Udaya Kaleswara Swamy Temple: శ్రీ గంగ పార్వతి దేవి సమేత ఉదయ కాళేశ్వర స్వామి ఆలయం - గండవరం

ఈ ఆలయం నెల్లూరుకు ఉత్తర భాగాన, కావలికి వెళ్లే  మార్గమధ్యంలో నెల్లూరుకు 16 కి.మీ.దూరంలో ఉంది.

పూర్వం భగీరథుడు గంగను ఈ భూమి మీదకు రప్పిం చడం కోసం, తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి, స్వామివారి తేజోరూపాన్ని లింగరూపంగా ప్రసాదించమని కోరాడు. అతని కోరిక మేరకు పరమశివుడు తన తేజో రూపమైన లింగాన్ని భగీరథుడికి ప్రసాదించాడు. ఆ దివ్యతేజో లింగాన్ని ఇస్తూ "భగీరథా! గంగ భువికి ధారగా వచ్చినచో, ఈ భూప్రపంచమంతా కల్లోలమౌతుంది. అందుచేత, ఈ తేజో లింగరూపాన్ని భూమియందు ప్రతిష్టించి, గంగను ప్రార్థిస్తే, ఆమె నా శిరస్సు మీద ధారగా పడుతుంది. ఆ జలాన్ని నీకు ప్రసాదంగా ఇస్తానని" చెప్పాడు. అలా లింగాన్ని సంపాదించిన భగీరథుడు పరమేశ్వరుడు చెప్పిన విధంగానే లింగాన్ని భూమియందు ప్రతిష్ఠించి గంగను ప్రార్ధించాడు. ఆ ప్రార్ధనకు మెచ్చిన గంగ భూమికి తరలి వచ్చి శివుని శిరస్సుపై దారగాపడెను.

అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈశ్వరుడు అగ్ర హించి, "భగీరథా! నీవు నా తేజోలింగరూపాన్ని అపవిత్రం చేశావని" చెప్పాడు. భగీరథుడు ఆశ్చర్యపోయి "స్వామీ! నేను చేసిన తప్పు ఏమిటని" అడిగాడు. అప్పుడు శివుడు "గంగ భూమికి వచ్చే సమయంలో వాయువులో జీవించే అనేక జీవరాశులు మరణించి గంగతో కలిసి నా తేజోలింగంపై పడ్డాయి" అని చెప్పాడు. ఆ పాపానికి నిష్కృతిని క్లుప్తంగా వివరించమని భగీరథుడు పరమశివుణ్ణి ప్రార్ధించాడు. అంతట శివుడు, కాశీ క్షేత్రం నుండి రామేశ్వర క్షేత్రం వరకు గల లింగరూపాలను దర్శించి, పూజాదికాలు ఆచరిస్తే శాపవిముక్తి కల్గుతుందని చెప్పాడు. భగీరథుడు ఆ విధంగానే, మొదలు పెట్టి కాశీక్షేత్రం నుంచి శైవక్షేత్రాల్ని దర్శించుకుంటూ, రామేశ్వర క్షేత్రం వైపుగా పయనమయ్యాడు. 

మార్గమధ్యంలో 'గ్రంథినాపురం' అనే గ్రామానికి వచ్చే సమయానికి సూర్యాస్తమయం కావడంతో సంధ్యాదికాలు నిర్వ హించడం కోసం ఆ గ్రామంలో గల వాగునందు స్నానమా చరించి, సంధ్యాదికాలు పూర్తి చేసుకొని పరమశివుని ధ్యానం గావించుకొంటూ ఉండగా సుగంధ పరిమళ పవనం వీచింది. భగీరథుడు ఆ సువాసన ఎక్కడ నుంచి వస్తుందో చూద్దామని పశ్చిమదిశగా పయనించాడు. వాగుకు కొద్దిదూరంలోనే ఒక స్మశానంలో ఉన్న నాగవల్లి వృక్షం నుండి ఆ పరీమళం వస్తు న్నట్లుగా గమనించాడు. వృక్షం వెనుక భాగంలో ఒక చితి వెలుగుతుండడం గమనించిన భగీరథుడు అక్కడికి పోరాదని వెనుతిరిగాడు. ఆ రాత్రికి వాగు తీరంలో విశ్రమించాడు.

బ్రాహ్మీముహూర్తంలో భగీరథుడు నిద్రలేచి కాల కృత్యాలు తీర్చుకొని, సూర్యోదయమయ్యే సమయానికి అర్ఘ్య ప్రదానం గావించాడు. మహర్షుల అర్ఘ్య ప్రదానాన్ని స్వీకరించే సూర్యభగవానుడు. భగీరథుడి అర్ఘ్య ప్రదానాన్ని స్వీకరించకుండా ప్రచండ సూర్యకిరణాలను వాగుకు సమీపంలో గల స్మశానమందు చితికి మధ్యభాగంలో వికసింపజేశాడు. అది చూచిన భగీరథుడు తన అర్ధ్యాన్ని స్వీకరించకుండా ఈ ప్రచండ సూర్యకిరణాలు, ఈ స్మశానమందు ప్రసరిస్తున్నాయి. దీనికి గల కారణం ఏమై ఉంటుందోనని పరీక్షించాలనుకున్నాడు. ఈ చితిని చేతితో తాకితే చేతులు అపవిత్రమౌతాయని భావించి, కుడికాలితో చితిని నెట్టాడు. అందులోని పరమశివుని పానవట్టమునకు భగీరథుడి కుడికాలి బొటనవేలు తగిలి చితికి రక్తం చిందింది. దాంతో ఆగ్రహం చెందిన భగీరథుడు "ఇక్కడ ఎంత శక్తి ఉన్నా నిర్జీవ మగుగాక!" అని శపించాడు. దీనికి ఆగ్రహించిన పరమశివుడు ఆకాశవాణి రూపంలో "భగీరథా! నీవు చేసిన పాపానికి నిష్కృతిగా శివక్షేత్రాలు దర్శించుకుంటున్నావు. మరలా నన్ను నీ కాలితో స్పృశించి అపవిత్రం గావించావు, దీనికి నీ ఆత్మశక్తి అంతా ఇక్కడే నాయందే విడిచిపెట్టాలని" పరమశివుడు భగీ రథుణ్ణి శపించాడు.

భగీరథుడు పశ్చాత్తాపపడి తర్వాత ఆత్మశక్తినంతా, ఆ గ్రంథినాపురక్షేత్ర పరమశివునకు అర్పించి, పదకొండు వెదురు చెట్లను స్వామి వారి వృత్తాకారంలో నిర్మించి, స్వామి వారికి ఒక పుట్టను చేసి, ఒక సర్పాన్ని అమర్చి భగీరథుడు ఈ స్వామి వారు ఉదయకిరణాలతో ఆవిర్భవిస్తున్నాడు కాబట్టి ఈ స్వామి శ్రీ ఉదయకళేశ్వరస్వామి అని నామస్మరణ చేసి పూజాదికాలు నిర్వహించి ఆ తర్వాత, రామేశ్వరక్షేత్రానికి పయన మయ్యాడు.

ఇలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత చోళులు, పల్లవులు ఈ ఆలయనిర్మాణం గావించారు. ఆలయ నిర్మా ణంలో భాగంగా గ్రంథినాపుర గ్రామానికి, వెనుక భాగంలో గల మరొక గ్రామానికి మధ్యభాగంలో ఇరుగ్రామాలకు సమాం తర భాగంగా స్వామివారి పుట్ట ఉండేటట్లుగా, పుట్టను విస్త రింపజేశారు. గ్రంథినాపురంలో గల ప్రధాన తహశీల్దార్ ఆ పుట్టను భక్తితో పూజించాలని శాసించాడు. గ్రంథినాపురంలోని భక్తజనమంతా భక్తిశ్రద్ధలతో ఆ పుట్టను పూజించుకోసాగారు. గ్రంథినాపురానికి వెనుకభాగంలో గల మరొక గ్రామ తహ శీల్దార్కు సంబంధించిన ఒక వేశ్య ఆ పుట్టను పూజించడానికి వచ్చింది. ఆమెను గ్రంథినాపుర భక్తజనులంతా ఆమె చండాల స్త్రీ అనీ, అలాంటి వారు దేవాలయాలకు రాకూడదని అవమా నించారు. ఆ బాధతో వెనుతిరిగిన ఆమె తాను పూజ చేయని పుట్ట అక్కడ ఉండరాదని, ఆ పుట్టను కూల్చేసి తనకు ఒక గృహాన్ని నిర్మించమని, తన దగ్గరకొచ్చే తహశీల్దార్ను కోరింది. వేశ్యావ్యామోహంలో ఉన్న అతను ఆమె చెప్పిన విధంగానే చేయడానికి సిద్ధపడ్డాడు.

ఆ పుట్టను కూల్చివేయడానికి కూలీలు వెళ్లగానే, పుట్ట దగ్గరకు రానివ్వకుండా, భయంకరమైన గాలులు వీచాయి. ఒక పక్షంరోజులు ఇలా జరగడం గమనించిన తహశీ ల్దారు, తానే స్వయంగా గునపాన్ని తీసుకు వెళ్ళి పుట్టపై గుచ్చాడు. దానితో ఫెల్లున ఒక మెరుపు వచ్చి ఆ తహశీల్దార్ కళ్ళు రెండూ పోయాయి. పుట్టలోని ఉదయకళేశ్వర స్వామివారి శిరస్సు ఉత్తర భాగంలో గాయమేర్పడి ధారగా రక్తం వచ్చింది.

ఆ రాత్రి చోళ్ళ అనే పల్లవరాజు గారి తాతగారి కలలో కనబడి, రక్తము కార్చుకొంటూ ఒక రాజు నాకు ఉన్న నీడను చెరిపేసి, నా తలకు గాయం చేశాడు. నువ్వు తక్షణమే నా వద్దకు వచ్చి నా గాయానికి ఔషధం రాసి, నాకు ఆలయ నిర్మాణం గావించమని చెప్పి స్వామివారు అదృశ్యమయ్యాడు. రాజుగారు ఉలిక్కిపాటుతో నిద్రలేచి, తక్షణమే స్వామివారిని చూడవలెననే కాంక్షతో గ్రంథినాపుర గ్రామానికి చేరి, ఆ పుట్ట ఎక్కడున్నదో శోధించి, భటులచే నీళ్ళను తెప్పించి ఆ పుట్టపై పోయసాగాడు. అలా పోసిన కొంతసేపటికి పుట్టంతా కరిగి స్వామివారు దివ్య లింగరూపంలో దర్శనమిచ్చాడు. రాజుగారు ఆలయనిర్మాణం చేపట్టాడు.

కొంతకాలం తర్వాత రాజుగారు ఆలయనిర్మాణం పూర్తి గావించి, అక్కడ నిద్రిస్తుండగా, జగన్మాత అయిన పార్వతీ దేవి, తాను కూడా అదే స్థలంలో ఉత్తరదిక్కున ఉన్నానని, తనకు కూడా ఆలయం నిర్మించమని చెప్పి అదృశ్యమయ్యింది. మరుసటి రోజు ఉదయం రాజు పార్వతీదేవి చెప్పిన విధంగానే, స్వామివారి ఉత్తరదిశగా వెతుకుతుండగా, అమ్మవారి దివ్య మంగళ విగ్రహం ఆయనకు కన్పించింది. మిక్కిలి సంతోషపడిన రాజు, ఎక్కడ దొరికిందో అక్కడే ఆలయాన్ని నిర్మించి, దక్షిణ ముఖంగా ప్రతిష్ఠించాడు.

అప్పటినుంచి శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కళేశ్వరస్వామి వారిని సేవించుకున్నవారు ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా, అప్లైశ్వర్యాలతో తులతూగుతారని భక్త జనుల విశ్వాసం. స్వామివారికి మాఘబహుళనవమి నుండి ఫల్గుణ శుద్ధ తదియ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ