవి, శనీశ్వరుడు ఆలయాన్ని వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

రోజూ వేలాది మంది దర్శించుకునే ఈ పావగడ క్షేత్రంలో ఎత్తైన గోపురాలు, శిల్పకళా తోరణాలు లేకున్నా ఆలయం కళాత్మకంగా, చూడముచ్చటగా ఉంటుంది. పావగడ పక్కనే కొండ మీద పెద్ద కోటను కూడా సందర్శించవచ్చు.

ఇలా చేరుకోవచ్చు

అనంతపురం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో, తుముకూరు నుండి 98 కిలోమీటర్ల దూరంలో, కళ్యాణ దుర్గం కు 60 కిలోమీటర్ల దూరంలో పావగడ కలదు. పావగడ కు సమీపాన 40 కి. మీ ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఆంధ్రా సరిహద్దులో ఉన్న దేవాలయం కాబట్టి తెలుగు భక్తులు కూడా అధికసంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు.

Comments

Popular posts from this blog

Jyestha Suddha Trayodashi: దౌర్భాగ్య నాశక త్రయోదశి

Snana Purnima: స్నాన పూర్ణిమ

Jyestha Purnima: జ్యేష్ట పూర్ణిమ

SKANDAGIRI SUBRAMANYA SWAMY TEMPLE: స్కందగిరి సుబ్రమణ్యస్వామి ఆలయం - సికింద్రాబాద్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Tirumala Suprabatha Seva: శ్రీవారి సుప్రభాత సేవ

Margashira Vratam: మార్గశిర లక్ష్మివార వ్రతం

Tholi Ekadasi: తొలి ఏకాదశి | శయన ఏకాదశి

Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 19 వ అధ్యాయం

Lord Shiva Darshan: శివదర్శనం ఏయే వేళల్లో చేయాలి? శివదర్శన ఫలం ఏమిటి?